‘ఉపాధి’ బిల్లులకు మోక్షమెప్పుడో?

ABN , First Publish Date - 2022-09-14T05:14:06+05:30 IST

మహాత్మాగాంఽధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద ఐదు మాసాల క్రితం గ్రామాల్లో చేపట్టిన సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల కోసం స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు.

‘ఉపాధి’ బిల్లులకు మోక్షమెప్పుడో?

- సిమెంట్‌ రోడ్లు నిర్మించి ఐదు నెలలు

- అప్పులు చేసి పనులు చేసిన ప్రజాప్రతినిధులు

- పెండింగులో రూ. 8.31 కోట్ల బిల్లులు 


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మహాత్మాగాంఽధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద ఐదు మాసాల క్రితం గ్రామాల్లో చేపట్టిన సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల కోసం స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అప్పులు చేసి పనులను సకాలంలో పూర్తి చేసినప్పటికీ బిల్లులు విడుదల కాకపోవడంతో వారు సతమతం అవుతున్నారు. 2005-06 అప్పటి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా నిరోధించేందుకు గానూ స్థానికంగానే ఉపాధిపనులను కల్పించేందుకు గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని తీసుకు వచ్చింది. దీనికి చట్టబద్ధత కల్పించడంతో పాటు ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా వంద రోజుల పనిదినాలు కల్పించాలని చట్టబద్ధం చేశారు. ఈ పథకం ద్వారా కేటాయించే నిధులను తప్పనిసరిగా 60శాతం కూలీల కోసం వెచ్చించాలని పేర్కొన్నారు. 40శాతం మెటీరియల్‌ కంపోనెంట్‌ కింద కేటాయిస్తారు. ఏడాది కాలంలో కూలీలు చేసిన పని విలువలో 40శాతం మెటీరియల్‌ కంపోనెంట్‌ను లెక్కించగా వచ్చే మొత్తాన్ని కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం 100శాతం మెటీరియల్‌ కంపోనెంట్‌ పనులకు కేటాయిస్తున్నది. అందులో భాగంగా ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో గ్రామాల్లో మట్టి రోడ్లను సిమెంట్‌ రోడ్లు మార్చేందుకు గానూ అదే మాసాల్లో పనులను మంజూరు చేస్తున్నది. మార్చి నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తేనే బిల్లులు వస్తాయని చెబుతున్నది. 

- 414 సిమెంట్‌ రోడ్లు.. 24 కోట్లు

ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 414 సిమెంట్‌ రోడ్లకు గాను 24 కోట్ల 15 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఈ పనులన్నింటినీ ఐదు లక్షలకు మించకుండా ప్రతిపాదించారు. అంతకు మించితే టెండర్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఆలోపే ప్రతిపాదనలు సిద్ధం చేసి నామినేషన్‌ ప్రాతిపదికన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికార పార్టీ నాయకులకు అప్పగించారు. ఇందులో చాలావరకు పనులు పూర్తయ్యాయి. మెటీరియల్‌ కంపోనెంట్‌ కింద నిధులు జనరేట్‌ కాలేదని కొన్ని పనులను చేపట్టలేదు. ఆ పనులు మొదలు పెడితే బిల్లులు వచ్చే పరిస్థితి లేదని గమనించే కొందరు ముందు జాగ్రత్తగా పనులు చేయలేదు. మార్చి నెలాఖరులోపు ఎంబీ రికార్డు అయిన పనుల్లో సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు బిల్లులు చెల్లించారు. ఆ తర్వాత రికార్డు అయిన పనులకు మాత్రం బిల్లులు రావడంలేదని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు చెబుతున్నారు. ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేయకపోవడంతో కార్యాలయాల చుట్టూ ప్రజాప్రతినిధులు, నాయకులు తిరుగుతున్నారు. ప్రతిరోజూ కనీసం నలుగురైదుగురు సర్పంచులైనా పంచాయతీరాజ్‌ ఈఈ కార్యాలయానికి వెళ్తున్నారు. 

- అత్యధికంగా పెద్దపల్లి నియోజకవర్గంలో..

జిల్లా వ్యాప్తంగా 8 కోట్ల 31 లక్షల 81 వేల 698 రూపాయల బిల్లులు చెల్లించాల్సి ఉందని ఇంజినీరింగ్‌ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో అత్యధికంగా పెద్దపల్లి అసెంబ్లీ నియోజవర్గ పరిధిలో చేపట్టిన పనులకు 4 కోట్ల 64 లక్షల 64 వేల 642 రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. మంథని నియోజకవర్గ పరిధిలోని పనులకు ఒక కోటి 36 లక్షల 11 వేల 369 రూపాయలు, రామగుండం నియోజకవర్గ పరిధిలో చేపట్టిన పనులకు  ఒక కోటి 20 లక్షల 60 వేల 465 రూపాయలు, ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ధర్మారంలో చేపట్టిన పనులకు ఒక కోటి 10 లక్షల 45 వేల 216 రూపాయలను చెల్లించాల్సి ఉన్నది. ఐదు మాసాలుగా ఈ బిల్లులు రాకపోవడంతో ప్రజాప్రతినిధులు, నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడ్డగోలు వడ్డీలకు అప్పులు చేసి డబ్బులు తీసుక వచ్చామని, రుణదాతలు అప్పులు తీర్చాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన సిమెంట్‌ రోడ్ల బిల్లులను సత్వరమే విడుదల చేసి తమను ఆదుకోవాలని స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు కోరుతున్నారు. 


Read more