కౌన్సెలింగ్ ద్వారానే వీఆర్వోలకు విధులు కేటాయించాలి
ABN , First Publish Date - 2022-08-04T06:35:02+05:30 IST
వీఆర్వోల సర్దుబాటు విషయంలో కేటాయించే విధుల కేటాయింపును ప్రక్రియను లక్కీడ్రా ద్వారా కాకుండా కౌన్సెలింగ్ ద్వారా విధులు కేటాయించాలని వీఆర్వోల జేఏసీ కన్వీనర్ వేల్పుల రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- వీఆర్వోల జేఏసీ కన్వీనర్ రాజయ్య
- కలెక్టరేట్ ఎదుట వీఆర్వోల నిరసన
జగిత్యాల అర్బన్, ఆగస్టు 3: వీఆర్వోల సర్దుబాటు విషయంలో కేటాయించే విధుల కేటాయింపును ప్రక్రియను లక్కీడ్రా ద్వారా కాకుండా కౌన్సెలింగ్ ద్వారా విధులు కేటాయించాలని వీఆర్వోల జేఏసీ కన్వీనర్ వేల్పుల రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట తమ డిమాండ్ల సాధన కోసం వీఆర్వోల జేఏసీ ఆధ్వర్యం లో నిరసన తెలిపి, అనంతరం కలెక్టరేట్ కార్యాలయ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అసంబద్ద జీవో నంబర్ 121 వల్ల వీఆర్వోలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవోలో సీనియారిటీకి భద్రత లేదని, వెనువెంటనే సీనియారి టీని ప్రాతిపదికన సర్దుబాటు జరిపి, సీనియార్టీకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సర్దుబాటు విధాన ప్రక్రియ లక్కీ డ్రా నిర్వహించడం దారుణం అని, ఆప్షన్ లేకుండా కేటాయింపు జరపడం రాజ్యాం గ స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. లక్కీ డ్రా స్థానంలో కౌన్సెలింగ్ విధానంలో విధులు కేటాయించాలన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న రెవెన్యూ సర్వీస్ అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. జీవో సవరణతో పాటుగా, సర్వీస్ మ్యాటర్లో ఎలాంటి ఆటంకం లేకుండా బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్డర్ కాపీలు తహసీల్దార్లకు అందించి తీసుకోవాలని అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, ఆర్డర్ కాపీ తీసుకోని వీఆర్వోలను రిమూవ్ సర్వీస్ పేర కొందరు అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకొని పరిష్కరిస్తే ఏ శాఖలో అయినా తాము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, జీవో సవరణను మాత్రమే డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బంద తిరుపతి, కో కన్వీనర్ అచ్చ సంజీవ్, డివిజన్ కన్వీనర్ లక్ష్మీరాజం, స్వప్న, గుర్రం రత్నాకర్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
- ముగిసిన వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ
జగిత్యాల అర్బన్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. బుధవారం రాత్రి వరకు సాగిన ఈ సర్దుబాటు ప్రక్రియలో జిల్లాలో 187 మంది వీఆర్వోలకు గానూ సుమారు 176 మంది వీఆర్వోలకు ఆర్డర్ కాపీలను అందజేశారు. జీవో నంబర్ 121ను వ్యతిరేకిస్తూ వీఆర్వోలు ఆందోళన చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. జీవోను సవరించి సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ, ఆప్షన్, కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా శాఖల కేటాయింపు చేయాలని కోరినా జిల్లా అధికారులు వీఆర్వోల గోడును పట్టించుకోలేదని, ఇన్నేళ్లుగా రెవెన్యూ వ్యవస్థకు ఊడిగం చేసిన తమను తొలగించడంతో పాటు, చివరికి ఆప్షన్ అవకాశం లేకుండా విధుల్లోకి నెట్టివేశారని వీఆర్వో ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 10గంటల వరకు సాగిన ఈ ప్రక్రియలో జిల్లాలోని సుమారు 20కి పైగా శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ క్యాడర్లలో పోస్టింగ్లు ఇచ్చి ఆర్డర్ కాపీలను అందించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే సర్దుబాటు ప్రక్రియ జరిగిందని అధికారులు పేర్కొనడం గమనార్హం.