ఆర్టీసీకి సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2022-12-09T00:55:34+05:30 IST

ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంపై సంస్థ దృష్టిసారించింది. నవంబరు 13వ తేదీన ఖమ్మం డివిజనలో గ్రాండ్‌ హెల్త్‌ చాలెంజ్‌ పేరిట సిబ్బంది ఆరోగ్య పరీక్షలను ప్రారంభించింది.

ఆర్టీసీకి సంపూర్ణ ఆరోగ్యం
ఉద్యోగులకు హెల్త్‌ ప్రొఫైల్‌ అందిస్తున్న డాక్టర్‌ గిరిసింహారావు

విజయవంతంగా ‘గ్రాండ్‌ హెల్త్‌ చాలెంజ్‌’

ఉద్యోగుల హెల్త్‌ప్రొఫైల్‌ ఆనలైనలో అప్‌లోడ్‌

17రకాల వైద్య పరీక్షల్లో సిబ్బంది పాస్‌

ఖమ్మం ఖానాపురం హవేలీ, డిసెంబరు 8: ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంపై సంస్థ దృష్టిసారించింది. నవంబరు 13వ తేదీన ఖమ్మం డివిజనలో గ్రాండ్‌ హెల్త్‌ చాలెంజ్‌ పేరిట సిబ్బంది ఆరోగ్య పరీక్షలను ప్రారంభించింది. డిపోల వారీగా డ్రైవర్లు, కండక్టర్లు, అద్దె బస్సుల డ్రైవర్లు, కార్యాలయ సిబ్బందికి వివిధ రకాల వైద్యపరీక్షలు చేసి హెల్త్‌ ప్రొఫైల్‌ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 17రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మూత్రపిండ, గుండె జబ్బులు, థైరాయిడ్‌, షుగర్‌, బీపీ, రక్త పరీక్షలు, కంటి పరీక్షలు, ఈసీజీ, మోకాళ్ల నొప్పుల పరీక్షలు సహా ఇతరత్రా పరీక్షలన్నీ చేస్తున్నారు

కొనసాగుతున్న వైద్య పరీక్షలు

టీఎస్‌ ఆర్టీసీ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ గిరిసింహారావు ఆధ్వర్యంలో ‘టీఎస్‌ఆర్టీసీ గ్రాండ్‌ హెల్త్‌ చాలెంజ్‌’లో సంస్థ ఉద్యోగులు, సిబ్బందికి మొత్తం 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేకంగా గుండె జబ్బులపై అవగాహన కల్పించారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన ఆహారం గురించి, నిద్రలేమి, ఒత్తిడిని అధిగమించేందుకు పాటించాల్సిన నియమాలు, ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఖమ్మం రీజియన పరిధిలోని భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి, మధిర, ఖమ్మం డిపోలలో ఈనెల 2వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2,800 మంది బస్సు డ్రైవర్లలో 16మందిని హైదరాబాద్‌ రిఫర్‌చేశారు. మణుగూరు డిపోలో నవంబరు 18 నుంచి 23వరకు 337 మందికి, భద్రాచలం డిపోలో నవంబరు 24 నుంచి 27వరకు మొత్తం 422 మందికి, కొత్తగూడెం డిపోలో నవంబరు 28 నుంచి డిసెంబరు 2 వరకూ 304 మందికి ఈ పరీక్షలు నిర్వహించారు. వీరిలో భద్రాచలం డిపోలో నలుగురు, మణుగూరు డిపోలో ముగ్గురు స్వల్పకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారిని వెంటనే హైదరాబాద్‌కు రిఫర్‌ చేశారు.

ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రయాణికులు సురక్షితం

డాక్టర్‌ ఏవీ గిరిసింహారావు, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌

సిబ్బంది ఆరోగ్యంపై ఆర్టీసీ సంస్థ దృష్టిసారించింది. డ్రైవర్లు, కండక్టర్లు ఆరోగ్యంగా ఉంటేనే ప్రయాణికుల ప్రయాణం సురక్షితంగా ఉంటుందన్న భావనతో వారితో పాటు మిగతా సిబ్బంది అందరికీ ఆరోగ్య పరీక్షలకు కార్యాచరణ చేశారు అధికారులు. ప్రతీ ఒక్కరికీ హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించడంతో పాటు ఆర్యోగంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సూచించాం. ఈ వైద్య పరీక్షల్లో దాదాపు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. కొందరు స్వల్పకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టు గుర్తించి తదుపరి చికిత్సల కోసం రిఫర్‌ చేశాం.

జాగ్రత్త పడేందుకు అవకాశం

బి.శ్రీను, ఖమ్మం డిపో డ్రైవర్‌

ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ, డ్రైవర్‌, కండక్టర్లు, సిబ్బందికి నిర్వహించిన ఆరోగ్యపరీక్షలు సిబ్బందికి ఎంతో సదవకాశాన్నిచ్చాయి. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తెలుసుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొనేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

వైద్యపరీక్షలతో మాకు మేలు

సుధాకర్‌, భద్రాచలం డిపో డ్రైవర్‌

ఆర్టీసీ నిర్వహించిన వైద్యపరీక్షల కార్యకరమంలో ఎందరికో మేలు జరిగింది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నవారు ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని కలిపించిన ఆర్టీసీ ఉన్నతాధికారులకు నా ధన్యవాదాలు.

Updated Date - 2022-12-09T00:55:35+05:30 IST