రాష్ట్ర పౌరసరఫరాలశాఖ చైర్మన్‌గా రవీందర్‌సింగ్‌

ABN , First Publish Date - 2022-12-09T01:31:38+05:30 IST

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చైర్మన్‌గా నియమితులయ్యారు.

రాష్ట్ర పౌరసరఫరాలశాఖ చైర్మన్‌గా రవీందర్‌సింగ్‌

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేష్‌కుమార్‌ గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ళపాటు రవీందర్‌సింగ్‌ ఈ పదవిలో కొనసాగనున్నారు. కరీంనగర్‌లో గురువారం జరిగిన రవీందర్‌సింగ్‌ కూతురు పూజాగగన్‌దీప్‌కౌర్‌ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వెళ్లిన కొద్దిసేపటికే రవీందర్‌సింగ్‌కు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కుమార్తె వివాహం రోజే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చైర్మన్‌గా నియమించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

1995లో కౌన్సిలర్‌గా రాజకీయాల్లోకి..

1995లో మున్సిపల్‌ రాజకీయాల్లో అడుగుపెట్టి కౌన్సిలర్‌గా గెలుస్తూ వచ్చిన రవీందర్‌సింగ్‌ తెలంగాణ వచ్చిన తర్వాత కరీంనగర్‌కు మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. మేయర్‌ పదవీకాలం ముగిసిన తర్వాత రవీందర్‌సింగ్‌ ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనకు రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మాట ఇచ్చారు. ఆ పదవి దక్కకపోవడంతో నిరాశకు గురైన రవీందర్‌సింగ్‌ ఇండిపెండెంట్‌గా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి అధికార పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీలో నిలిచారు. అధికార పార్టీ అభ్యర్థికి గట్టి పోటీనే ఇచ్చినా ఆయన విజయం సాధించలేకపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రగతి భవన్‌ నుంచి ఆయనకు పిలుపువచ్చింది. దీంతో ఆయన వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం తాను ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినా తిరిగి టీఆర్‌ఎస్‌లోనే చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన టీఆర్‌ఎస్‌లోనే ఉన్నా ఆయనకు సానుకూల వాతావరణం లేకుండా పోయింది. స్వపక్షంలోనే విపక్షం అన్న మాదిరిగా రవీందర్‌సింగ్‌ పరిస్థితి మారింది. సీఎం జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడంతో అక్కడే మకాం వేస్తే పలువురు రాజకీయ సహాయకుల అవసరం ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ప్రావీణ్యం ఉండడం, న్యాయవాదిగా కూడా పనిచేసిన అనుభవం ఉండడం, నమ్మకస్తుడిగా, 20 ఏళ్లుగా పార్టీలో ఉన్న రవీందర్‌సింగ్‌కు పార్టీ జాతీయ రాజకీయాల బాధ్యతలను లేదా ఏదైనా కార్పొరేషన్‌ పదవిని రవీందర్‌సింగ్‌కు అప్పగిస్తే ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని భావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఢిల్లీ పర్యటన సందర్భంగా రవీందర్‌సింగ్‌ను కరీంనగర్‌ నుంచి పిలిపించుకుని రెండుసార్లు ఢిల్లీకి, పంజాబ్‌కు తీసుకెళ్లడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో ఉన్న రాజకీయ విబేధాల కారణంగా పార్టీ రోజువారి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న రవీందర్‌సింగ్‌కు అదేశాఖకు చైర్మన్‌ పదవిని అప్పగించడం పార్టీవర్గాలతోపాటు ప్రజల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Updated Date - 2022-12-09T01:31:42+05:30 IST