‘కమీషన్‌’ చెల్లించేదెప్పుడు..?

ABN , First Publish Date - 2022-01-13T05:44:04+05:30 IST

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఇచ్చే కమీషన్‌ సొమ్మును ఏడాది కాలంగా పౌరసరఫరాల శాఖ విడుదల చేయడం లేదు.

‘కమీషన్‌’ చెల్లించేదెప్పుడు..?

- సొమ్ము విడుదలలో పౌరసరఫరాల శాఖ జాప్యం 

- మూడు సీజన్లకు కలిపి చెల్లించాల్సింది రూ.29.80 కోట్లు

- ఇబ్బందుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఇచ్చే కమీషన్‌ సొమ్మును ఏడాది కాలంగా పౌరసరఫరాల శాఖ విడుదల చేయడం లేదు. దీంతో నిర్వాహకులు ఇబ్బందులకు గురవుతున్నారు. మూడు సీజన్లకు సంబంధించి సుమారు 29 కోట్ల 80 లక్షలకు పైగా కమీషన్‌ సొమ్ము విడుదల కావాల్సి ఉన్నది. జిల్లాలో వరి సాగు విస్తారంగా జరుగుతుండడంతో తద్వారా వచ్చిన పంట దిగుబడులను ప్రభుత్వం ఎక్కడికక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మహిళా సంఘాలు, డీసీఎంఎస్‌, మార్కెట్‌ యార్డుల ద్వారా 292 కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలు ధాన్యాన్ని కొనుగోలుకు 3 రూపాయల 25 పైసల కమీషన్‌ను నిర్వాహకులకు ఇస్తున్నారు. 

తీవ్ర జాప్యం..

2020-21 వానాకాలం సీజన్‌లో 453 కోట్ల 46 లక్షల విలువైన 2,40,437.42 టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. తద్వారా 7 కోట్ల 17 లక్షల 94 వేల 602 రూపాయల కమీషన్‌ ఆయా ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉన్నది. యాసంగి సీజన్‌లో 742 కోట్ల 38 లక్షల విలువైన 3,93,652 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, తద్వారా 12 కోట్ల 22 లక్షల 82 వేల 640 రూపాయల కమీషన్‌ రావాల్సి ఉన్నది. అలాగే గడిచిన వానాకాలం సీజన్‌లో 3,20,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, 10 కోట్ల 40 లక్షల రూపాయల కమీషన్‌ సొమ్ము రావాల్సి ఉన్నది. గడిచిన సీజన్‌ కంటే ముందు సీజన్లకు చెందిన డబ్బులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ విడుదల చేయకపోవడంతో మహిళా సంఘాల సభ్యులకు కమీషన్‌ సొమ్ము దక్కడం లేదు. వారికిచ్చే కమీషన్‌ సొమ్ములో కొంత వీవోలకు జమచేయడంతో పాటు వ్యక్తిగతంగా కేంద్రాన్ని నిర్వహించిన మహిళా సంఘ సభ్యులకు ఇస్తారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు నెల, రెండు నెలలపాటు పనిచేసిన మహిళా సభ్యులకు కమీషన్‌ సొమ్ము రాకపోవడంతో సదరు మహిళలు కుటుంబ అవసరాలు తీర్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే జిల్లాలో అత్యధికంగా కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పెద్దమొత్తంలో డబ్బులు రావాల్సి ఉన్నాయి. దాదాపు 20 కోట్ల వరకు కమీషన్‌ సొమ్ము సహకార సంఘాలకు జమ కావాల్సి ఉన్నది. కమీషన్‌ సొమ్ము రాకపోవడంతో సహకార సంఘం అభివృద్ధికి విఘాతం కలుగుతున్నది. ప్రతి ఏటా కేవలం ఒక సీజన్‌కు సంబంధించిన కమీషన్‌ సొమ్ము మాత్రమే పెండింగులో ఉంటుంది. ప్రభుత్వం నిధులను విడుదల చేసిన ప్రకారం చెల్లింపులు చేస్తుంటారు. గత ఆరు నెలల నుంచి రెండు, మూడు సీజన్లకు సంబంధించిన కమీషన్‌ సొమ్మును పెండింగులో పెడుతున్నారని చెబుతున్నారు. బడ్జెట్‌ రాలేదనే సాకుతో కమీషన్‌ సొమ్ము చెల్లించడం లేదని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్ల కమీషన్‌ సొమ్మును వెంటనే విడుదల చేయాలని నిర్వాహకులు కోరారు. 

Updated Date - 2022-01-13T05:44:04+05:30 IST