సుల్తానాబాద్‌లో ఇసుక లారీల అడ్డగింత
ABN , First Publish Date - 2022-10-27T00:28:53+05:30 IST
ఇసుక లారీల మూలంగా సుల్తానాబాద్ పట్టణంలో తీవ్రమైన దుమ్ము సమస్య నెలకొని ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని, దుకాణాల్లో దుమ్ము పేరుకుపోతోందని మున్సిపాలిటీ వారు బుధవారం ఇసుక లారీలను అడ్డుకున్నారు. దాంతో 150కి పైగా ఇసుక లారీలు రోడ్డుపై నిలిచి పోయాయి.
01ఎస్‌టబి27: సుల్తానాబాద్‌లో నిలిచిపోయిన ఇసుక లారీలు
సుల్తానాబాద్‌లో ఇసుక లారీల అడ్డగింత
- నిబంధనలు పాటించకపోవడంతో నిలిపివేసిన మున్సిపల్ అధికారులు
సుల్తానాబాద్, అక్టోబరు 27: ఇసుక లారీల మూలంగా సుల్తానాబాద్ పట్టణంలో తీవ్రమైన దుమ్ము సమస్య నెలకొని ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని, దుకాణాల్లో దుమ్ము పేరుకుపోతోందని మున్సిపాలిటీ వారు బుధవారం ఇసుక లారీలను అడ్డుకున్నారు. దాంతో 150కి పైగా ఇసుక లారీలు రోడ్డుపై నిలిచి పోయాయి. సుల్తానాబాద్ మీదుగా పలు మండలాలల్లోని ఇసుక క్వారీల నుంచి పెద్ద ఎత్తున ఇసుక లారీలు ప్రతి రోజు రాకపోకలు సాగిస్తున్నాయి. మొదట్లో సుల్తానాబాద్ పట్టణంలో ఈ లారీల రాకపోకల మూలంగా దుమ్ము సమస్య తలెత్తకుండా రోడ్లపై రోజు నీళ్లు చల్లించే వారు. అయితే గత రెండు మూడు నెలల నుంచి రోడ్లపై నీళ్లు చల్లించే కార్య్రమం నిలిపివేశారు. లారీలు మాత్రం యదావిధిగా దుమ్మును వెదజల్లుతున్నాయి. దాంతో ప్రజలు, వ్యాపారులు శ్వాస కోశ వ్యాధులకు గురవుతున్నామని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు మున్సిపల్ కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. పట్టణంలో దుమ్ము సమస్యను నివారించాలని కోరారు. స్పందించిన మున్సిపాలిటీ వారు బుధవారం సుల్తానాబాద్ రైల్వే గేట్ వద్ద నుంచి వస్తున్న ఇసుక లారీలన్నింటినీ నిలిపి వేశారు. దాంతో వందకు పైగా ఇసుక లారీలను సుల్తానాబాద్ పట్టణంలోకి రానివ్వకుండా అడ్డుకు న్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి లారీలను అపగా 150 కి పైగా లారీలు నిలిచిపోయాయి. సాయంత్రం ఆరు గంటల సమయంలో వదిలిపెట్టారు.
పాడవుతున్న రోడ్లు : సానిటరీ ఇన్‌చార్జీ శ్రావణ్
ఇసుక లారీల ఓవర్ లోడ్‌తో పట్టణంలోని రోడ్ల గుండా వెళ్లడం వల్ల రోడ్లు పూర్తిగా పాడవుతున్నాయని మున్నిపల్ శానిటరీ విభాగం ఇన్‌చార్జీ శ్రావణ్ తెలిపారు. మరో వైపు దుమ్ము సమస్య కూడా తీవ్రంగా ఉండడంతో మున్సిపల్ చైర్‌పర్సన్ అదేశాల మేరకు బుధవారం ఇసుక లారీలను అడ్డుకున్నామని తెలిపారు. 150 లారీలకు పైగా నిలిచిపోయినట్లు తెలిపారు. ఇసుక క్వారీ నిర్వాహ కులు స్పందించి సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రోడ్లపై నీళ్లు చల్లించే కార్యక్రమం చేశారని దాంతో లారీలను వదిలిపెట్టామన్నారు. ప్రతి రోజు లారీలు నడిచిన సమయాలలో తప్పనిసరిగా నీళ్లు చల్లాలని అలాగే ఓవర్ లోడ్‌తో వెళితే లారీలను కూడా ఆపేస్తామని హెచ్చరించారు. ఇసుక లారీలను ఆపివేయడంతో క్వారీ నిర్వాహకులు దిగి వచ్చి సమస్య పరిష్కరించేందుకు ఒప్పుకున్నారన్నారు.