సిరిసిల్లలో పాలిస్టర్‌ వస్త్రపరిశ్రమల బంద్‌

ABN , First Publish Date - 2022-03-23T06:19:34+05:30 IST

పాలిస్టర్‌ వస్త్రానికి సంబంధించిన కూలి పెంచడంతోపాటు కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్‌ సబ్సిడీ, అసాములకు రావాల్సిన ఫింజర్ల సబ్సిడీ అందించాలని కార్మికులు, ఆసాములు మంగళవారం పాలిస్టర్‌ వస్త్రపరిశ్రమల బంద్‌ చేసి నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో సిరిసిల్లలో 20వేల మరమగ్గాలు మూగబోయాయి.

సిరిసిల్లలో పాలిస్టర్‌ వస్త్రపరిశ్రమల బంద్‌
సిరిసిల్లలో ధర్నా చేస్తున్న కార్మికులు, నాయకులు

- నిరవధిక సమ్మెకు దిగిన కార్మికులు, ఆసాములు

- పాలిస్టర్‌ ఉత్పత్తిదారుల సంఘం ఎదుట నిరసన 

సిరిసిల్ల రూరల్‌, మార్చి 22 : పాలిస్టర్‌ వస్త్రానికి సంబంధించిన కూలి పెంచడంతోపాటు కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్‌ సబ్సిడీ, అసాములకు రావాల్సిన ఫింజర్ల సబ్సిడీ అందించాలని కార్మికులు, ఆసాములు మంగళవారం పాలిస్టర్‌ వస్త్రపరిశ్రమల బంద్‌ చేసి  నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో సిరిసిల్లలో 20వేల మరమగ్గాలు మూగబోయాయి. పట్టణంలోని సీఐటీయూ తెలంగాణ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌, అసాముల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పాలిస్టర్‌ వస్త్ర పరిశ్రమలను బంద్‌ చేయించి కార్మికులతో బీవైనగర్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కొత్తబస్టాండ్‌లోని పాలిస్టర్‌ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం భవనం ఎదుట బైటాయించారు. కూలి పెంచాలని నినాదాలు  చేశారు. ఈ సందర్భంగా పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ మాట్లాడుతూ పాలిస్టర్‌ వస్త్రానికి సంబంధించి   నాలుగు సంవత్సరాల నుంచి కూలి పెంచకుండా యజమానులు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారన్నారు. వెంటనే కార్మికులు, ఆసాములకు కూలి పెంచాలని, సమ్మెను విరమింపజేయాలని  అన్నారు. అదేవిధంగా బతుకమ్మ చీరలను తయారు చేసిన కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్‌ సబ్సిడీతోపాటు ఆసాములకు రావాల్సిన ఫింజర్ల సబ్సిడీ అందించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామన్నారు.  పాలిస్టర్‌ వస్త్రోత్పత్తిలో పది పిక్కుల చిన్నపన్నకు ప్రస్తుతం  రూ.22.50 పైసలు ఉండగా 30 పైసలు, పెద్ద పన్నకు ప్రస్తుతం రూ.23.50 పైసలు ఉండగా 35 పైసలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆసాముల సమన్వయ కమిటీ నాయకులు సిరిసిల్ల రవీందర్‌, చేరాల అశోక్‌, కొండ సుభాష్‌, మండల రాజు, మరమగ్గాల కార్మిక సంఘం నాయకులు నక్క దేవదాస్‌, గుండు రమేష్‌, రాజమల్లు, చంద్రకాంత్‌, సతీష్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-23T06:19:34+05:30 IST