పూర్తయ్యేదెన్నడో?
ABN , First Publish Date - 2022-12-07T00:23:48+05:30 IST
‘వచ్చే సంక్రాంతి నాటికి డబుల్ బెడ్రూము ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. తుది దశలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూము ఇళ్ల పనులను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రతి నెలా ఇళ్ల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తాం..’ అని గతనెల 24వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర గృహనిర్మాణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మతో కలిసి అన్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
- సంక్రాంతి నాటికి పూర్తిచేయాలని ఆదేశాలు
- తుది దశలో ఉన్నవి పూర్తయితేనే పంపిణీ
- మంథనిలో పూర్తయినా పంపిణీ కాని వైనం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
‘వచ్చే సంక్రాంతి నాటికి డబుల్ బెడ్రూము ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. తుది దశలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూము ఇళ్ల పనులను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రతి నెలా ఇళ్ల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తాం..’ అని గతనెల 24వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర గృహనిర్మాణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మతో కలిసి అన్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కానీ జిల్లాలో ఇళ్ల నిర్మాణంలో కదలిక రావడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ డబుల్ బెడ్రూము ఇళ్లను నిర్మించి ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు 2015 నుంచి 2017వరకు ఒక్కో అసెంబ్లీ నియోజవర్గానికి ఒక వెయ్యి చొప్పున ఇళ్లను మంజూరు చేసింది.
ఫ జిల్లాకు 3394 ఇళ్లు..
జిల్లాకు 3394 డబుల్ బెడ్రూము ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు 2064 ఇళ్లు, పట్టణ ప్రాంతాలకు 1330 ఇళ్లు కేటాయించారు. అన్ని ఇళ్ల నిర్మాణాలకు టెండర్లను ఆహ్వానించారు. కానీ ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 766 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 1144 ఇళ్లు, మొత్తం 1920 ఇళ్ల పనులను ప్రారంభించారు. ఇందులో 68 ఇళ్లు పునాదుల స్థాయిలో, 287 ఇళ్లు బేస్మెంట్ లెవెల్లో, 645 ఇళ్లు రూఫ్ లెవెల్లో, 202 ఇళ్లు గోడల నిర్మాణంలో, 446 ఇళ్లు ప్లాస్టింగ్ స్థాయిలో ఉండగా, 262 ఇళ్ల నిర్మాణాలు మొత్తం పూర్తయ్యాయి. ఇందులో మంథని పోచమ్మవాడలో 92 ఇళ్లు, కాల్వశ్రీరాంపూర్‌లో 170ఇళ్లు పూర్తయ్యాయి. పెద్దపల్లి, అంతర్గాం, రామగుండం, ఓదెల మండలాల్లో నిర్మాణాలు కొనసాగుతుండగా, సుల్తానాబాద్, పాలకుర్తి మండలం, ముత్తారం, తదితర మండలాల్లో అర్ధంతరంగా పనులు నిలిచిపోయాయి. పూర్తయిన చోట ఇప్పటివరకు ఎవరికి కూడా అధికారులు ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేదు. మంథనిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినప్పటికీ, గత నెలలోనే వాటిని పంపిణీ చేస్తారని భావించినప్పటికీ, ఇంకా ముందుకు సాగడం లేదు. ఏడేళ్లుగా జిల్లాలో డబుల్ బెడ్రూము ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఫ సంక్రాంతి నాటికి పూర్తయ్యేనా..
గత నెల 24వ తేదీన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంక్రాంతి నాటికి ఇళ్లు పూర్తిచేయాలని, ఆలోపు పూర్తయిన వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. అయితే జిల్లాలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఇతరత్రా పనుల వల్ల జిల్లా ఉన్నతాధికారులు ఇళ్లపై ఫోకస్ పెట్టినట్లుగా కనబడడం లేదు. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి 5.24 లక్షల రూపాయలతో పాటు మౌలిక వసతుల కల్పనకు లక్ష రూపాయలు ఇస్తున్నది. వాస్తవానికి ఈ డబ్బులు సరిపోవు. ఒక ఇల్లు నిర్మించాలంటే 10 లక్షల రూపాయలకు తక్కువ కావని అంటున్నారు. అది కూడా జీప్లస్ వన్, టూ, త్రీ తరహాలో నిర్మిస్తేనే కొంత సరిపోతాయని అంటున్నారు. ఇండిపెండెంట్ ఇంటి నిర్మాణానికి 10 లక్షలు కూడా సరిపోవని చెబుతున్నారు. కాల్వశ్రీరాంపూర్, ఓదెల, అంతర్గాం, పెద్దపల్లిలో కొన్ని ఇళ్ల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. వీటిపై దృష్టి సారిస్తే కొంత మంది పేదలకైనా ఇళ్లు దక్కే అవకాశాలుంటాయి. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం మాత్రం జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన ఇళ్లు మొత్తం ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనబడడం లేదు. సంక్రాంతి నాటికి కొన్ని ఇళ్లనైనా పూర్తి చేసేందుకు చర్యలు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని పేద, మధ్య తరగతి ప్రజలు కోరుతున్నారు.