ప్రభుత్వ భూములకు రక్షణ కరువు

ABN , First Publish Date - 2022-10-17T05:35:26+05:30 IST

మంథని పట్టణ శివారులో కోట్ల విలువ చేసే గైరాన్‌(ప్రభుత్వ) భూములకు రక్షణ కరువైంది.

ప్రభుత్వ భూములకు రక్షణ కరువు
మంథని పట్టణ శివారులోని గైరాన్‌ భూములు

- కోట్లు విలువ చేసే గైరాన్‌ భూములపై అక్రమార్కుల కన్ను

- ఇప్పటికే పలువురి పేరిట పట్టాలు జారీ

- కబ్జాకు గురవుతున్నట్లు కోర్టులో పిటిషన్‌ దాఖలు

- నిజానిజాలు తేల్చేందుకు రంగంలోకి అధికారులు

- పలువురికి నోటీసులు జారీ చేసిన తహసీల్దార్‌

మంథని, అక్టోబర్‌ 16: మంథని పట్టణ శివారులో కోట్ల విలువ చేసే గైరాన్‌(ప్రభుత్వ) భూములకు రక్షణ కరువైంది. మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారికి అనుకొని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి క్రాస్‌ రోడ్డు ప్రక్కనే ఉన్న సర్వే నెంబర్‌ 991లోని 2 ఎకరాల 24 గుంటల గైరాన్‌ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా మంథని పట్టణ విస్తరణ రియల్‌ ఎస్టేస్‌ కారణంగా వేగంగా పెరుగుతుండటంతో ప్రధాన రహదారికి అనుకొని ఉండటంతో భూములకు భలే డిమాండ్‌ వచ్చింది. దీంతో ఈ భూములకు బహిరంగ మార్కెట్‌లో సుమారు 6కోట్ల పైనే డిమాండ్‌ పలుకుతుంది. ఈ నేపథ్యంలో కోట్ల విలువ చేసే గైరాన్‌ భూములను సైతం కొందరు కబ్జా చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు తమకు ఈ భూములకు పట్టాలు ఉన్నాయంటూ క్రయవిక్రయలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంత భూమి క్రయవిక్రయాల్లో పలువురి పేరిట పట్టాలు, రిజిష్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంథని మాజీ ఉప సర్పంచ్‌ ఇనుముల సతీష్‌ మంథని పట్టణ శివారులోని గైరాన్‌ భూములను ప్రభుత్వం స్వాధీనపర్చుకొని ప్రభుత్వ, ప్రజల అవసరాలకు అనుగుణంగా వాడుకునేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో 2021లో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం ఫైల్‌ చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. హైకోర్టు పిల్‌ నెంబర్‌ 158/2021లో ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు గైరాన్‌ భూముల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం గైరాన్‌ భూముల్లో పట్టాలు కలిగి ఉన్న పలువురికి మంథని తహసీల్దార్‌ బండి ప్రకాష్‌ నోటీసులు జారీ చేశారు. వారికి గైరాన్‌ భూముల్లో ఎలా యాజమాన్య హక్కు సంక్రమించిందో ధ్రువీకరించే పత్రాలను తమకు పరిశీలన కోసం సమర్పించాలని సదరు నోటీసుల్లో పేర్కొన్నారు. తహసీల్దార్‌ నోటీసులు జారీచేయడం మంథని ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు ఆదేశాలతో కొనసాగుతున్న విచారణలో గైరాన్‌ భూముల వ్యవహారంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తున్నది. 

గైరాన్‌ భూములు అంటే.. 

గైరాన్‌ భూములను ప్రభుత్వ భూములుగా పరిగణిస్తారు. నిజాం కాలంలో పంటలు పండించే రైతుల పశువులు మేత మేయడానికి ప్రభుత్వ భూముల్లో కొంత భాగాన్ని ప్రత్యేకంగా కేటాయించేవారు. ఈ భూములను కేవలం పశువులు మేపుకోవడానికి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉండేది. ఇలా కేటాయించే స్థలాలు పూర్తిగా ప్రభుత్వ భూమి కాగా, వాటిని గైరాన్‌ భూములని పిలిచేవారు. రెవెన్యూ రికార్డుల్లో సైతం గైరాన్‌ భూములను ప్రభుత్వ భూములుగా స్పష్టంగా పేర్కొన్నారు. 

ప్రభుత్వ భూమికి పట్టాలు ఎలా వచ్చాయి..?

రెవెన్యూ రికార్డుల్లో సైతం స్పష్టంగా గైరాన్‌ భూములు ప్రభుత్వ భూములుగా చూపుతున్నప్పటికీ కొంత మందికి పట్టాలు ఎలా జారీ అయ్యాయి అనే విషయం మంథనిలో చర్చనీయాంశంగా మారింది. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములకు జారీ అయిన పట్టాల విషయంలో రెవెన్యూ అధికారులకు సైతం స్పష్టత రావడంతో లేదు. ఏ కారణంగా వారికి పట్టాలు జారీ అయ్యాయనే అంశంపై రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. 

నోటీసులు జారీ చేసిన తహసీల్దార్‌..

గైరాన్‌ భూముల్లో పట్టాలు పొంది ఉన్న పలువురికి మంథని తహసీల్దార్‌ బండి ప్రకాష్‌ నోటీసులు జారీ చేశారు. సదరు భూముల్లో వారికి ఎలా యాజమాన్య హక్కు సంక్రమించిందో డాక్యుమెంట్‌ రూపంలో తెలియజేయాలని నోటీసుల్లో సూచించారు. పట్టాలు కలిగి ఉన్న వారు ఇచ్చే డాక్యుమెంట్ల అధారంగా విచారణ జరిపి ఈ భూముల వ్యవహారంలో వాస్తవాలను నిగ్గుతేల్చే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమై ఉన్నారు. దీనిపై తహసీల్దార్‌ బండి ప్రకాశ్‌ వివరణ ఇస్తూ.. గైరాన్‌ భూముల వ్యవహారంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హైకోర్టులో పిల్‌కు కౌంటర్‌ దాఖలు చేయాల్సి ఉందన్నారు. సర్వే నెంబర్‌ 991లోని 2 ఎకరాల 24 గుంటల గైరాన్‌ భూమిని రికార్డుయుక్తంగా విచారణ జరిపి హైకోర్టుకు నివేదిస్తామన్నారు. 

Updated Date - 2022-10-17T05:35:26+05:30 IST