దసరా వరకు అతిథిగృహం పనులు పూర్తికావాలి

ABN , First Publish Date - 2022-08-05T05:26:19+05:30 IST

దసరా వరకు ఆర్‌అండ్‌బీ అతిథిగృహ నిర్మాణ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

దసరా వరకు అతిథిగృహం పనులు పూర్తికావాలి
అతిథి గృహం నమూనా

 ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌  నమూనా

 మంత్రి గంగుల కమలాకర్‌ 

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 8: దసరా వరకు ఆర్‌అండ్‌బీ అతిథిగృహ నిర్మాణ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గురువారం కరీంనగర్‌ ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించి కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. పాత భవనం శిథిలావస్థకు చేరుకున్నందున నూతన భవన నిర్మాణాన్ని చేపట్టాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాన్ని పూర్తిగా కూల్చివేసి ఆ స్థానంలో అందమైన గార్డెనింగ్‌, పార్కును ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ దసరా వరకు పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్‌ సునీల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి,  మాజీ ఎంపీపీ వాసాల రమేశ్‌ పాల్గొన్నారు. 


గీత కార్మికుల రాత మార్చేందుకే నీరా పాలసీ


కరీంనగర్‌ రూరల్‌: గీత  కార్మికుల తలరాత మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీరా పాలసీనీ తీసుకు వచ్చారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం కొత్తపల్లి మండలంలోని ఎలగందల్‌ గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలంలో తాటి, ఈత మొక్కలు నాటి, అనంతరం క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలగందల్‌ గ్రామంలో ఈత, తాటి వనం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించామని, ఈ స్థలంలో నాలుగు వేల మొక్కలు నాటి పెంచుతున్నామన్నారు. ఈత, తాటి మొక్కలను కాపాడుకునే బాధ్యత  గౌడన్నలు, ఎలగందల్‌ ప్రజలపై ఉందన్నారు. కరీంనగర్‌-ఎలగదుల్‌ పాత రోడ్డును పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  గతంలో పునరుద్ధరణ పనులు ప్రారంభించినప్పటికీ కాంట్రాక్టర్‌ మరణించడంతో ఆలస్యమవుతున్నాయన్నారు. ప్రస్తుతం మరో 20 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తున్నామన్నారు. పాత రోడ్డు నిర్మాణం పూర్తయితే దూరం తగ్గడంతోపాటు గ్రామానికి మంచి రోజులు రానున్నాయన్నారు. రాజకీయాలు ముఖ్యం కాదని అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్‌, సర్పంచ్‌ ఎల్దండి షర్మిల, ఎంపీపీ పిల్లి శ్రీలతమహేష్‌, జడ్పీటీసీ పిట్టల కరుణరవీందర్‌, ఎంపీటీసీ మంద రమేష్‌గౌడ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ సాబీర్‌పాషా, డీఆర్డీఏ పీడీ  శ్రీలత, తహసీల్దార్‌ చిల్లా శ్రీనివాస్‌, ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ అధికారులు ఎ శ్రీనివాస్‌రెడ్డి,  చంద్రమోహన్‌, డీటీఎఫ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మణెమ్మ, తాతాజి, సింధు, అశోక్‌,  గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-05T05:26:19+05:30 IST