రెండో విడత ‘కంటి వెలుగు’ను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-12-07T00:30:30+05:30 IST
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు.
కరీంనగర్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు.జగిత్యాల కలెక్టరేట్ నుంచి మంత్రి వీడియో కాన్ఫర్సెన్సు ద్వారా రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులను కంటి వెలుగు కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. ప్రజలకు మేలు చేసే ఈ కార్యక్రమంలో అధికారులు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆశా, ఏఎన్‌ఎం, ఎస్‌హెచ్‌జి, మెప్మా సిబ్బందితో 48 టీంలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ఆప్తమాలాజీ అసిస్టెంట్లను నియమించామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ గరిమ గర్వాల్, డీఎంహెచ్‌వో డాక్టర్ జువైరియా, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ పాల్గొన్నారు.
మాత శిశు ఆరోగ్యకేంద్రంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సమీక్ష
సుభాష్‌నగర్: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి ఆసుపత్రిలోని మాత శిశు ఆరోగ్యకేంద్రంలో ప్రోగ్రామ్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్లు తగ్గించి, సాదారణ ప్రసవాలను పెంచాలన్నారు. అందుకు 100 శాతం గర్భిణులను నమోదు చేసి, కనీసం నాలుగాసార్లు వారికి పరీక్షలు నిర్వహించి, పోషకాహారం, ఐరన్‌మాత్రలు అందించాలన్నారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో టిఫా స్కానింగ్ మిషన్‌ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సదుపాయాలను గర్భిణులు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించి కేసీఆర్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎ రాజేశం, జాయింట్ డైరెక్టర్ (ఎంహెచ్‌ఎన్) డాక్టర్ పద్మజ, డీఎంహెచ్‌వో డాక్టర్ జువైరియా, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల పాల్గొన్నారు.