అటకెక్కిన వార్డు కమిటీలు

ABN , First Publish Date - 2022-09-29T06:18:33+05:30 IST

పట్టణాభివృద్ధిలో స్థానికులు, యువకులను భాగస్వామ్యం చేయాలనే ఉద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు కమిటీలు అటకెక్కాయి.

అటకెక్కిన వార్డు కమిటీలు

- పత్తాలేని అభివృద్ధి ప్రణాళిక

- కొరవడిన పర్యవేక్షణ

- పట్టణాల్లో వేధిస్తున్న సమస్యలు

జగిత్యాల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పట్టణాభివృద్ధిలో స్థానికులు, యువకులను భాగస్వామ్యం చేయాలనే ఉద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు కమిటీలు అటకెక్కాయి. ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు కౌన్సిలర్ల సమన్వయంతో స్వచ్ఛందంగా పని చేస్తూ అభివృద్ధికి కృషి చేయాలని గతంలో ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల పరిధిలో మూడేళ్ల క్రితం వార్డు కమిటీ సభ్యులను నియమించినా కనీసం సమావేశాలు సైతం నిర్వహించని పరిస్థితి నెలకొంది. పట్టణాభివృద్ధిలో భాగస్వామ్యులు కావా లన్న ఆసక్తి ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది.

కొరవడిన పర్యవేక్షణ

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో రూ. కోట్ల నిధులు వెచ్చించి సీసీ రహదారులు, మురికి కాలువలు, కల్వర్టుల నిర్మాణాలు చేపడుతున్నారు. వార్డు కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు పనులను పర్యవేక్షణ చేయకపోవడంతో పనులు నాసిరకంగా చేపడుతున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వార్డు అభివృద్ధి కమిటీలు క్రియాశీలకంగా ఉంటే పర్యవేక్షణతో పాటు దగ్గరుండి నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టేలా చొరవ చూపే పరిస్థితి ఉండేది. జిల్లాలోని ఐదు మున్సిపల్‌ పరిధిలో కమిటీ సభ్యులను నియమించినప్పటికీ వార్డు కమిటీలు కాగితాలకే పరిమితమయ్యాయి. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం ప్రతి వార్డు అభివృద్ఢికి నాలుగు కమిటీలకు మొత్తం 60 మంది ఉంటారు. ఇందులో మొదటి కమిటీలో స్థానిక యువకులు, రెండో కమిటీలో మహిళలు, మూడో కమిటీలో విశ్రాంతి ఉద్యోగులు నాల్గవ కమిటీలో ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల్లో కీలకంగా పనిచేస్తున్న వారిని సభ్యులుగా నియమించారు. వార్డు కమిటీ సభ్యులతో ప్రతి రెండు, మూడు నెలలకొకసారి సమావేశాలు నిర్వహించి వార్డు అభివృద్ధికి ప్రణా ళికలు రూపొందించాల్సి ఉంటుంది.

వేధిస్తున్న సమస్యలు

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 134 వార్డులున్నాయి. ఇందులో జగిత్యాల మున్సిపల్‌లో 48 వార్డులు, కోరుట్లలో 33 వార్డులు, మెట్‌పల్లిలో 26 వార్డులు, ధర్మపురిలో 15 వార్డులు, రాయికల్‌లో 12 వార్డులున్నాయి. చాలా వార్డుల్లో పూర్తి స్థాయిలో మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టక పోవడంతో పారిశుధ్య సమస్య తీవ్రంగా వేధిస్తోంది. అన్ని పట్టణాల్లో వర్షాకాలంలో దోమల బెడదతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. నీటి నిల్వల తొలగింపు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టేందుకు ఎవరూ చొరవ చూపడం లేదు. కాగా పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు సందర్భంగా వార్డు కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యు లతో సమావేశాలు నిర్వహించారు. కరోనా వైరస్‌ ప్రభావంతో కొంత వర కు సమావేశాలు నిర్వహణ ఇబ్బందిగా మారింది. పట్టణాభివృద్ధిలో స్థానికులను భాగస్వామ్యం చేసేలా వార్డు కమిటీలో సమావేశాలు నిర్వహించాల్సిన అవసరముంది.

Read more