KCR Nutrition Kits: తెలంగాణలో రేపటి నుంచే ‘కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు’!
ABN , First Publish Date - 2022-12-20T16:47:23+05:30 IST
రాష్ట్రంలో రేపటి (బుధవారం) నుంచే ‘కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు’ (KCR Nutrition Kits) పంపిణీ చేయనున్నారు. 9 జిల్లాల్లోని గర్భిణులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
హైదరాబాద్: రాష్ట్రంలో రేపటి (బుధవారం) నుంచే ‘కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు’ (KCR Nutrition Kits) పంపిణీ చేయనున్నారు. 9 జిల్లాల్లోని గర్భిణులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గర్భిణులకు అద్భుతమైన పథకమని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. ‘కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు’ పథకాన్ని కామారెడ్డి (Kamareddy) నుంచి వర్చువల్గా మంత్రి హరీష్రావు (Harish Rao) ప్రారంభించనున్నారు. గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఈ న్యూట్రియంట్ కిట్ ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. గర్భం దాల్చాక మూడో నెలలో ఒకసారి, ఐదో నెలలో మరోసారి దీన్ని అందజేస్తారు. కొన్ని నెలల క్రితం రాష్ట్రం నుంచి మహిళా ఐఏఎస్‌ల బృందం తమిళనాడుకు వెళ్లింది. తమిళనాడులో ‘అమ్మకిట్’ పేరుతో అక్కడ అమలవుతున్న పథకం తీరు తెన్నులపై అధ్యయనం చేశారు.
అక్కడిలాగే తెలంగాణ (Telangana)లోనూ ఓ పథకాన్ని అమలు చేయొచ్చంటూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో ‘కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు’ పథకానికి అంకురార్పణ జరిగిందని చెబుతున్నారు. ఈ కిట్‌లో ఐదు రకాల ఐటమ్స్ ఉంటాయి. ఒక కేజీ న్యూట్రిషనల్ బాటిల్స్ రెండు, ఐరన్ టానిక్స్ బాటిల్స్ మూడు, కేజీ ఎండు ఖర్జూరాలు, అరకిలో నెయ్యి, ఒక ఆల్బెండజోల్ మాత్ర ఈ కిట్‌లో ఉంటాయి. ఈ కిట్‌కు దాదాపు రూ.2 వేల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏటా దాదాపు 6లక్షల ప్రసవాలు జరుగుతాయి. గత ఏడాది 6.16 లక్షల మంది గర్భిణులు రిజిష్టర్ అయ్యారు. వారికి రెండేసి కిట్ల చొప్పున అందజేస్తే ఏడాదికి రూ.247 కోట్లు ఖర్చవుతుందని వైద్యశాఖ అంచనా వేసింది. 9 ఏజెన్సీ జిల్లాల వరకే అయితే న్యూట్రియంట్ కిట్స్ కోసం రూ. 50 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచాన వేస్తున్నారు.