మహిళలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2022-03-05T06:12:10+05:30 IST

మహిళలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని అప్పుడే సాధికారత సాధించగలుగుతారని జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ అన్నారు.

మహిళలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి

 - బుక్‌ ఫెయిర్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ

కరీంనగర్‌ కల్చరల్‌, మార్చి 4: మహిళలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని అప్పుడే సాధికారత సాధించగలుగుతారని జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ అన్నారు. పుస్తక ప్రదర్శనలో భాగంగా శుక్రవారం మహిళా సాధికారత-నాయకత్వం అనే అంశంపై నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్త్రీలు తాము లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. తన తండ్రి ఉద్యోగం చేస్తూ ఏ తప్పు చేయకుండానే సస్పెండ్‌కు గురవడం తనను కలచివేసిందన్నారు. ఆయనకు తిరిగి ఉద్యోగం ఇప్పించాలని ప్రజీప్రతినిధులను కలవడానికి వెళితే ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. అప్పుడే తాను లీడర్‌ కావాలనే పట్టుదల పెరిగిందని అన్నారు. మహిళలకు పురుషులతో పాటు సమాన గౌరవం ఇవ్వాలని అన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ మాట్లాడుతూ జీవితంలో కష్టపడి ఉన్నతంగా ఎదిగిన మహిళల జీవిత చరిత్రలు చదవాలని అన్నారు. వివక్ష లేకుండా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, పిల్లలను వివక్ష లేకుండా పెంచాలని అన్నారు.  తాను ఐదో తరగతి చదువుతున్న సమయంలో పాఠశాలకు కలెక్టర్‌ వచ్చారని,  ఆయనకు ఇచ్చిన గౌరవాన్ని చూసి తాను కూడా కలెక్టర్‌ కావాలని ఐఏఎస్‌ చదివానని అన్నారు. పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సునీత మాట్లాడుతూ విద్యార్థినులు అధైర్యపడకుండా ముందుకెళ్లాలని అన్నారు. వ్యవసాయమార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అనిత మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఈ స్థాయిలో ఉన్నాని, మనలోని ప్రతిభాపాటవాలే మనను రాణింపజేస్తాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖాధికారి పద్మావతి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా, మెప్మా డీఎంవో శ్రీవాణి, రజనీరెడ్డి, ఎస్సారార్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామకృష్ణ, ప్రదర్శన నిర్వాహకులు చంద్రమోహన్‌, సతీశ్‌, మహిళలు పాల్గొన్నారు.

- కవిత్వం-సమకాలీనత అంశంపై ప్రసంగం

సంఘటన వెనకున్న మూలాలను ఆవిష్కరించేదే సమకాలీన కవిత్వం అని కవులు, విమర్శకులు కె ఆనందాచారి, మల్లావఝల నారాయణశర్మ అన్నారు. శుక్రవారం నగరంలోని పుస్తక ప్రదర్శనలో సాహిత్య సమాలోచనలో భాగంగా కవిత్వం-సమకాలీనత అనే అంశంపై వారు ప్రసంగించారు. వర్తమానంలో సంచలనాత్మకమైన అంశాలపై విరివిగా కవిత్వం వచ్చినా దానిలో ఆలోచనాత్మకమైన కవిత్వం తక్కువ పాళ్లలో వస్తోందని అన్నారు.  లక్ష్య రహితమైన కవిత్వంతో సమాజానికి ప్రయోజనం చేకూరదని అన్నారు.  కార్యక్రమంలో అన్నవరం దేవేందర్‌ అధ్యక్షత వహించగా అతిథులు అడిషనల్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా, బూర్ల వేంకటేశ్వర్లు, సమన్వయకర్త సీవి కుమార్‌, వ్యాఖ్యాత కేఎస్‌ అనంతాచార్య పాల్గొన్నారు.


Updated Date - 2022-03-05T06:12:10+05:30 IST