సెస్‌ మాజీ చైర్మన్‌ రామారావు నామినేషన్‌ను తిరస్కరించాలి

ABN , First Publish Date - 2022-12-16T23:58:30+05:30 IST

సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంస్థ మాజీ చైర్మన్‌ చిక్కాల రామారావు అవినీతి అక్రమాలకు పాల్పడడంతోపాటు బకాయిలు ఉన్నారని, అతడి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ వేణు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు.

 సెస్‌ మాజీ చైర్మన్‌ రామారావు నామినేషన్‌ను తిరస్కరించాలి
సెస్‌ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 16: సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంస్థ మాజీ చైర్మన్‌ చిక్కాల రామారావు అవినీతి అక్రమాలకు పాల్పడడంతోపాటు బకాయిలు ఉన్నారని, అతడి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ వేణు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని సెస్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం సాయంత్రం బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ఎన్నికల అధికారుల తీరుకు నిరసనగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెస్‌కు చైర్మన్‌గా పనిచేసిన చిక్కాల రామారావు ఇప్పటికీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటన్నారని, ఇప్పటికి కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. తెలంగాణ కో ఆపరేటివ్‌ సొసైటీ రూల్స్‌ యాక్ట్‌ 1964 ప్రకారం అప్పటి డీసీవో రామాంజనేయులు సెస్‌లో రూ.33 కోట్ల అవినీతి జరిగిందని రిపోర్టు ఇచ్చారన్నారు. ఆ రిపోర్టు ఇంకా సెస్‌లో పెండింగ్‌లోనే ఉందని అన్నారు. ఈ విషయంపై హైకోర్టుకు వెళ్లగా జస్టిస్‌ రమేష్‌ రంగానాథన్‌ ధర్మాసనం సెక్షన్‌ 51 ప్రకారం అప్పటి డీసీవో రామాంజనేయులును ఎంక్వయిరీ అధికారిగా నియమించి వివరాలు సేకరించాలని అదేశించిందన్నారు. బకాయిలు ఉన్నవారికి సెస్‌ ఎన్నికల అధికారులు ఓటు హక్కు కల్పించకుండా ఆర్టికల్‌ 326ను ఉల్లంఘించారన్నారు. ఆరోపణలు వచ్చిన చిక్కాల రామారావు తిరిగి సెస్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తంగళ్లపల్లి మండల నుంచి నామినేషన్‌ వేశారని, ఎన్నికల అధికారులు తిరస్కరించాలని అన్నారు. అనంతరం ఎన్నికల అధికారి మమతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఠాకూర్‌ రాజ్‌సింగ్‌, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణువర్ధన్‌, కిసాన్‌ మోర్చా జిల్లా కార్యదర్శి వెన్నమనేని శ్రీధర్‌రావు, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు శ్రీగాధ మైసయ్య, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఊరగొండ రాజు, తంగళ్లపల్లి మండల అధ్యక్షడు సురువు వెంకట్‌, బీజేవైఎం తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు కోల అంజనేయులు, చొప్పదండి అంజన్న పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:58:42+05:30 IST