కరీంనగర్‌ - వరంగల్‌ రోడ్డుకు మోక్షం

ABN , First Publish Date - 2022-12-31T00:37:18+05:30 IST

ఎన్నాళ్లుగానో అవస్థలు పడుతూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారి 563 పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు లభించి, రూట్‌ మ్యాప్‌ కూడా సిద్ధమైంది.

 కరీంనగర్‌ - వరంగల్‌ రోడ్డుకు మోక్షం
జాతీయ రహదారుల ముఖ్య అధికారి కృషప్రసాద్‌తో సమావేశమైన ఎంపీ బండి సంజయ్‌కుమార్‌

- రూ. 2,146.86 కోట్లతో అంచనాలు

- అన్ని అనుమతుల మంజూరు

- త్వరలో పనులు ప్రారంభం

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

ఎన్నాళ్లుగానో అవస్థలు పడుతూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారి 563 పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు లభించి, రూట్‌ మ్యాప్‌ కూడా సిద్ధమైంది. 68 కిలోమీటర్ల నిడివిగల కరీంనగర్‌-వరంగల్‌ రోడ్డు నిర్మాణం కోసం 2,146 కోట్ల 86 లక్షల రూపాయలు అవసరమవుతాయని ఇంజనీరింగ్‌ విభాగం అంచనా వేయగా కేంద్ర ఉపరితల, రవాణా మంత్రిత్వశాఖ ఈ నిధులను కేటాయించింది.

కేంద్ర మంత్రి, అధికారులతో ఎంపీ సంప్రదింపులు

ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఎన్‌హెచ్‌ 563 పనులను త్వరగా చేపట్టేందుకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అధికారులతో మంత్రి నితిన్‌గడ్కరీతో పలు దఫాలుగా సమావేశమై చర్చించడంతో ఈ రోడ్డు పనులకు మోక్షం లభించింది.. జాతీయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన భూమి సేకరించేందుకు, అలాగే ఇతరత్రా అనుమతులను ప్రభుత్వం జారీ చేసింది. ఈ పనికి టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఏజెన్సీలను ఖరారు చేసేందుకు ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అధికారులతో జరిపిన సంప్రదింపులు ఫలించి అన్ని ప్రక్రియలు పూర్తి చేశారు. త్వరలోనే నేషనల్‌ హైవే అథార్టీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వరకు నాలుగు వరుసల రహదారి ఏర్పాటై ప్రయాణికులకు సౌకర్యం కలుగడంతోపాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.

దశాబ్దకాలంగా ఎదురుచూపులు

దశాబ్దకాలంగా ఈ రోడ్డు అవసరమైన మరమ్మతులకు నోచుకోకుండా అడపాదడపా అక్కడక్కడ తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా డబుల్‌ రోడ్డు మాత్రమే కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు తలెత్తాయి. ఎదురెదురుగా వచ్చే వాహనాలతో ఎన్నో ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు గుంతల మయంగా ఉండడంతో ద్విచక్రవాహనదారులు పలుమార్లు ప్రమాదాలకు గురయ్యారు. ప్రస్తుతం ఈ రోడ్డును జాతీయ రహదారుల విభాగం నాలుగువరుసల రహదారిగా మారుస్తుండడంతో ప్రమాదాలు తగ్గడంతోపాటు మెరుగైన ప్రయాణసౌకర్యం కలుగనున్నది. పార్లమెంట్‌ సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జాతీయ రహదారుల ముఖ్య అధికారి కృష్ణప్రసాద్‌తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఈ రహదారి నిర్మాణ పనులు చేపట్టే విషయమై చర్చించారు. నిర్మాణ పనులు ప్రారంభించడానికి అన్ని ప్రక్రియలు పూర్తికావడంతో త్వరలోనే పనులు ప్రారంభిస్తారని ఆయన ప్రకటించారు. ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అన్ని అనుమతులను మంజూరు చేసిన అధికారులను అభినందించి త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తిచేయాలని కోరారు. కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వరకు ఈ రహదారికి ఇదివరకే నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా భూసేకరణ సమస్యలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత పలుమార్లు రూట్‌ మ్యాప్‌లో సవరణలు జరిగాయి. ప్రస్తుతం అన్ని ప్రక్రియలు పూర్తి కావడంతో రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు మోక్షం లభించింది. ఉత్తర తెలంగాణకు కేంద్రబిందువుగా అభివృద్ధి చెందిన కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి వరంగల్‌ వరకు జాతీయ రహదారిగా మార్చడంతో వ్యాపార వాణిజ్యపరంగానే కాకుండా పర్యాటకంగా కూడా మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-12-31T00:37:22+05:30 IST