జూన్‌లో స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-05-18T05:36:31+05:30 IST

ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత జూన్‌లో స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువరించే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి పార్థసారధి అన్నారు.

జూన్‌లో స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌
అధికారులతో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి పార్థసారధి

-  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి పార్థసారధి

కరీంనగర్‌, మే 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత జూన్‌లో స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువరించే అవకాశాలున్నాయని  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి పార్థసారధి అన్నారు. ఉప ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సమాయత్తమై ఉండాలని అధికారులకు సూచించారు. జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఏర్పాట్లను ఆయన మంగళవారం సమీక్షించారు. ఉదయం కరీంనగర్‌కు వచ్చిన ఆయన ముందుగా పోలీసుల నుంచి గౌరవందనం స్వీకరించారు. అనంతరం అధికారులతో ఉప ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ జిల్లాలో  రెండు సర్పంచ్‌, నాలుగు ఉపసర్పంచ్‌, 31 వార్డు సభ్యుల స్థానాలు, రెండు ఎంపీటీసీ స్థానాలు, ఒక వైస్‌ ఎంపీపీ, కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక కౌన్సిలర్‌ స్థానాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం చేశామని, పోలింగ్‌ స్టేషన్ల ముసాయిదా జాబితా కూడా ప్రచురించామని అధికారులు తెలిపారు. సమావేశంలో సీపీ సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, డీపీవో వీరబుచ్చయ్య, జడ్పీ సీఈవో ప్రియాంక పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:36:31+05:30 IST