ఎస్‌డీఎఫ్‌ ప్రతిపాదనలేవి?

ABN , First Publish Date - 2022-12-10T00:50:35+05:30 IST

జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిధులు మంజూరు చేసినా, పనుల ప్రతిపాదనలు ఇంతవరకు అధికారులకు చేరడం లేదు. మూడు మాసాల క్రితం జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్‌ వచ్చిన సందర్భంగా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రత్యేకించి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

ఎస్‌డీఎఫ్‌ ప్రతిపాదనలేవి?

- సీఎం కేసీఆర్‌ జిల్లా పర్యటన సందర్భంగా నిధుల మంజూరుకు హామీ

- పంచాయతీలు, మున్సిపాలిటీలకు రూ.30.60 కోట్లు కేటాయింపు

- ఆలస్యమైతే నిధులు రద్దయ్యే ప్రమాదం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిధులు మంజూరు చేసినా, పనుల ప్రతిపాదనలు ఇంతవరకు అధికారులకు చేరడం లేదు. మూడు మాసాల క్రితం జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్‌ వచ్చిన సందర్భంగా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రత్యేకించి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసి 52 రోజులు గడుస్తున్నా పనులు ప్రతిపాదనల దశ దాటడం లేదు. ఇప్పటివరకు సంబంధిత శాఖకు ప్రతిపాదనలు చేరకపోవడం గమనార్హం. ఆగస్టు 29వ తేదీన సీఎం కేసీఆర్‌ పెద్దపల్లికి వచ్చి నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, పెద్దకల్వలలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ స్థానిక సంస్థలకు నిధులు మంజూరుచేయాలని సీఎంను కోరారు. ఆ మేరకు జిల్లాలో గల 266 గ్రామపంచాయతీలకు 10లక్షల రూపాయల చొప్పున, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలకు కోటి రూపాయల చొప్పున మంజూరు చేస్తున్నామని, ఉత్తర్వులు వెంటనే వెలువడుతాయని సీఎం ప్రకటించారు. కానీ 50 రోజుల ఆలస్యంగా అక్టోబర్‌ 17వ తేదీన పంచాయతీలు, మున్సిపాలిటీలకు 30కోట్ల 60లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 25 శాతం నిధులను ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ ప్రకారం దళితులు, గిరిజన వాడల అభివృద్ధి కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నిధులతో ఏ పనులైనా చేసుకునే అవకాశాలున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో అధికంగా సిమెంట్‌ రహదారులు, మురుగుకాలువల నిర్మాణాల కోసమే వెచ్చించాలని చూస్తున్నారు.

ఫ ప్రతి పంచాయతీకి 10 లక్షలు..

ప్రతి పంచాయతీకి 10లక్షల చొప్పున, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలకు ఒక కోటి రూపాయల చొప్పున మంజూరు చేశారు. ఆమేరకు ఆ నిధులను మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల వారీగా ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 5 లక్షల రూపాయలకు మించితే ఆ పనులకు టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 5 లక్షలలోపు పనులనే గుర్తిస్తున్నారు. ప్రధానంగా క్రిటికల్‌ గ్యాప్స్‌తో పాటు కొత్తగా ఏర్పడ్డ కాలనీల్లో సీసీ రోడ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉత్తర్వులు వెలువడి 52 రోజులు గడుస్తున్నా కూడా ప్రతిపాదనలు జిల్లా ప్రణాళిక కార్యాలయానికి చేరకపోవడం గమనార్హం. ప్రత్యేక అభివృద్ధి నిధులతో చేపట్టే పనులపై సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ చైర్మన్లు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలను నిబంధనల మేరకు పంపించాలని సీపీవో మున్సిపల్‌ కమిషనర్లకు, మండల అభివృద్ధి అధికారులకు లేఖలు పంపించారు. వారి నుంచి ఇంకా పనుల ప్రతిపాదనలు సీపీవోకు చేరలేదు. క్షేత్రస్థాయిలో గుర్తించిన పనులకు ఇంజినీరింగ్‌ అధికారులు అంచనాలు రూపొందించారు. పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ద్వారా, మంథని నియోజకవర్గ పరిధిలో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ల సూచనల మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేశారని తెలిసింది. పూర్తిస్థాయి ప్రతిపాదనలు సీపీవో చేరిన తర్వాత, వాటిని అధికారులు పరిశీలించి మంజూరు కోసం కలెక్టర్‌కు పంపించనున్నారు. కలెక్టర్‌ మంజూరుచేసిన తర్వాత సీపీవో ప్రొసీడింగులు విడుదల చేయనున్నారు. అనంతరం పనులు చేసే వారిచే ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పనులు ఎవరికి ఇవ్వాలనే విషయమై ఇంకా ఒక కొలిక్కి రానట్లు తెలుస్తున్నది. త్వరగా ప్రతపాదనలను సంబంధిత అధికారులకు పంపిస్తేనే, పనులు త్వరగా పూర్తికానున్నాయి. సకాలంలో ప్రతిపాదనలు ఇవ్వకుంటే నిధులు రద్దయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి త్వరగా ప్రతిపాదనలు పంపిస్తే, పనులు మంజూరై ప్రారంభంకానున్నాయి. ఈ విషయమై సీపీవో రవీందర్‌ను వివరణ కోరగా సీఎం ప్రకటించిన ఎస్‌డీఎఫ్‌ నిధులకు సంబంధించిన పనుల ప్రతిపాదనలు తమకు అందలేదని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-10T00:50:39+05:30 IST