ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు వాడితే జరిమానా

ABN , First Publish Date - 2022-12-31T23:45:02+05:30 IST

సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల నిషేధంపై కఠిన చర్యలు చేపట్టే దిశగా జరిమానా వేయాలని మున్సిపల్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. శనివారం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి అధ్యక్షతన సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం నిర్వహించారు.

  ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు వాడితే జరిమానా
మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ

సిరిసిల్ల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల నిషేధంపై కఠిన చర్యలు చేపట్టే దిశగా జరిమానా వేయాలని మున్సిపల్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. శనివారం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి అధ్యక్షతన సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో ప్లాస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌ 2022 ప్రకారం, 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ట్‌, పాలిథిన్‌ క్యారీ బ్యాగుల నిషేదం ఉందని ఎవరైనా భద్రపరిచినా, విక్రయించినా భారీ జరిమానా వేయాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. రూ.1000 నుంచి రూ.25 వేల వరకు జరిమానా వేయనున్నారు. ఒకసారి వాడి వదిలేసిన పాలిథిన్‌ కవర్లతోపాటు ఇతర వస్తువులు వాడడంపై నిషేధం అమలులో ఉండడంతో అతిక్రమించిన వారికి రూ.1000 నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించడానికి పరిపాలన పరమైన ఆమోదం తెలిపారు. దీంతోపాటు పాత బస్టాండ్‌లోని 26 దుకాణాలు, కూరగాయాల మార్కెట్‌లో 41 దుకాణాలు, కొత్త బస్టాండ్‌ ఏరియాలో 11 దుకాణాలు, మినీస్టేడియంలో 5 దుకాణాలు, మొత్తం 83 దుకాణాలను ప్రభుత్వ రేట్ల ప్రకారం అవసరం ఉన్నవారికి నేరుగా కేటాయించడానికి కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2023 కార్యక్రమంలో రూ.23.50 లక్షలతో శానిటేషన్‌ నిర్వహణ, లిట్టార్‌ బిన్స్‌ కొనుగోలు, పెన్సింగ్‌, దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్ల ఏర్పాటుకు రూ .8.90 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ ప్రజల అవపరాల దృష్ట్యా 24 అంశాలను ఎజెండాలో చేర్చి చర్చించినట్లు, వాటికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

నామమాత్రంగా సమావేశం

సిరిసిల్ల మున్సిపల్‌ సమావేశాన్ని నామమాత్రంగా నిర్వహించారని, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కోరం ఉందని ఇష్టానుసారంగా ముగించారని బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ బోల్గం నాగరాజు, కౌన్సిలర్‌ భాస్కర్‌ ఆరోపించారు. 24 అంశాల ఎజెండాతో ఏర్పాటు చేసిన సాధారణ సమావేశం కేవలం 41 నిమిషాల్లోనే ముగించారన్నారు. విలీన గ్రామాల ప్రజలకు అన్యాయం జరుగుతున్నా ప్రతిపక్షంగా ఎంత మొత్తుకున్నా పాలకపక్షం పట్టించుకున్నా పాపాన పోవడం లేదన్నారు. ‘మున్సిపాలిటీ వద్దు.. గ్రామ పంచాయతీ ముద్దు’ అనే నినాదంతో పోరాటం చేస్తామన్నారు.

Updated Date - 2022-12-31T23:45:10+05:30 IST