సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు చూపాలి
ABN , First Publish Date - 2022-06-21T05:59:38+05:30 IST
రైతులు సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసేందుకు మొగ్గు చూపాలని, అందుకు సాంప్రదాయ సాగు విధానాలపై అవగాహన పెంచుకోవాలని రామగుండం మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు.
- రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని నియంత్రించాలి
- అవగాహనా సదస్సులో మేయర్ అనిల్‌కుమార్
జ్యోతినగర్, జూన్ 20: రైతులు సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసేందుకు మొగ్గు చూపాలని, అందుకు సాంప్రదాయ సాగు విధానాలపై అవగాహన పెంచుకోవాలని రామగుండం మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం మేడిపల్లిలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా సదస్సులో మేయర్ మాట్లాడారు. రసాయన ఎరువులు, ఇబ్బడిముబ్బడిగా పురుగు మందులను వినియోగించడం వల్ల భూసారం క్షీణిస్తోందని, ఈ విషయంలో రైతులు వాటి వాడకాన్ని తగ్గించుకోవాలని ఆయన సూచించారు. క్రమక్రమంగా రసాయన ఎరువులు, మందుల వినియోగాన్ని నియంత్రించి సాంప్రదాయ వ్యవసాయ విధానాలను అమలు చేయలన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని రైతులు సరైన పద్ధతిలో సాగు చేయాలని తెలిపారు. భూమిలో పీఎస్‌బీ వాడకాన్ని పెంచాలని, ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న జీలుగ విత్తనాలు, పచ్చిరొట్టను వినియోగించాలన్నారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శ్రీనాథ్ ప్రసంగిస్తూ వరి పంటకు సంబంధించి విత్తనాలు వెదజల్లే విధానంలో సాగు చేయాలన్నారు. ఈ విషయంలో రెతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రైతు బంధు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పత్తిని సాగు చేస్తున్న రైతులు కందిని అంతర పంటగా వేసుకోవాలని ఆయన సూచించారు. రైతు వేదికలను సక్రమంగా ఉపయోగించుకొని ప్రయోజనం పొందాలని, నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తక్షణం వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కవిత, వ్యవసాయ శాఖ అధికారులు భూపతిరావు, ప్రకాష్, రైతు సమన్వయ సమితి మండల శాఖ అద్యక్షుడు గౌస్ భాషా, ఏఈవో, రైతులు పాల్గొన్నారు.