అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి
ABN , First Publish Date - 2022-12-16T01:00:01+05:30 IST
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అన్నారు.
హుజూరాబాద్ రూరల్, డిసెంబరు 15: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అన్నారు. గురువారం హుజూరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఇరుమల్ల రాణి సురేందర్‌రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. గ్రామాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకొని గ్రామాలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నారు. పల్లె ప్రగతి పనులను పకడ్బందీగా చేయాలన్నారు. అనంతరం ఎంపీపీ రాణి మాట్లాడుతూ అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలన్నారు. మిషన్ భగీరథ నీరు అన్ని గ్రామాలకు అందేలా చూడాలన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు తమ గ్రామాల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. సమావేశంలో జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, తహసీల్దార్ కోమల్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.