మిగిలింది.. 5 గంటలు
ABN , First Publish Date - 2022-12-15T00:50:56+05:30 IST
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టానికి మరో ఐదు గంటలే సమయం మిగిలింది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ దాఖలు కోసం టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది.
- నేటితో ముగియనున్న సెస్ నామినేషన్లు
- రెండో రోజు నామినేషన్ల జోరు
- 14 డివిజన్లలో 48 మంది అభ్యర్థుల దాఖలు
- సిరిసిల్ల టౌన్ - 1కు నిల్
- సెస్ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీల సందడి
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టానికి మరో ఐదు గంటలే సమయం మిగిలింది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ దాఖలు కోసం టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. నామినేషన్ల పర్వంలో రెండో రోజు బుధవారం సెస్ పరిఽధిలోని 15 డివిజన్లలో 48 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తొలి రోజు 12 మంది నామినేషన్లు వేయగా రెండోరోజు నామినేషన్ల జోరు కనిపించింది. సిరిసిల్ల టౌన్- 1 మహిళా రిజర్వేషన్‌లో ఎవరూ నామినేషన్ వేయకపోవడం గమనార్హం. సిరిసిల్ల టౌన్-2లో ఎనిమిది మంది, వేములవాడ టౌన్-2 ఇద్దరు, వేములవాడ టౌన్-1 ఒకరు, ముస్తాబాద్ ఇద్దరు, తంగళ్లపల్లి నలుగురు, గంభీరావుపేట ఆరుగురు, రుద్రంగి నలుగురు, కోనరావుపేట ఐదుగురు, ఇల్లంతకుంట నలుగురు, వీర్నపల్లి ఇద్దరు, ఎల్లారెడ్డిపేట ముగ్గురు, బోయినపల్లి ఇద్దరు, వేములవాడ రూరల్ ముగ్గురు, చందుర్తి ఇద్దరు చొప్పున నామినేషన్లు వేశారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు తమ ముఖ్యనాయకులతో సిరిసిల్ల సెస్ ప్రధాన కార్యాలయానికి తరలివచ్చారు. వీరితోపాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వారి అనుచరగణం రావడంతో సెస్ కార్యాలయం కిక్కిరిసింది. నామినేషన్ల కేంద్రానికి బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పవర్‌లూం, టెక్స్‌టైల్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు రావడంతో సందడిగా మారింది. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు మూడు గంటలకే ముగియాల్సి ఉన్నా చివరి క్షణంలో ఎక్కువ మంది రావడంతో సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల అధికారి మమత నామినేషన్లను స్వీకరించారు. చివరి రోజు గురువారం నామినేషన్ల స్వీకరణ గడువు ఉండడంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీలు మద్దతు ప్రకటించిన అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. మద్దతుదారులను కూడగట్టుకొని జిల్లాలోని సిరిసిల్ల టౌన్ - 1, సిరిసిల్ల టౌన్ - 2, వేములవాడ టౌన్- 1, వేములవాడ టౌన్-2, తంగళ్లపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, ఇల్లంతకుంట, బోయినపల్లి డివిజన్ల నుంచి డైరెక్టర్లుగా బరిలో నిలిచే అభ్యర్థులు ఆర్భాటంగా నామినేషన్లు వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీలో బుధవారం రాత్రి వరకు అభ్యర్థులపై కసరత్తు చేశారు. బీజేపీ కొంత మంది అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. రాగుల రాజిరెడ్డి సోదరుడు రాంరెడ్డి సెస్‌లో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. దీంతో సెస్ నిబంధనల ప్రకారం పోటీకి అనర్హుడిగా తిరస్కరణ గురువుతుందని భావించి మరో అభ్యర్థిని రంగంలో దింపడానికి కసరత్తు చేశారు. సెస్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తమ ఉనికి చాటుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులను బుజ్జగించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో సిరిసిల్ల టౌన్- 1 స్వతంత్రంగా బరిలోకి నిలవడానికి సిద్ధమైన మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గుడ్ల మంజుల బాలకిషన్‌ను నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, టెక్స్‌టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు మద్దతు కోరారు. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు బీఆర్‌ఎస్ పార్టీకి తమ సేవలు అందిస్తామని మంజుల వెల్లడించారు. ఇదే క్రమంలో ఇతర అభ్యర్థులను కూడా బుజ్జగించి మద్దతును కూడగట్టే పనిలో బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ 15 డివిజన్లకు సంబంధించి తమ అభ్యర్థులను ప్రకటించింది. సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల టౌన్ - 1 దిడ్డి రమాదేవి, సిరిసిల్ల టౌన్ - 2 దార్నం లక్ష్మీనారాయణ, తంగళ్లపల్లి నుంచి చిక్కాల రామారావు, ముస్తాబాద్ సందుపట్ల అంజిరెడ్డి, ఎల్లారెడ్డిపేట వరుస కృష్ణహరి, వీర్నపల్లి మాడుగుల మల్లేశం, గంభీరావుపేట గౌరినేని నారాయణరావు, వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ టౌన్ - 1 నామాల ఉమ, వేములవాడ టౌన్ - 2 రేగులపాటి హరిఛరణ్‌రావు, వేములవాడ రూరల్ ఆకుల దేవరాజు, చందుర్తి పొన్నాల శ్రీనివాసరావు, రుద్రంటి ఆకుల గంగారాం, కోనరావుపేట దేవరకొండ తిరుపతి, మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంటలో రవీందర్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు.
నామినేషన్ల సందడి
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల్లో రెండో రోజు నామినేషన్ల సందడి నెలకొంది. ఉదయం 10.30 గంటల వరకే అభ్యర్థులు సెస్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. నామినేషన్లకు సంబంధించి ముందుగా టోకెన్లు తీసుకొని క్రమ పద్ధతిలో దాఖలు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. నామినేషన్ల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.