ప్రజలు సోదరభావంతో మెలగాలి

ABN , First Publish Date - 2022-07-07T06:11:22+05:30 IST

వివిధవర్గాలకు చెందిన ప్రజలు కుల, మత, వర్గ విభేదాలను విడనాడి సోదరభావంతో మెలగాలని పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ అన్నారు.

ప్రజలు సోదరభావంతో మెలగాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీ వి సత్యనారాయణ

- బక్రీద్‌ సందర్భంగా కమిషనరేట్‌ వ్యాప్తంగా ఆరు చెక్‌పోస్ట్‌లు

- సీపీ వి సత్యనారాయణ

కరీంనగర్‌ క్రైం, జూలై 6: వివిధవర్గాలకు చెందిన ప్రజలు కుల, మత, వర్గ విభేదాలను విడనాడి సోదరభావంతో మెలగాలని పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ అన్నారు. కమిషనరేట్‌ కేంద్రంలో శాంతికమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గోవధకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బక్రీద్‌ సందర్భంగా గోవధలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. గోవులను అక్రమ రవాణా చేయకుండా కమిషనరేట్‌ వ్యాప్తంగా ఆరు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. గోవుల అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు నేరుగా పోలీసులకు తెలియపరచాలన్నారు. గోవుల అక్రమ రవాణా జరుగుతున్నదనే అనుమానాలతో వాహనాలను తనిఖీ చేసి ఘర్షణపూరితమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బక్రీద్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడంతోపాటు వాహనాల దారిమళ్ళింపు చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు జరిగే ప్రాంతాలతోపాటు కొన్ని సున్నితమైన, అనుమానాస్పద ప్రదేశాల్లో తాత్కాలికంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ప్రతి కదలికపై నిఘా పెడుతామన్నారు. ఎలాంటి వదంతుల వ్యాపించినా ప్రజలు ఆందోళనచెందకుండా సంయమనంతో ఉండి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ ఎస్‌ శ్రీనివాస్‌, ఏసీపీలు కరుణాకర్‌రావు, విజయకుమార్‌, ఎస్‌బీఐ వెంకటేశ్వర్లు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

Read more