మళ్లీ రోడ్డెక్కిన దుకాణాలు

ABN , First Publish Date - 2022-06-07T06:09:22+05:30 IST

కరీంనగర్‌లో దుకాణాలు మళ్లీ రోడ్డెక్కాయి. రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకొని పండ్లు, కూరగాయలు, ఇతర చిరుదుకాణాలు, దుకాణాలకు సంబంధించిన వస్తువులు, బోర్డులను దర్జాగా ఏర్పాటు చేస్తున్నారు.

మళ్లీ రోడ్డెక్కిన దుకాణాలు
నగరంలో రోడ్డుపైనే నిలిపిన వాహనాలు

- మంత్రి ఆదేశాలు బేఖాతరు

- మూణ్ణాళ్ల ముచ్చటగా ఆక్రమణల తొలగింపు 

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 6: కరీంనగర్‌లో దుకాణాలు మళ్లీ రోడ్డెక్కాయి. రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకొని పండ్లు, కూరగాయలు, ఇతర చిరుదుకాణాలు, దుకాణాలకు సంబంధించిన వస్తువులు, బోర్డులను దర్జాగా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు రోడ్లపైనే వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో నగర రోడ్లన్నీ కిక్కిరిసి పోతున్నాయి. నడిచేందుకు కూడా వీలులేకుండా ఫుట్‌పాత్‌లు, రోడ్లపై వెళ్లేందుకు వీలులేకుండా రోడ్లు కుచించుకు పోవడంతో ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలోని 14.5 కిలో మీటర్ల నిడివిలోని ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్లు, స్మార్ట్‌సిటీ రోడ్లు, ప్రధాన లింక్‌ రోడ్లను విస్తరించి ఇరువైపులా డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌లు నిర్మించడంతో ట్రాఫిక్‌ సమస్య తప్పుతుందని, ఈ ప్రాంతాలను బఫర్‌ జోన్‌గా డిక్లేర్‌ చేసి ఈ రోడ్లపై ఎక్కడ కూడా ఆక్రమణలు ఉండకూడదని ప్రకటించారు. 

అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

ప్రధాన రహదారులతోపాటు రోడ్లు, ఫుట్‌పాత్‌లను దర్జాగా ఆక్రమించుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి గంగుల కమలాకర్‌ మేయర్‌, సీపీ ఇతర అధికారులతో ఫిబ్రవరిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆక్రమణలను యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. ఇందుకోసం అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటుచేసి ఏడాది కాలం పాటు ప్రతి రోజు రోడ్లపై ఎక్కడ కూడా ఆక్రమణలకు ఆస్కారం లేకుండా చూడాలని ఆదేశించారు. రోడ్లు వాహనదారులకు, ఫుట్‌పాత్‌లు పాదచారుల కోసమే వినియోగించుకోవాలి. ఎక్కడ కూడా ప్రధాన రహదారులను, ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే వెంటనే వాటిని తొలగించి తిరిగి ఏర్పాటు చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.  రోడ్ల పక్కన చిరువ్యాపారులు, వీధివ్యాపారులకు స్థలాలను కేటాయించాలి. నగరంలోని ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లను నిర్మించి, ఎక్కడ కూడా రోడ్లను, ఫుట్‌పాత్‌ను ఆక్రమించకుండా చూడాలి. ఏడాది కాలం పాటు కఠినంగా వ్యవహరిస్తే వ్యాపారులు, ప్రజలు అలవాటుపడతారు. ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు పోలీస్‌, మున్సిపల్‌ సంయుక్త ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేసుకొని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. మార్చి రెండో వారంలో రోడ్లపై ఉన్న ఆక్రమణలన్నింటిని తొలగించారు. ప్రతిరోజు ఆక్రమణలు లేకుండా పర్యవేక్షణ చేశారు. దీంతో ప్రజలు ట్రాఫిక్‌ సమస్యలు తప్పినట్లేనని సంతోషించారు. ఆ తర్వాత ఉగాది, రంజాన్‌ పండుగల సందర్భంగా నెలరోజులపాటు వెసులుబాటు కల్పించి ఆ తర్వాత తిరిగి ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. ఏప్రిల్‌ రెండో వారం నుంచి మళ్ళీ ఆక్రమణలు మెల్లమెల్లగా మొదలయ్యాయి. మే 3న రంజాన్‌ మాసం ముగిసిన తర్వాత కూడా ఆక్రమణలను అధికారులు పెద్దగా పట్టించుకోక పోవడంతో మళ్లీ నగరంలోని ప్రధాన రహదారులపై దుకాణాలు వెలిశాయి. ఎక్కడ చూసినా రోడ్లపై ఆక్రమణలే దర్శనమిస్తున్నాయి. అయినా టాస్క్‌ఫోర్సు బృందం కానీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. 

ట్రాఫిక్‌ జాంలతో ఇబ్బందులు

ఫుట్‌పాత్‌లు, రోడ్లన్నీ ఆక్రమణలకు గురై రోడ్లు కుచించుకు పోయాయి. ఓవైపు మండుతున్న ఎండలతో ఉదయం, సాయంత్రం తప్ప ఇళ్ల నుంచి బయటకు వచ్చే వీలు లేకుండా పోయింది. సాయంత్రం సమయంలో టవర్‌సర్కిల్‌, మార్కెట్‌ రోడ్డు, కోర్టు రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, బస్టాండ్‌ రోడ్డు, కమాన్‌, మంచిర్యాల చౌరస్తా, లక్జెట్టిపేట రోడ్డు, కార్ఖానగడ్డ ఇలా అన్ని రోడ్లలో ట్రాఫిక్‌ జాంలతో వాహనదారులు, అటు పాదచారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో ప్రజలు మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశాలు మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిందని, అదనపు కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌ ట్రాఫిక్‌ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై ఉన్న చిరువ్యాపారులు, వీధివ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలనుచూపించక పోవడం కూడా ఆక్రమణలకు కారణంగా పేర్కొంటూ వారికి ప్రత్యేక స్థలాలు కేటాయించాలని కోరుతున్నారు. 

Read more