రైతుబంధు అందేదెప్పుడు..?

ABN , First Publish Date - 2022-12-13T01:11:59+05:30 IST

యాసంగి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నా రైతుబంధు సాయం ఎప్పుడు అందేది తేలడం లేదు.

 రైతుబంధు అందేదెప్పుడు..?

- పెట్టుబడి సాయం కోసం అన్నదాతల ఎదురుచూపులు

- దళితబంధు కోటాలోనూ కోతలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

యాసంగి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నా రైతుబంధు సాయం ఎప్పుడు అందేది తేలడం లేదు. రెండు రోజుల క్రితం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో రైతుబంధు నిధులు విడుదల చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటారని భావించినా సంక్షేమ పథకాలపై చర్చే జరగకపోవడంతో ఈ విషయంలో స్పష్టత లేకుండా పోయింది. జగిత్యాల జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ పది, పన్నెండు రోజుల్లో రైతుబంధు డబ్బు చెల్లిస్తామని ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకొని డిసెంబరు 15 నుంచి జనవరి 15 లోగా యాసంగి రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తారని భావించారు. కేబినెట్‌లో ఈ విషయంపై చర్చ జరగకపోవడంతో రైతుబంధు సాయం ఎప్పుడు అందించేది ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు కూడా తమకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని అంటున్నారు.

జిల్లాలో 1,93,330 మంది రైతుబంధు లబ్ధిదారులు

ఈ వానాకాలం సీజన్‌లో రైతుబంధు అందుకునే లబ్ధిదారుల సంఖ్య 1,93,330కి చేరింది. ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున 181 కోట్ల 89 లక్షల 1394 రూపాయలు పంపిణీ చేయాలని నిర్ణయించి వాటిని విడుదల చేశారు. యాసంగిలోనూ అంతే నిధులు అవసరమవుతాయి. వానాకాలంలో ఆలస్యంగా నాట్లు వేసిన రైతులకు దిగుబడి ఆశించిన మేరకు రాలేదు. దీంతో వారు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి ఆశించిన మేరకు రాకపోవడంతోనే కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం ఆశించిన మేరకు ధాన్యం రాలేదు. యాసంగిలో సాగునీటికి సమస్య లేకపోవడంతో వానాకాలం జరిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చని రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం రైతుబంధు సాయం విడుదల చేస్తే ఎరువులు, విత్తనాలు కొనుక్కొని ముందుకు సాగవచ్చని భావిస్తుండగా ఆ సాయం ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది.

దళితబంధు నియోజకవర్గానికి 200 మందికే..

దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినా నిధులలేమి అందుకు ఆటంకంగా మారుతోంది. పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన జిల్లాలోని హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సంతృప్త స్థాయిలో అర్హులైన దళిత కుటుంబాలన్నింటికి 10 లక్షల రూపాయల చొప్పున సహాయం అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 1,500 మంది అర్హులైన దళితులకు దళితబంధు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మూడు విడతలుగా ఐదేసి వందల యూనిట్లకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం మొదట అనుకున్న విధంగా కాకుండా నియోజకవర్గానికి 200 మందికి మాత్రమే ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకపోయినా ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు, అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. హుజూరాబాద్‌ నియోజకవర్గం తర్వాత మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి వంద మందికి ఈ పథకం కింద సహాయం అందించాలని నిర్ణయించారు. జిల్లాలోని కరీంనగర్‌ నియోజకవర్గంలో 100, మానకొండూర్‌ నియోజకవర్గంలో 61, చొప్పదండి నియోజకవర్గంలో 49 మందికి, మొత్తం 210 మందికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ఎంపిక చేసి వారు కోరుకున్న యూనిట్లను అందించారు. తర్వాత కరీంనగర్‌, చొప్పదండి, మానకొండూర్‌ నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి 1,500 యూనిట్ల చొప్పున 4,500 యూనిట్లు, కరీంనగర్‌లో ప్రత్యేక కోటాగా వెయ్యి యూనిట్లకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారని ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. ఇప్పుడు నియోజకవర్గానికి 200 యూనిట్ల చొప్పున 600 దళిత కుటుంబాలకు మాత్రమే ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నది. కరీంనగర్‌కు కేటాయిస్తారన్న ప్రత్యేక కోటా విషయంపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల లేమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. రైతుబంధు సాయం అందకపోవడం, దళితబంధు యూనిట్ల సంఖ్య తగ్గిస్తున్నారనే వార్తలు వస్తుండడంతో రైతుల్లో, దళితుల్లో అసంతృప్తి, నిరాశ, నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-12-13T01:12:47+05:30 IST

Read more