ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న జడ్పీటీసీ కారు
ABN , First Publish Date - 2022-01-13T05:37:15+05:30 IST
మణుగూరు ఎంపీపీ కారం విజయకుమారి, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, సమితి సింగారం సర్పంచ్ బచ్చల భారతి, టీఆర్‌ఎస్ నా యకులు వెంకటేశ్వరరెడ్డికి తృటిలో ప్రాణాపాయం తప్పింది.
వాహనచోదకుడికి తీవ్ర గాయాలు
ప్రజాప్రతినిధులకు తృటిలో తప్పిన ప్రాణాపాయం
మణుగూరు, జనవరి 12 : మణుగూరు ఎంపీపీ కారం విజయకుమారి, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, సమితి సింగారం సర్పంచ్ బచ్చల భారతి, టీఆర్‌ఎస్ నా యకులు వెంకటేశ్వరరెడ్డికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. బుధవారం రాత్రి కూనవరం రైల్వే గేట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో కారులోని ఎయిర్‌బ్యాగులు ఓపెన్ కావడంతో వీరు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు. ప్రమాదానికి సంబంధించి స్ధానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ము త్యాలమ్మ నగర్ పంచాయతీ పరిధిలో సంక్రాతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు బహుమతుల ప్రధానోత్సవానికి హాజరయ్యేందుకు ఎంపీపీ కారం విజయకుమారి, సమితి సింగారం సర్పంచ్ బచ్చల భారతి, టీఆర్‌ఎస్ నాయకులు వెంకటేశ్వరరెడ్డి మణు గూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు కారులో రైల్వే గేట్ మీదుగా ముత్యా లమ్మ నగర్‌కు బయలు దేరారు. రైల్వే గేట్ సమీపంలో కారు డ్రైవర్ ఆటోను తప్పించ బోయి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహన చోదకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు కూనవరానికి చెందిన ఏనిక జంపయ్యగా గుర్తించారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా సమయానికి కారు ఏయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రజాప్రతినిధులకు ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసం కాగా, ద్విచక్రవాహనం ఎందుకూ పనికిరాకుండా పోయింది.