చొప్పదండికి కేసీఆర్‌ చేసిందేమిటి?

ABN , First Publish Date - 2022-11-15T01:15:41+05:30 IST

చొప్పదండికి అల్లుడుగా చెప్పుకుంటున్న కేసీఆర్‌, మనవడిగా చెప్పుకుంటున్న కేటీఆర్‌ నియోజకవర్గానికి చేసింది ఏమిటని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.

చొప్పదండికి కేసీఆర్‌ చేసిందేమిటి?
చొప్పదండిలో ప్రజలకు అభివాదం చేస్తున్న షర్మిల

నియోజకవర్గానికి దిక్కు దివానా లేదు

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల

చొప్పదండి, నవంబరు 14: చొప్పదండికి అల్లుడుగా చెప్పుకుంటున్న కేసీఆర్‌, మనవడిగా చెప్పుకుంటున్న కేటీఆర్‌ నియోజకవర్గానికి చేసింది ఏమిటని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం మండలంలోని ఆర్నకొండ నుంచి ప్రారంభం కాగా చొప్పదండిలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిరిసిల్ల, గజ్వేల్‌లా చొప్పదండిని ఎందుకు అభివృద్ధి చేయలేదని అన్నారు. కొండగట్టు అంజన్నను సైతం కేసీఆర్‌ మోసం చేశారని, 100 కోట్లు ఇస్తామని చెప్పిన హామీ ఏమయ్యిందని ఆమె ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా కొండగట్టుకు రూపాయి కూడా ఇవ్వలేదని, కొండగట్టులో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగితే సీఎం కేసీఆర్‌ ఒక్కరిని కూడా పరామర్శించలేదన్నారు. చొప్పదండి నియోజకవర్గం వాటర్‌ హబ్‌గా మారుస్తామని చెప్పినా మోతె రిజర్వాయర్‌కు ప్రత్యామ్నాయంగా ఇప్పటి వరకు చేపట్టలేదని, చొప్పదండి నియోజకవర్గానికి వైఎస్సార్‌ ఎంతో చేశాడని ఆమె తెలిపారు. ఎస్సారెస్పీ వరద కాలువ వైఎస్‌ హయాంలో నిర్మించారని, ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కళకళలాడుతోందని, ఎస్సారెస్పీ కెనాల్‌ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరందుతోందని అన్నారు. వైఎస్సార్‌ హయాంలో నారాయణపూర్‌ రిజర్వాయర్‌ కట్టించారని, ఇప్పుడు అదే ప్రాజెక్టుకు గండి పడితే కేసీఆర్‌ వాటిని పూడ్చే పని కూడా చేయలేదని, నారాయణపూర్‌ బాధితులకు రూపాయి కూడా సహాయం అందించలేదని అన్నారు. సిరిసిల్లలో అమలవుతున్న చేనేత పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు ఎన్నికల సమయంలో ఒక్క రూపాయి లేవని చెప్పాడని, చిల్లి గవ్వ లేని ఎమ్మెల్యేకు మూడేళ్లలో వందల కోట్లు ఎలా వచ్చాయని, సొంత గ్రామంలో ఐదు కోట్లతో ఇంద్ర భవనం ఎలా కట్టుకున్నాడని ఆమె ప్రశ్నించారు. పద్మశాలీల భూములు లాక్కొని ఇల్లు కట్టుకున్నాడని, ఎమ్మెల్యేకు కమీషన్‌ రాజ అనే పేరు ఉందన్నారు. నియోజకవర్గానికి దిక్కు దివాణం లేదని, కమీషన్లు ఇవ్వనిది ఎమ్మెల్యే ఏ పని చేయడం లేదన్నారు. సీఎం దగ్గర నుంచి ఇలాంటి ఎమ్మెల్యేల వరకు అంతా తినడమే పనిగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు. బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కనపల్లి కుమార్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి సత్యరాజ్‌ వర్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్ర రాత్రి కొలిమికుంట గ్రామం వద్ద ముగియగా, రాత్రి ఆమె అక్కడే బస చేశారు.

3,200 కిలోమీటర్లకు చేరిన పాదయాత్ర...

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం 3,200 కిలోమీటర్లు దాటింది. మండలంలోని ఆర్నకొండ గ్రామం వద్ద 3200 కిలోమీటర్ల మైలురాయిని ఆమె దాటింది. 209వ రోజు పాదయాత్ర కొనసాగగా ధర్మారం మండలం నుంచి చొప్పదండి మండలంలోని ఆర్నకొండకు చేరింది. ఆర్నకొండలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం రెండు గంటలు విరామం తీసుకొని తిరిగి సాయంత్రం చొప్పదండిలో బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. అనంతరం కొలిమికుంటలో రాత్రి బస చేశారు. పాదయాత్ర సందర్భంగా మార్గమధ్యంలో ఆమె వృద్ధులను, వికలాంగులను, పిల్లలను పలకరించారు. బహిరంగ సభకు భారీగా మహిళలు తరలివచ్చారు.

Updated Date - 2022-11-15T01:15:43+05:30 IST