ట్రాఫిక్‌ నియమాలను పటిష్టంగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-03-16T06:01:50+05:30 IST

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ నియమాలను పటిష్టంగా అమలు చేయాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశించారు.

ట్రాఫిక్‌ నియమాలను పటిష్టంగా అమలు చేయాలి
ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణను పరిశీలిస్తున్న సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

- పెండింగ్‌ చలాన్ల క్లియరెన్స్‌కు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టండి

- ట్రాఫిక్‌ పోలీసులకు సీపీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాలు

కోల్‌సిటీ, మార్చి 15 : రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ నియమాలను పటిష్టంగా అమలు చేయాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం గోదావరిఖని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి స్టేషన్‌లో ఉన్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ట్రాఫిక్‌ నియమాలు పటిష్టంగా అమలు చేయాలని, ట్రాఫి క్‌ నియమాల ఉల్లంఘనలకు పాల్పడే వారు ఎంతటివారైనా ఉపేక్షించవద్దన్నారు. పోలీస్‌ సిబ్బంది కూడా ట్రాఫిక్‌ నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కమిషనరేట్‌ పరిధిలో వాహనాలపై ఉన్న పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాల్సిందిగా ట్రాఫిక్‌ ఏసీపీని ఆదేశించారు. ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రాయితీ కల్పించిందని, ప్రజలు, వాహనదారులు పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేసుకోవాలని సూచించారు. ఈ దిశగా ట్రాఫిక్‌ పోలీసులు వారికి అవగాహన కల్పించాలని కోరారు. ఈ తనిఖీల్లో అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) అఖిల్‌ మహాజన్‌, ట్రాఫిక్‌ ఏసీపీ బాలరాజు, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-16T06:01:50+05:30 IST