సంక్షేమ పథకాలతో వికలాంగులకు భద్రత
ABN , First Publish Date - 2022-12-16T00:44:03+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వికలాంగులకు భద్రత కలుగుతుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు.
- కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
మెట్‌పల్లి, డిసెంబరు 15 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వికలాంగులకు భద్రత కలుగుతుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని మహాజన్ గార్డెన్స్‌లో జరిగిన వికలాంగుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అథితిగా ఆయన పాల్గొన్నారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని వినతులను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోని వికలాంగులకు రూ. 3016ల పింఛన్, ఎకనామిక్ రిహాబీటిషన్ పథకం ద్వారా ఉపాధి కోసం రుణాలను అందజేస్తున్నామన్నారు. వికలాంగుల బస్సులో ప్రయాణించడానికి టికెట్‌లో సగం ధర పొందేలా పాసులను, ఉపకారణాల పథకంలో స్కూటీలు, బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేశామన్నారు. వికలాంగులను పెళ్లి చేసుకుంటే కల్యాణ లక్ష్మితో పాటు అదనంగా రివార్డ్ కింద రూ. 1,25లక్షలు అందజేసి ప్రోత్సహిస్తామన్నారు. కోచింగ్ తీసుకునే బీసీ, ఎస్సీ వికలాంగుల విద్యార్థులకు సీఎం కేసీఆర్ ఉచితంగా కోచింగ్ అందజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మీ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విందులో ఆయన పాల్గొని వికలాంగులకు అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినిపల్లి చంద్రశేఖర్‌రావు, నాయకులు, వికలాంగుల సంఘ నాయకులు పాల్గొన్నారు.