సంక్షేమానికి దిక్సూచి తెలంగాణ

ABN , First Publish Date - 2022-09-17T05:47:14+05:30 IST

తెలంగాణ సాధించుకున్న తర్వాత సంక్షేమానికి దిక్సూచిగా మారిందని, కొత్త జిల్లాలతో అభివృద్ధిలో ముందుకెళ్తోందని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో సభ నిర్వహించారు.

సంక్షేమానికి దిక్సూచి తెలంగాణ
సిరిసిల్లలో నినాదాలు చేస్తున్న మంత్రి కేటీఆర్‌

- ఉగ్గుపాలతోనే బిడ్డలకు పోరాటం నేర్పిన తెలంగాణ తల్లులు 

  - అమిత్‌షావి ఊకదంపుడు ఉపన్యాసాలే  

- పురపాలక,ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు

- జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

తెలంగాణ సాధించుకున్న తర్వాత సంక్షేమానికి దిక్సూచిగా మారిందని, కొత్త జిల్లాలతో అభివృద్ధిలో ముందుకెళ్తోందని  పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో  సభ నిర్వహించారు. నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ భారత్‌లో హైదరాబాద్‌ సంస్థానం విలీనమైన రోజు సందర్భంగా ప్రభుత్వం మూడు రోజుల వేడుకలను నిర్వహిస్తున్నట్లు,  త్యాగధనులను స్మరించుకోనున్నట్లు తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 29 లక్షల పింఛన్లు ఉండేవని, కేవలం రూ.200, రూ.500 అందించే వారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 40 లక్షల పింఛన్లు అందిస్తున్నామని, రూ.2 వేలు, రూ.3 వేలకు పెంచామని అన్నారు. జిల్లాలో కొత్తగా 17 వేల మందికి పింఛన్లు అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలో 1.50 లక్షల కుటుంబాలు ఉంటే 1.24 లక్షల పింఛన్లు ఇస్తున్నామన్నారు. 

==రైతుల కుటుంబాలకు రైతు బీమా కింద రూ.58 వేల కోట్లు అందించామన్నారు. రైతులకుబీమాతో ధీమాను ఇచ్చామన్నారు. అదే తరహాలో చేనేత పవర్‌లూం కార్మిక కుటుంబాలకు    చేనేతబీమా అందించే విధంగా పథకాన్ని ప్రారంభించామన్నారు. 24 గంటల కరెంట్‌, నీళ్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు వంటి  ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో వేములవాడ సిరిసిల్ల కలిపి ఒక డిగ్రీ కాలేజీ ఉండేదని, ఇప్పుడు వ్యవసాయ పాలిటెక్నిక్‌, డిగ్రీ, జేఎన్‌టీయూ, డిగ్రీ కాలేజీలు, గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. త్వరలోనే మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కానుందన్నారు. సిరిసిల్ల కళాశాల మైదానంలో రూ.2 కోట్లతో ఆధునిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు.  గతంలో సిరిసిల్లలో నేత కార్మికులకు రూ.6 నుంచి రూ.8 వేల వరకు కూడా వేతనాలు అందని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వ ఆర్డర్లు, చేయూతతో రూ.16 నుంచి రూ.20 వేల వరకు వేతనాలు అందుకుంటున్నారని అన్నారు.  50 శాతం నూలు, రసాయనాలపై సబ్సిడీ పొందుతున్నారన్నారు. గతంలో నర్మాల ప్రాజెక్ట్‌ మత్తడి ఎప్పుడు దూకుతుందా? అని ఎదురు చూసే వాళ్లని, ఇప్పుడు కాళేశ్వరం జలాలతో ఎర్రటి ఎండలోనూ మత్తడి దూకుతోందని ఇది ఎవరైనా కలగన్నారా? అని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కష్టాలు తెలిసిన మనిషిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని, సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. పింఛన్లు రాకుండా మిగిలిపోయిన వారికి కూడా అందిస్తామన్నారు. 

కులం మతంపేరుతో చిచ్చు 

తెలంగాణలో కులం, మతం పేరుతో చిచ్చుపెట్టి మనుషుల మధ్య అంతరాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, తస్మాత్‌ జాగ్రత్త అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. లేనిపోని పంచాయతీ పెట్టి  తెలంగాణ సమాజాన్ని విచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని,   తస్మాత్‌ జాగ్రత్త  కనిపెట్టుకొని ఉండాలని అన్నారు. లేకుంటే దశాబ్దాల కాలం మళ్లీ వెనక్కి పోతామన్నారు. అరాచకాలు, దుర్మార్గపు వ్యక్తులు, వ్యవస్థలపై ఒకసారి అలోచించాలన్నారు. తెలంగాణపై దండయాత్రకు వచ్చినట్లు వస్తున్నవారు  ఎనిమిదేళ్లలో చేసిందేమీ లేదన్నారు.  ‘అల్లికి అల్లి, సున్నాకు సున్నా’ అని ఎద్దేవా చేశారు. కేవలం పంచాయితీలు పెట్టడం, పనికిమాలిని పిచ్చి మాటలు మాట్లాడడమేనన్నారు. సిరిసిల్లకు ఒక కాలేజీ, ఒక స్కూల్‌ తెచ్చారా? అని ప్రశ్నించారు. సిరిసిల్లకు మెగా పవర్‌లూం క్లస్టర్‌ ఇవ్వాలని ఎన్ని సార్లు అడిగినా దున్నపోతు మీద వాన వడ్డటే ఉంది తప్ప స్పందన లేదన్నారు. ఎనిమిదేళ్లుగా  గుర్తుకురాని సెప్టెంబరు 17 కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తుకు వచ్చిందని, ఇద్దరు ముఖ్యమంత్రులు, హోంమంత్రి అమిత్‌షా వంటి వాళ్లు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారని అన్నారు. తెలంగాణకు అమిత్‌షా వంటి పెద్దమనిషి వస్తే ఓ పదివేల కోట్ల నిధులు ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు. మెడికల్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌ కాలేజీ ఇవ్వాలి కదా అన్నారు. జాతి నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం బాగా పనిచేస్తున్నందుకు నిధులు ఇవ్వాలని మాత్రం అనుకోవడం లేదన్నారు.  కేవలం హిందూ ముస్లిం, నిజాం హిందూ, పంచాయితీ పెట్టి నాలుగు ఓట్లు వేసుకోవాలనే చిల్లర మాటలే తప్ప ఏమీ లేదన్నారు.  హిందూ ముస్లింలు కలిసి ఉండే రాజకీయాలు నడువవని వారు భావిస్తున్నారన్నారు. హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్‌ తప్ప వారికి ఏమీ తెలియదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పోటీగా కార్యక్రమాలు, పోటీ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. విచ్ఛినకర శక్తులకు తెలంగాణ పోరాటగడ్డ మీద స్థానం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్తోందన్నారు. హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో ఐక్యమైన రోజును సమైక్య దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తోందన్నారు.  ‘రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో మా తాతగారు, మా అమ్మతండ్రి జోగినపల్లి కేశవరావు, స్వాతంత్య్ర పోరాటం, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు’ అని అన్నారు. 1980లో భారత ప్రభుత్వం గుర్తించి పింఛన్‌ కూడా మంజూరు చేసిందని గుర్తు చేశారు. చిన్నతనంలో సెలవులు వస్తే శాభాష్‌పల్లి వాగు నుంచి కొదురుపాక తాత దగ్గరికి వెళ్లేవాడినని చెప్పారు.  మొదటి మనవడిని కావడంతో ఎక్కువగా చనువు ఉండేదని, నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా అనాటి పోరాటాల గురించి చెప్పేవారని అన్నారు.  శాసనసభలో తీర్మానం లేకపోయినా ప్రజల అకాంక్ష మేరకు రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచ్చన్న డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారమే తెలంగాణ వచ్చిందన్నారు. అంబేద్కర్‌ గొప్పతనాన్ని భావితరాలకు తెలిసేలా తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్‌ పేరును పెట్టుకున్నామన్నారు. పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్‌ పేరు పెట్టాలన్నారు. 

తెలంగాణ బిడ్డలకు పోరాటం కొత్త కాదు  

‘తెలంగాణ బిడ్డలకు పోరాటం కొత్త కాదు. ఉగ్గుపాలతోనే బిడ్డలకు పోరాటాన్ని నేర్పిన తెలంగాణ తల్లులు ఉన్న గడ్డ’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 1948 తరువాత 1956లో ఇష్టం లేని బలవంతపు పెళ్లిలాగా ఆంధ్రా, తెలంగాణ కలిపే ప్రయత్నంలో ఇడ్లీసాంబార్‌ గో బ్యాక్‌ అంటూ పోరాటం చేసి కేంద్రానికి మన ఆవేదనను చెప్పామన్నారు. 1968లో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశామని 370 మంది బలిదానాలు చేశారని గుర్తు చేశారు. 40 దశకంలో నిజాంకు వ్యతిరేకంగా, 50 దశకంలో ఆంధ్రా, తెలంగాణ విలీనంపై, 1968లో తెలంగాణ కోసం పోరాటాం చేయగా 2001లో కేసీఆర్‌ నాయకత్వంలో 14 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామన్నారు. తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను తెచ్చుకున్నామన్నారు.   తెలంగాణ పవర్‌లూం టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌ మాట్లాడుతూ చైర్మన్‌ బాధ్యతలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  మంత్రి కేటీఆర్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సిరిసిల్ల ప్రాంత ముఖ చిత్రం మారిపోయిందని పద్మశాలీలు, నేత కార్మికులు అర్థికాభివృద్ధి సాధించారని అన్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో  అమలు జరుగుతున్నాయన్నారు.  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ భారతదేశంలో తెలంగాణ విలీనమైన సందర్భంగా సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం హర్షనీయమన్నారు.  కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డే, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి చైర్మన్‌ గడ్డం నర్సయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్‌, ఖీమ్యానాయక్‌, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఆర్వో శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు చీటి నర్సింగరావు, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ గాజుల నారాయణ, బొల్లి రామ్మోహన్‌,  జడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు పాల్గొన్నారు. 

బీజేపీ ప్రజాప్రతినిధులకు నో ఎంట్రీ 

అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాలకు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో బీజేపీ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి కేటీఆర్‌ హాజరైన ఈ సభకు సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిలర్లందరినీ ఆహ్వానించారు. బీజేపీకి చెందిన కౌన్సిలర్‌ బోల్గం నాగరాజు, ఎంపీటీసీ రాము సభ వద్దకు వచ్చి ప్రజాప్రతినిధుల గ్యాలరీలో కూర్చున్నారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయగా వాగ్వాదం మొదలైంది. మున్సిపల్‌ కౌన్సిలర్లందరూ వేదిక మీద కూర్చోగా తనను ఎందుకు పిలిచారంటూ ప్రశ్నించారు. చివరకు మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య జోక్యం చేసుకొని వారికి ఆహ్వానం ఉందంటూ వేదిక మీదికి తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. 

పింఛన్లు రావడం లేదు 

సిరిసిల్ల సభలో మరో పదనిస చోటు చేసుకుంది. నూతనంగా నియామకమైన పవర్‌లూం, టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌ చైర్మన్‌ అయిన తొలి ప్రసంగంలో అత్యుత్సాహం బెడిసి కొట్టింది. సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తూ అందరికీ పింఛన్‌ వస్తుంది కదా? అంటూ మహిళలను ప్రశ్నించారు. అందులో ఉన్న కొందరు మహిళలు పింఛన్‌ రావడం లేదనడంతో అవాక్కయ్యారు. తరువాత ప్రసంగంలో మంత్రి కేటీఆర్‌ జోక్యం చేసుకొని జిల్లాలో లక్షా 24 వేల కుటుంబాలకు పింఛన్లు ఇస్తున్నామని, ఎక్కడైనా మిగిలిపోయిన వారు ఉంటే  అందోళన పడవద్దని, అందరికీ పింఛన్లు ఇస్తామని సర్ధిచెప్పడం కొసమెరుపు. 


Read more