పోడు పోరు

ABN , First Publish Date - 2022-08-19T06:14:25+05:30 IST

పోడు భూముల సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశ గిరిజనుల్లో సన్నగిల్లుతుండడంతో మళ్లీ పోరు బాట పడుతున్నారు.

పోడు పోరు

- 9 నెలలు గడుస్తున్నా నెరవేరని ఆశలు 

- హరితహారంతో పోడు భూముల్లో గొడవలు 

- జిల్లాలో 67 గ్రామాల్లో పోడు భూముల సమస్య 

- మళ్లీ మొదలైన నిరసనలు, ఆందోళనలు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పోడు భూముల సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశ గిరిజనుల్లో సన్నగిల్లుతుండడంతో మళ్లీ పోరు బాట పడుతున్నారు. మరోవైపు హరితహారంలో భాగంగా పోడు భూముల్లో ప్లాంటేషన్‌ చేయడానికి పూనుకుంటున్న అటవీ శాఖ అధికారులను అడ్డుకోవడంతో గొడవలకు దారి తీస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 67 గ్రామాలకు సంబంధించి గత సంవత్సరం డిసెంబరులో పోడుభూములపై హక్కుపత్రాల కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్నా పరిష్కారం లభించక నిరాశతోనే ఉన్నారు. అధికారులు స్వీకరించిన దరఖాస్తులను అన్‌లైన్‌లో భద్రపరిచారు. జిల్లాలో ప్రధానంగా గిరిజనుల కంటే గిరిజనేతరుల నుంచి దరఖాస్తులు ఎక్కువగా రావడం గమనార్హం. 

- సిఫార్సులకు మోక్షమెప్పుడో? 

పోడు భూముల సమస్య పరిష్కారం కోసం స్వీకరించిన దరఖాస్తులను జిల్లా అధికార యంత్రాంగం సర్కారుకు సిఫార్సు చేశారు. 13 మండలాలు ఉండగా పోడు సమస్య ఉన్న ఎనిమిది మండలాల్లోని 67 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలో 2005 కు పూర్వం, 434.80 ఎకరాల భూమి పోడుకు గురికాగా తరువాత 7588.40 ఎకరాల్లో ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. నవంబరులో సర్పంచ్‌ అధ్యక్షతన గ్రామ కార్యదర్శి, రెవెన్యూ సహాయకలు, అటవీ బీట్‌ అధికారి, మండల సర్వేయర్లతో బృందాలు ఏర్పాటు చేసి గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో అధికారులు దరఖాస్తుల పరిశీలనకు కసరత్తు పూర్తి చేసి పరిశీలనకు ప్రభుత్వానికి పంపించారు. వీటిని పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హత ఉన్నవారికి హక్కు పత్రాలు అందించాల్సి ఉంది. పోడుభూములపై అధారపడి ఉన్నవారి కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగమున్నా అనర్హులుగానే చూస్తున్నారు. గిరిజనులు అయితే 25 ఏళ్ల పాటు, గిరిజనేతరులయితే 75 ఏళ్ల పాటు పోడు సాగు చేస్తున్నట్లు ఆధారాలు చూపించాల్సి ఉంది. రైతు కుటుంబానికి గరిష్టం పది ఎకరాలకు మించి ఉన్నా దానిని స్వాధీనం చేసుకోవాలని సర్కారు నిర్ణయించింది. దరఖాస్తుదారుల్లో గిరిజనేతరులు అధికంగా ఉండడంతో 75 ఏళ్ల ఆధారాలు తేవడం ఎలా సాధ్యమనేది కొత్త సమస్యగా మారింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం పరిధిలోనే పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వనున్నారు. 29 డిసెంబరు 2006 నుంచి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం అమల్లోకి వచ్చింది. 2005కు ముందు సాగులో ఉన్న గిరిజనులకు మాత్రమే హక్కు పత్రాలు జారీ చేయనున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్నవారిని గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు ముందుకు వెళ్లనున్నారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పుడు పత్రాలతో రికార్డయిన భూములు కూడా ఉన్నాయి. అటవీ  హక్కుల చట్టం ప్రకారం గిరిజనేతర కుటుంబాలకు గరిష్టంగా పదెకరాల వరకే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం మూడు తరాలు సాగులో ఉంటేనే హక్కు పత్రాలు ఇస్తారు. ఇప్పటికే గతంలో జిల్లాలో కొంత మందికి హక్కు పత్రాలను అందించారు. 587 ఎకరాల్లో 380 మంది రైతులకు హక్కుపత్రాలు ఇచ్చారు. తాజాగా ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వడంతో ఇటీవల పోడు చేసుకున్న వారు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. 

జిల్లాలో పోడు భూముల సమస్య 2,910 మంది రైతులు 8,023 ఎకరాల్లో ఉందని అధికారులు గుర్తించి సదస్సులు నిర్వహించారు. సదస్సుల్లో మాత్రం 14031.23 ఎకరాలకు సంబంధించి 5940 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఎస్టీలు 7785.31 ఎకరాలకు సంబంధించి 2842 మంది, ఇతరులు 6245.32 ఎకరాలకు సంబంధించి 3098 దరఖాస్తులు చేసుకున్నారు. గిరిజనుల కంటే ఇతరులు ఎక్కువగా ఉన్నారు. 

- జిల్లాలో ఆందోళనలు

పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని, గిరిజనులు గిరిజనేతరులు అందోళన చేపడుతున్నారు. వివిధ పార్టీలు వారికి మద్దతుగా నిలుస్తున్నాయి. జిల్లాలో వీర్నపల్లి, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లో అటవీశాఖ అధికారులను అడ్డుకోని వెనక్కి పంపించారు. కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి గిరిజనులు తరలివచ్చారు. కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయగా ఉద్రిక్తతకు దారి తీసింది. పోడు సమస్య పరిష్కారం జరగని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


Updated Date - 2022-08-19T06:14:25+05:30 IST