విద్యార్థులు ప్రణాళికతో చదవాలి
ABN , First Publish Date - 2022-03-05T05:41:10+05:30 IST
పదోతరగతి విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదవాలని డీఈవో రాధాకిషన్ అన్నారు. శుక్రవారం సిరిసిల్లలోని వెంకంపేట జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో గోరుముద్ద కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించారు.
సిరిసిల్ల ఎడ్యుకేషన్, మార్చి 4: పదోతరగతి విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదవాలని డీఈవో రాధాకిషన్ అన్నారు. శుక్రవారం సిరిసిల్లలోని వెంకంపేట జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో గోరుముద్ద కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటగా ఈ పాఠశాలలో ప్రారంభించామని, పదోతరగతి విద్యార్థులు గోరుముద్దను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పరీక్షలకు ఇంకా రెండు నెలల సమయం ఉందని, విద్యార్థులు ప్రత్యేక తరగతులకు ప్రజాప్రతినిధులు, దాతలు అందించే గోరుముద్దను వినియోగించుకొని మంచిగా చదువుకోవాలని అన్నారు. ప్రత్యేక తరగతులలో సందేహాలు వస్తే ఉపాధ్యాయులను అడిగి వాటిని నివృత్తి చేసుకోవాలని, మంచి మార్కులు సాధించి దాతల పేర్లను నిలబెట్టాలని అన్నారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను మంచిగా చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం విద్యార్థులకు గోరుముద్దను అందించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి దూస రఘుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లేశం, వార్డు కౌన్సిలర్ కల్లూరి రాజు, దూస వినయ్, మాజీ కౌన్సిలర్ వనజ, ఎస్‌ఎంసీ చైర్మన్ వీరబత్తిని కమలాకర్, భారతీఫౌండేషన్ ప్రతినిధి ప్రణీత్, ఉపాధ్యాయులు సానబాబు, రమేష్, దేవయ్య పాల్గొన్నారు.