యాసంగి వడ్లు కొనేదెవరు?

ABN , First Publish Date - 2022-03-05T06:15:53+05:30 IST

బాయిల్డ్‌ రైస్‌ ఎట్టిపరిస్థితుల్లో తీసుకునేది లేదని కేంద్రం.... కేంద్రం కోరుకున్నట్లు ముడి బియ్యం ఇవ్వబోమని రాష్ట్రం తేల్చి చెప్పాయి.

యాసంగి వడ్లు కొనేదెవరు?

 - కొనబోమని తేల్చిచెప్పిన ప్రభుత్వం

- జిల్లాలో సాధారణానికి మించి సాగు 

- 5.56 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా 

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

బాయిల్డ్‌ రైస్‌ ఎట్టిపరిస్థితుల్లో తీసుకునేది లేదని కేంద్రం.... కేంద్రం కోరుకున్నట్లు ముడి బియ్యం ఇవ్వబోమని రాష్ట్రం తేల్చి చెప్పాయి. వీరి వైఖరి ఇలా ఉంటే  యాసంగి వరి ధాన్యాన్ని కొనేది ఎవరని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలు విషయంలో అనుసరిస్తున్న విధానాలు రైతులను నిలువునా ముంచే విధంగా కనిపిస్తున్నాయి. రెండు ప్రభుత్వాల మధ్య ఈ విషయంలో కొనసాగుతున్న వివాదం తేలక ముందే ప్రత్యామ్నాయ అవకాశాలు లేక, పంట మార్పిడికి వీలు కాక రైతులు వరిసాగు వైపే మొగ్గుచూపారు. ఎప్పటి మాదిరిగానే సాధారణ సాగుకు మించి యాసంగిలో వరి నాట్లు వేశారు.  

- ఆందోళనలో అన్నదాతలు

జలవనరుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో పంట చేతికొచ్చే సమయానికి ప్రభుత్వాల విధానాల్లో ఏమైనా మార్పు రాక పోతుందా అన్న ఆశతో వరి సాగు చేసిన రైతులకు ఇప్పుడు మద్దతు ధర గుబులు పట్టుకున్నది. కేంద్రం ఎట్టిపరిస్థితుల్లోనూ బాయిల్డ్‌ రైస్‌ను కొనబోమని మరోసారి స్పష్టం చేయగా రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలో చేతులెత్తేసింది. కేంద్రం కోరుకున్నట్లుగా ముడిబియ్యం ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రానికి బియ్యం ఇవ్వలేని పరిస్థితుల్లో కొనుగోలు కూడా కష్టమేనని భావించిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా యాసంగి ధాన్యం సేకరించలేమని ప్రకటించింది. 

- రైస్‌ మిల్లర్లే దిక్కు

పండిన పంట అమ్ముకోవడానికి రైతులు రైసుమిల్లర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. వరి ధాన్యం కొనేవారు ఎవరూ లేనందువల్ల మిల్లర్లు చెప్పిన ధరకే అమ్మి రైతులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో యాసంగిలో రైతులు 2,32,000 ఎకరాల్లో వరిసాగు చేశారు. వ్యవసాయశాఖ ఎకరాకు 23 నుంచి 24 క్వింటాళ్ల మేరకు దిగుబడి రావచ్చని అంచనా వేసింది. ఈ మేరకు జిల్లాలో 5,33,600 నుంచి 5,56,800 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముంది. జిల్లాలో సాగు చేసిన 2,32,000 ఎకరాల్లో 48 వేల ఎకరాలు హైబ్రీడ్‌ సీడ్‌ సాగు చేశారు. ఈ హైబ్రీడ్‌ సీడ్‌ను రైతులు ఆయా కంపెనీలతో అగ్రిమెంట్‌ కుదుర్చుకొని సాగు చేసినందువల్ల ధాన్యం కొనుగోలు విషయంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. జిల్లాలో 1.1 లక్షల టన్నుల హైబ్రీడ్‌ విత్తనం ఉత్పత్తి అయ్యే అవకాశమున్నది. మరో 55 వేల ఎకరాల్లో రైతులు నోటిఫైడ్‌ సీడ్‌ రకాలను సాగు చేశారు. ఈ విస్తీర్ణంలో 1.26 లక్షల టన్నుల సీడ్‌ ఉత్పత్తి కానున్నది. ఈ ధాన్యాన్ని జిల్లాలో ఉన్న విత్తనశుద్ధి కర్మాగారాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రకాలకు కనీస మద్దతు ధర లేక క్వింటాల్‌కు అదనంగా మరో 50 నుంచి 100 రూపాయలు ఎక్కువ కూడా లభించే అవకాశం ఉంది. మిగతా 1.29,000 ఎకరాల్లో దొడ్డు, సన్న, సాధారణ రకాల వరి సాగు చేసిన రైతుల పరిస్థితే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నది. ఈ సాగు విస్తీర్ణంలో 2.96 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 3.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తికానున్నది. ఈ ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు పూర్తిగా రైసుమిల్లర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. కేంద్ర ప్రభుత్వం సాధారణ రకం వరికి క్వింటాల్‌కు 1,940, ఏ గ్రేడ్‌ రకానికి 1,960 రూపాయలు ధర ప్రకటించింది. ఈ కనీస మద్దతు ధరకు కూడా మిల్లర్లు వరి ధాన్యం కొనుగోలు చేసే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. యాసంగిలో పండే ధాన్యం మిల్లింగ్‌ చేస్తే బియ్యం విరిగి పోయి నూక ఎక్కువ వస్తుంది. అందుకే యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్‌ బియ్యంగానే మార్చి విక్రయిస్తారు. బయటి రాష్ట్రాల్లో బాయిల్డ్‌ బియ్యం వినియోగం తగ్గడం, కేంద్రం బాయిల్డ్‌ బియ్యాన్ని సేకరించక పోవడంతో రైసుమిల్లర్లు కూడా ఆ ధాన్యం కొనుగోలు చేసి ఏమి చేయాలనే పరిస్థితుల్లో ఉన్నారు. నూక రూపంలో వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ధర తగ్గించక తప్పదని మిల్లర్లు పేర్కొంటుండగా మద్దతు ధర తగ్గితే పెట్టుబడులుపోను శ్రమ ఫలితం దక్కే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర,  ప్రభుత్వాలు ఈ విషయంలో తమ వైఖరిని మార్చుకొని ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

- ధాన్యం కొనకుంటే ఉద్యమిస్తాం 

- గుర్రం రాజశేఖర్‌రెడ్డి, రైతు, చొప్పదండి 

రైతుల జీవితాలతో రాజకీయాలు వద్దు. నాలుగు ఎకరాల్లో వెదజల్లే పద్దతిలో వరి సాగుచేసి పెట్టుబడి భారాన్ని తగ్గించుకున్నాను. వరి తప్ప వేరే పంట పండే పరిస్థితులు లేవు. ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వమే వరి ధాన్యాన్ని కొనాలి. మిల్లర్లు ఇచ్చే ధర గిట్టుబాటు కాదు. రైతు తీవ్రంగా నష్టపోతారు. ధాన్యం కొనకపోతే ఉద్యమాలు తప్పవు.

- రోడ్డుపైనే కుమ్మరిస్తం..

- గుజ్జుల తిరుపతిరెడ్డి, రామకృష్ణకాలనీ, తిమ్మాపూర్‌ 

ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోతే రోడ్డుపైనే కుమ్మరిస్తం. నేను తొమ్మిది ఎకరాల్లో దొడ్డు వరి పండిస్తున్న.. ప్రభుత్వం ధాన్యాన్ని కొంటుందనే నమ్మకంతో ఉన్నాం.. ఒకవేళ ధాన్యాన్ని కొనకపోతే రైతుల అందరం కలిసి ధాన్యాన్ని తీసుకెళ్ళి రాజీవ్‌ రహదారిపై కుమ్మరిస్తాం.. అవసరమైతే రహదారులను దిగ్భందం చేస్తాం. ప్రభుత్వానికి కష్టమైతే ఉచిత పథకాలను తీసివేసి ధాన్యాన్ని కొనాలి.

- చౌడుభూముల్లో ఇతర పంటలు ఎలా వేస్తారు...

- పొన్నాల సంపత్‌కుమార్‌, రైతు, ఉల్లంపల్లి 

చౌడు భూముల్లో వరి కాకుండా ఇతర పంటలు ఎలా వేస్తారు.. నీళ్ల సదుపాయం ఉన్నా లేకున్నా మా ప్రాంతంలో వరి తప్ప వేరే పంట సాగు చేయలేం. ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వంపై నమ్మకం లేక ప్రైవేట్‌ కంపెనీలతో మాట్లాడుకొని విత్తనాలు తీసుకొచ్చి వేసుకున్నాం. ఆ కంపెనీలే మాకు పెట్టుబడులు ఇస్తున్నాయి. పండిన ధాన్యాన్ని తీసుకుపోయి డబ్బులు మా ఖాతాల్లో వేయడానికి ఒప్పందం చేసుకున్నాయి.

Read more