పేట.. మురుగే ముప్పేట!

ABN , First Publish Date - 2022-03-06T04:32:51+05:30 IST

‘పంచాయతీలో నిండుగా నిధులున్నాయి. సిబ్బందీ ఉన్నారు. అయిన్పటికీ డ్రెయినేజీలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి ఇదేనా పరిశుభ్రత’ ఈమాటలు అన్నది ఏ సామన్య వ్యక్తినో, వార్డు సభ్యులో కాదు స్వయానా జిల్లా కలెక్టర్‌.. అశ్వారావుపేటలో గురువారం పర్యటించిన చేసిన జిల్లా కలెక్టర్‌ వడ్డెర బజారులో డ్రెయినేజీ వ్యవస్థను చూసి అధికారులపై ఆగ్రహించి అన్న మాటలు ఇవి.

పేట.. మురుగే ముప్పేట!
కోనేరుబజారులో ఇళ్ల మధ్యనే ఉన్న మురికికూపం

పట్టణంలో అధ్వానంగా పారిశుధ్యం

పూడుకుపోయిన డ్రెయినేజీలు

వానాకాలం వస్తే అంతే సంగతులు

కలెక్టర్‌ ఆగ్రహించినా ఫలితం శూన్యం

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

అశ్వారావుపేట రూరల్‌, మార్చి 5: ‘పంచాయతీలో నిండుగా నిధులున్నాయి. సిబ్బందీ ఉన్నారు. అయిన్పటికీ డ్రెయినేజీలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి ఇదేనా పరిశుభ్రత’ ఈమాటలు అన్నది ఏ సామన్య వ్యక్తినో, వార్డు సభ్యులో కాదు స్వయానా జిల్లా కలెక్టర్‌.. అశ్వారావుపేటలో గురువారం పర్యటించిన చేసిన జిల్లా కలెక్టర్‌ వడ్డెర బజారులో డ్రెయినేజీ వ్యవస్థను చూసి అధికారులపై ఆగ్రహించి అన్న మాటలు ఇవి. దీనిని బట్టే తెలుస్తుంది అశ్వారావుపేటలో పారిశుధ్య పరిస్థితి. గతంలో పనిచేసిన కలెక్టర్‌ అశ్వారావుపేటకు వచ్చిన సందర్భంలో రెండు సార్లు పారిశుధ్యం అధ్వానంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మిగిలిన జిల్లా పంచాయతీ అధికారులు అనేకసార్లు తమ పర్యటనలో స్థానిక పంచాయతీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ నుంచి ఎంతమంది అధికారులు ఆగ్రహించి, అసహనం వ్యక్తం చేసినా పేటలో పారిశుధ్యంలో మాత్రం ఎటువంటి ఫలితం ఉండటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్లో పారిశుధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ నిధులను కేటాయిస్తున్నా అశ్వారావుపేటలో ఇవేమీ కనిపించడంలేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధ్వానంగా పారిశుధ్యం

అశ్వారావుపేటలో దాదాపు 20వేల మంది జనాభా ఉంది. పంచాయతీకి ఏటా రూ.కోట్లలోనే నిధులు వస్తున్నాయి. ఇవి కాక పన్నులు, ఇతర రూపాల్లో పుష్కలంగా ఆదాయం ఉంటుంది. అయినా అశ్వారావుపేటలో పారిశుధ్యం మాత్రం అధ్వానంగా ఉంటోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణంలో అనేక చోట్ల డ్రెయినేజీలు చెత్తా చెదారం, పిచ్చిచెట్లతో నిండిపోయి ఉంటున్నాయి. పట్టణంలోని వడ్డెర బజారు. జల్లిపల్లి వారి వీధి, కోనేరుబజారు ఇలా ఏ కాలనీ చూసినా అదే పరిస్థితి. ఇక గాంధీబొమ్మ సెంటర్‌లో మురుగునీరే పారడం లేదు. అనేక చోట్ల చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. పంచాయతీ ఆధ్వర్యంలో ప్రఽధాన వీధుల వెంట చెత్తను ఎత్తుతున్నా ఇతర ప్రాంతాలపై పెద్దగా దృష్టిపెట్టటంలేదని పట్టణవాసులు వాపోతున్నారు. సాధారణంగా వానాకాలంలో ఎక్కడైనా పారిశుధ్యలోపం కనిపిస్తుంది, కానీ అశ్వారావుపేటలో కాలా లతో సంబంధం ఉండదు. ఎండాకాలంలోనే ఇలా ఉంటుంటే వానాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్‌ ఆగ్రహించినా అలాగే డ్రెయినేజీ

పట్టణంలోని వడ్డెరబజారులోని పాఠశాలను కలెక్టర్‌ సందర్శించిన సమయంలో పంచాయతీ సిబ్బంది అక్కడే డ్రెయినేజీలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తీసి రోడ్డుపై వేయడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే. డ్రెయినేజీ నిండా చెత్తాచెదారం ఉండగా దానిని పరిశుభ్రం చేయాల్సిన అధికారులు కలెక్టర్‌ వెళ్లిన తరువాత కూడా అలాగే వదిలేసి వెళ్లారు. కలెక్టర్‌ వచ్చిన సమయంలో చేసిన పనితప్ప ఆ తరువాత డ్రెయినేజీలో చెత్తను తీయనేలేదు. పట్టణంలో శనివారం పరిశీలించింది. అధికారుల పర్యవేక్షణాలోపం కళ్లకు కట్టింది. సాధారణంగా జిల్లా కలెక్టర్‌ ఏదైనా పనిపై ఆగ్రహం వ్యక్తం చేసినపుడు దానిని పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపడతారు. కానీ అశ్వారావుపేటలో పంచాయతీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు తక్షణమే డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలిగించాలని వీధివాసులు కోరుతున్నారు. 

పారిశుధ్య లోపం లేకుండా చర్యలు: ఈవో హరికృష్ణ

పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. పంచాయతీకి త్వరలోనే ట్రాలీ ఆటోలు వస్తాయి. వాటి ద్వారా ఇంటింటికి తిరిగి చెత్తసేకరణ చేపడతాం. సిబ్బంది కూడా అదనంగా వచ్చే అవకాశం ఉంది. పట్టణాన్ని ఏరియాలుగా విభజించి పారిశుధ్య పనులు చేపడతాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తాం. 


Updated Date - 2022-03-06T04:32:51+05:30 IST