భద్రాచలం.. కలియుగ వైకుంఠం

ABN , First Publish Date - 2022-12-31T23:30:45+05:30 IST

ముక్కోటి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రాద్రి రామయ్యకు గోదావరిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 23నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం కాగా తొలి పది రోజుల పాటు పగల్‌పత్తు ఉత్సవాలను నిర్వహించారు.

భద్రాచలం.. కలియుగ వైకుంఠం
అధ్యయనోత్సవ వేదిక వద్దకు స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళుతున్న దృశ్యం

06kmm31bcm-mukkoti.jpgశ్రీకృష్ణావతారంలో భద్రాద్రి రామయ్య

నేడు రామయ్యకు గోదావరిలో తెప్పోత్సవం

ముక్కోటి వేళ రేపు ఉత్తర ద్వార దర్శనం

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

భద్రాచలం, డిసెంబరు 31: ముక్కోటి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రాద్రి రామయ్యకు గోదావరిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 23నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం కాగా తొలి పది రోజుల పాటు పగల్‌పత్తు ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు దశావతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం శ్రీసీతారామచంద్రస్వామి శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హంసాలంకృత వాహనంపై ఆదివారం నిర్వహించే తెప్పోత్సవానికి గోదావరి తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే ముక్కోటి సమయాన సోమవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారంలో శ్రీ సీతారామచంద్రస్వామి వైకుంఠ రాముని అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం దేవస్థానం, రెవెన్యూ, నీటిపారుదల శాఖ, పంచాయతీ, తదితర శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసు శాఖ బందోబస్తుపై దృష్టి సారించింది. ముక్కోటిని పురస్కరించుకొని దేవస్థానం ఆధ్వర్యంలో రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. కరోనా కారణంగా రెండేళ్ల తరువాత తొలిసారి ముక్కోటి ఉత్సవాలను భక్తుల సమక్షంలో నిర్వహిస్తున్నారు. దాంతో భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏర్పాట్లపై ఇప్పటికే రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్పీ డా. వినీత, భద్రాద్రి దేవస్థానం ఈవో బి.శివాజీల పర్యవేక్షణలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

శ్రీకృష్ణావతారంలో భద్రాద్రి రామయ్య

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీకృష్ణవతారాన్ని అందంగా అలంకరించారు. అనంతరం నిత్యకల్యాణ మండపంలో శ్రీకృష్ణావతారరూపుడైన స్వామి వారిని ఊయల్లో వేంచిపజేసి ఊంజల్‌సేవ నిర్వహించారు. అనంతరం స్వామి వారిని నడుమ అధ్యయన వేదికకు తీసుకొచ్చారు. భక్తుల దర్శనం అనంతరం స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో బి.శివాజీ, ఏఈవో శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:30:45+05:30 IST

Read more