‘కంటివెలుగు’కు ప్రత్యేక కార్యాచరణ

ABN , First Publish Date - 2022-12-07T00:11:39+05:30 IST

కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణకు వార్డులు, గ్రామపంచాయతీ వారీగా కార్యచరణ ప్రణాళికలు తయారుచేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ మున్సిపల్‌, పంచాయతీ అధికారులకు సూచించారు.

‘కంటివెలుగు’కు ప్రత్యేక కార్యాచరణ
మాట్లాడుతున్న కలెక్టర్‌ అనుదీప్‌

వైద్య, మునిసిపల్‌, పంచాయతీ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

కొత్తగూడెం కలెక్టరేట్‌, డిసెంబరు 6: కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణకు వార్డులు, గ్రామపంచాయతీ వారీగా కార్యచరణ ప్రణాళికలు తయారుచేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ మున్సిపల్‌, పంచాయతీ అధికారులకు సూచించారు. వచ్చే నెల 18 నుంచి ప్రభుత్వం చేపట్టనున్న కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణపై మంగళవారం వైద్య, మున్సిపల్‌, పంచాయతీ, డీఆర్‌డీఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 481 గ్రామపంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల్లోని 104 వార్డుల్లో ఈ కార్యక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 8న నిర్వహించనున్న సమావేశానికి కంటి వెలుగు శిబిరాలు నిర్వహణకు భవనాలు గుర్తింపు, ఏర్పాట్లు తదితర అంశాలపై అయాశాఖల అధికారులు సమగ్ర కార్యాచరణ నివేదికలతో హజరుకావాలన్నారు. జనవరి 18న ప్రారంభంకానున్న ఈ కంటి వెలుగు కార్యక్రమం వంద రోజులు నిర్వహిస్తారని, శని, ఆదివారాలతోపాటు ప్రభుత్వ సెలవులు తప్పమిగిలిన అన్ని రోజుల్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, రీడింగ్‌ సమస్య ఉన్నవారికి తక్షణమే కంటి అద్దాలు అందజేస్తామన్నారు. ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా కంటి అద్దాలు తయారు చేపించి పంపిణీ చేయనున్నామని, ప్రతి రోజు పట్టణ ప్రాంతాల్లో 400మందికి, గ్రామీణప్రాంతాల్లో 300మందికి కంటి పరీక్షలు నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. కంటి పరీక్షా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసేందుకు వార్డులను జోన్లుగా ఏర్పాటు చేయాలని, పంచాయతీల్లో హ్యాబిటేషన్ల వారీగా నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని డీపీవోకు సూచించారు. కార్యక్రమ విజయవంతానికి వార్డులు, గ్రామస్థాయిలో సూక్ష్మకార్యచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలోజిల్లా వైద్యాధికారి డాక్టర్‌ దయానందస్వామి, డీఆర్‌డీవో మధుసూధన్‌రాజు, డీపీవో రమాకాంత్‌, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ మున్సిపల్‌ కమీషనర్లు రఘు, అంకుషావళి, శ్రీకాంత్‌, పోగ్రాం అధికారి పర్షానాయక్‌, కలెక్టరేట్‌ ఏవో గన్యా పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:11:43+05:30 IST