కొత్త రేషన్‌కార్డులకు మోక్షమెప్పుడో?
ABN , First Publish Date - 2022-10-18T05:03:38+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులను జారీ చేయక పోవడంతో దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి.
- పెండింగ్‌లో 15 వేలకుపైగా అర్జీలు
- కార్డుల కోసం దరఖాస్తుదారుల నిరీక్షణ
కరీంనగర్ టౌన్, అక్టోబరు 17: రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులను జారీ చేయక పోవడంతో దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. దీంతో దరఖాస్తుదారులు రేషన్‌కార్డుల కోసం కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. డిసెంబరు 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కొత్త రేషన్‌కార్డులను, ఆహారభద్రతాకార్డులు (ఫుడ్ సెక్యూరిటీ కార్డు)లను జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత జారీ చేయలేదు. అప్పటికే దరఖాస్తు చేసుకున్న వాటిని విచారణ పేరుతో పెండింగ్‌లో పెట్టారు. వారంతా రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తుండగా, ఆ తర్వాత కొత్తగా పెళ్ళి చేసుకున్న వారు, అప్పటి వరకు రేషన్‌కార్డు పొందనివారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థానికంగా స్థిరపడిన వారు రేషన్‌కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.
- మార్పులు, చేర్పుల దరఖాస్తులూ పెండింగ్‌లోనే..
రాష్ట్ర ప్రభుత్వం పాత రేషన్ కార్డులు/ ఆహారభద్రత కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తూ మీసేవా కేంద్రాల్లో ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో కొత్త కార్డులు పొందలేని వారు కనీసం అప్పటికే ఉన్న వారి కార్డుల్లో కొత్తగా పెళ్లయిన వారి పేర్లను చేర్పించుకునేందుకు మీసేవలో దరఖాస్తు చేసుకున్నారు. 2019 వరకు ఉమ్మడి జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు దాదాపు 20 వేలకుపైగానే ఉంటారని భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోనే కొత్త రేషన్‌కార్డు దరఖాస్తులతోపాటు మార్పులు, చేర్పులు చేయాలంటూ పెట్టుకున్న అర్జీలు 15 వేల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
- హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కొంతమందికి కార్డులు
ఏడాది క్రితం జరిగిన హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కొత్తగా 7,766 మందికి ఆహారభద్రతా కార్డులను జారీ చేశారు. మిగిలిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రేషన్‌కార్డులకు అర్హులని పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదించారు. వీటితోపాటుగా కొత్త రేషన్‌కార్డుల కోసం మరికొంత మంది దరఖాస్తు చేసుకోగా, మార్పులు, చేర్పులకు సంబంధించిన వారు 12 వేల మంది ఆన్లైన్లో అర్జీ పెట్టుకున్నారు. జిల్లాలో మార్పులు, చేర్పుల కోసం 12వేల మంది దరఖాస్తు చేసుకోగా, మరో మూడు వేల మంది వరకు గతంలో కొత్త కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా జిల్లాలో 15వేల మంది వరకు రేషన్‌కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులను జారీ చేసేందుకు అనుమతి ఇస్తే తప్ప తాము ఏమి చేయలేమని అధికారులు చేతులెత్తేయడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. రేషన్‌కార్డు, ఆహారభద్రతా కార్డులతో రేషన్ సరుకులు తీసుకోవడం కోసమే కాకుండా ప్రభుత్వ గుర్తింపు కార్డుగా ఉపయోగిస్తున్నారు. ఓబీసీ సర్టిఫికేట్లు రేషన్‌కార్డులో పేరు ఉండాలనే తప్పనిసరి నిబంధన చేర్చారు. రేషన్‌కార్డు లేక పోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ ఫలాలను పొందలేక పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఆరోగ్యశ్రీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్‌ఫండ్, వివిధ పథకాల ద్వారా రుణాలను పొందేందుకు వీలులేకుండా పోతోందని, ప్రత్యామ్నాయ సర్టిఫికెట్లు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారంగా 10,5,711 మంది జనాభా, 2,58,485 గృహాలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు రెట్టింపునకు చేరింది. ఇక వీరిలో 2,79,351 మంది ఆహారభద్రత కార్డులు, అంత్యోదయ ఆహారభద్రత కార్డులు, అన్నపూర్ణ కార్డులతో ప్రతినెలా రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకులను పొందుతున్నారు. వెంటనే ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్లో అవకాశం కల్పించాలని, అర్హులైన వారందరికి మార్పులు, చేర్పుల కార్డులతోపాటు, కొత్త రేషన్‌కార్డులను కూడా జారీ చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.