రైతుల కల సాకారం కానున్న వేళ

ABN , First Publish Date - 2022-09-17T05:54:14+05:30 IST

చుట్టూ ప్రాజెక్టులు ఉన్నా తమ గ్రామాలకు సాగునీరు అండం లేదని దిగులు పడిన రైతుల కల సాకారం కానుంది. మిడ్‌ మానేరు కుడి కాలువ ద్వారా కొన్ని గ్రామాలకు అన్నపూర్ణ రిజర్వాయర్‌ ద్వారా మరికొన్ని గ్రామాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి కాలువల నిర్మాణాన్ని ప్రారంభించింది.

రైతుల కల సాకారం కానున్న వేళ
వెల్జీపూర్‌ సమీపంలోని బానప్ప చెరువు

- ఎత్తిపోతల పథకానికి రూ 156 కోట్లు 

- 8083 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం

- బానప్ప చెరువుకు మహర్దశ

ఇల్లంతకుంట, సెప్టెంబరు 16: చుట్టూ ప్రాజెక్టులు ఉన్నా తమ గ్రామాలకు సాగునీరు అండం లేదని దిగులు పడిన రైతుల కల సాకారం కానుంది. మిడ్‌ మానేరు కుడి కాలువ ద్వారా కొన్ని గ్రామాలకు అన్నపూర్ణ రిజర్వాయర్‌ ద్వారా మరికొన్ని గ్రామాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి కాలువల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఎత్తు ప్రాంతంలో ఉన్న ఇల్లంతకుంట మండలం వెల్జీపూర్‌, వల్లంపట్ల, ఒగులాపూర్‌, గూడెపుపల్లి, కిష్టరావుపల్లె గ్రామపంచాయతీలతోపాటు తంగళ్లపల్లి మండలం కొత్త చీర్లవంచ గ్రామాల రైతులు ఇంత కాలం ఎదురు చూశారు. పలువురు నాయకులకు  సమస్యలను విన్నవించారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌  పరిస్థితిని పరిశీలించారు.  ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించడం సాధ్యం అవుతుందని భావించారు. అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. దీంతో సీఎం కేసీఆర్‌ ఎత్తిపోతల పథకానికి రూ. 156 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి మంత్రివర్గం అమోదం తెలిపింది. మిడ్‌మానేరు క్రస్ట్‌గేట్ల సమీపం నుంచి పైప్‌లైన్‌ ద్వారా సాగునీరు అందించాలని నిర్ణయించారు. పైప్‌లైన్‌ ద్వారా వెల్జీపూర్‌ సమీపంలోని బానప్ప చెరువు నింపనున్నారు. చెరువు మత్తడి దూకితే వెల్జీపూర్‌లోని ఊర చెరువు, వల్లంపట్ల గ్రామంలోని చెరువులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో పైప్‌లైన్‌ ద్వారా ఒగులాపూర్‌, గూడెపుపల్లె చెరువులకు నీటిని అందించనున్నారు. ఈ ఎత్తిపోతల ద్వారానే రహీంఖాన్‌పేట, రంగపేట, కందికట్కూర్‌ గ్రామాల రైతులకు సైతం పాక్షికంగా లబ్ధిచేకూరనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

బానప్ప చెరువుకు మహర్దశ 

- ఉడుతల వెంకన్న, మాజీ సర్పంచ్‌ వెల్జీపూర్‌

ప్రభుత్వం ప్రకటించిన ఎత్తిపోతల పథకం ద్వారా వెల్జీపూర్‌ సమీపంలోని బానప్ప చెరువుకు మంచి రోజులు రానున్నాయి.   బానప్ప చెరువు నిండితే ఈ ప్రాంత రైతుల సాగునీటి సమస్య తీరిపోతుంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కల నెరవేరనుంది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.

  రైతులకు మంచి రోజులు 

- కేతిరెడ్డి అనసూయ, సర్పంచ్‌ వల్లంపట్ల

ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో రైతుల కష్టాలు తొలగనున్నాయి. వల్లంపట్ల పక్కనే మిడ్‌మానేరు ఉన్నా ఇంతకాలం సాగునీటి కోసం ఎదురు చూశాం. పైప్‌లైన్‌ ద్వారా సాగునీరు అందించనుండడంతో   భూములు కోల్పోతామని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. 

 రైతు సంక్షేమ ప్రభుత్వం 

- సిద్దం వేణు, జడ్పీవైస్‌ చైర్మన్‌ 

రైతాంగ ప్రభుత్వం కొనసాగుతుండడంతోనే భారీ బడ్జెట్‌తో ఎత్తిపోతల పథకానికి అనుమతులు వచ్చాయి. ఆరు గ్రామాలకు పూర్తిగా మరో మూడు గ్రామాల రైతులకు పాక్షికంగా లబ్ధి చేకూరనుంది. సీఎం, మంత్రి కేటీఆర్‌, వినోద్‌కుమార్‌, రసమయి బాలకిషన్‌కు ఈప్రాంత రైతులు రుణపడి ఉంటారు.  మిడ్‌మానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్లకు తోడుగా ఎత్తిపోతల పథకం రావడంతో మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందనుంది. 

Read more