ఈటల సస్పెన్షన్‌పై నిరసనలు

ABN , First Publish Date - 2022-09-13T05:30:00+05:30 IST

హుజురాబాద్‌ శాసనసభ్యుడు ఈటల రాజేందర్‌ను రాష్ట్ర శాసనసభ నుంచి ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేశారు.

ఈటల సస్పెన్షన్‌పై నిరసనలు
జమ్మికుంటలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తున్న బీజేపీ నాయకులు

- హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సీఎం దిష్టిబొమ్మల దహనం

కరీంనగర్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హుజురాబాద్‌ శాసనసభ్యుడు ఈటల రాజేందర్‌ను రాష్ట్ర శాసనసభ నుంచి ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేశారు. ఈటలకు మద్దతుగా హుజురాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు నిరసన తెలిపాయి. జమ్మికుంట గాంధీ చౌరస్తావద్ద బీజేపీ నాయకులు, శ్రేణులు  రాస్తారోకో నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్యతోపులాట జరిగింది. హుజురాబాద్‌ అంబేద్కర్‌చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసి రాజేందర్‌ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు. వీణవంక మండల కేంద్రంలో కూడా బీజేపీ శ్రేణులు రాస్తారోకోను నిర్వహించాయి. 

అండగా నిలిచిన బీజేపీ నాయకులు

రాష్ట్ర స్థాయిలో బీజేపీ అగ్రనేతలందరూ రాజేందర్‌కు అండగా నిలిచి ఆయన సస్పెన్షన్‌ను వ్యతిరేకించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ రాజేందర్‌ సస్పెన్షన్‌ను ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రధానమంత్రిని ఉద్దేశించి ఇష్టంవచ్చిన రీతిలో మాట్లాడవచ్చుకానీ ఈటల రాజేందర్‌ స్పీకర్‌నుద్దేశించి మరమనిషి అంటే అనుచితమెట్లా అవుతుందని ప్రశ్నించారు. కేసీఆర్‌కు బీజేపీ అంటే భయం పట్టుకున్నదని అందుకే రాజేందర్‌ను అరెస్టు చేయించారని అన్నారు. కేసీఆర్‌ మాట్లాడితే ఒక న్యాయం, బీజేపీ నేతలు మాట్లాడితే మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు.  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  ఈవిషయంలో తీవ్రంగా స్పందించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ఈ సంఘటనపై స్పందిస్తూ సభలో కేసీఆర్‌ అబద్దాలను ఈటల బయటపెడతారనే భయంతోనే సస్పెండ్‌చేశారా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌ స్పీకర్‌ మరమనిషిగా వ్యవహరిస్తున్నారని వాఖ్యానించిన నేపథ్యంలో ఆయనను అసెంబ్లీ సమావేశాల నుంచి ఈ సెషన్‌ వరకే సస్పెండ్‌ చేయడంతో ఈ వ్యవహారం ముగిసినట్లయింది. ఆయనను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తారని ఐదు రోజులుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్లిన మొదటి రోజే బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురిని సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత  శాసనసభ సమావేశాల సందర్భంగా కూడా ఈటలతోపాటు ముగ్గురిని మొత్తం సమావేశాలకు రాకుండా సస్పెండ్‌ చేశారు. తిరిగి ఇప్పుడూ ఈటలపై సస్పెన్షన్‌ వేటు పడింది. 

Read more