దేవీ నామం.. పరమ పవిత్రం

ABN , First Publish Date - 2022-09-26T06:19:24+05:30 IST

దసరా సరదాలే కాదు చైతన్యాన్ని కలిగించే పండుగ. హిందువులకు పండుగల్లో అతి ముఖ్యమైంది. తొమ్మిది రోజులపాటు దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తారు. ఈ పండుగలో మొదటి మూడు రోజులు పార్వతీదేవికి, తర్వాత మూడురోజులు లక్ష్మీ దేవికి, ఆ తరువాత మూడు రోజులు సరస్వతికి పూజలు నిర్వహిస్తారు.

దేవీ నామం.. పరమ పవిత్రం

- నేటి నుంచి శరన్నవరాత్రులు 

- ప్రత్యేక అలంకరణలో మండపాలు

 - జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు 

- రోజకో అవతారంలో అమ్మవారి దర్శనం  

 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

దసరా సరదాలే కాదు చైతన్యాన్ని కలిగించే పండుగ. హిందువులకు పండుగల్లో అతి ముఖ్యమైంది. తొమ్మిది రోజులపాటు దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తారు. ఈ పండుగలో మొదటి మూడు రోజులు పార్వతీదేవికి, తర్వాత మూడురోజులు లక్ష్మీ దేవికి, ఆ తరువాత మూడు రోజులు సరస్వతికి పూజలు నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారు. ఈసారి కొవిడ్‌ భయం లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రులు అత్యంత ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో మండపాలను అలంకరించారు. దక్షిణ కాశీగా పిలుచుకునే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దేవీ నవరాత్రులు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సోమవారం ప్రారంభమై నవరాత్రులు 5వ తేదీ బుధవారం విజయదశమితో ముగియనున్నాయి. 

నవదుర్గలుగా రాజరాజేశ్వరీ అమ్మవారు 

శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా జిల్లాలో పల్లెలు, పట్టణాలతోపాటు వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో రాజరాజేశ్వరీ అమ్మవారు నవదుర్గల రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు శైలపుత్రిగా, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడో రోజు చంద్రఘంట రూపం, నాలుగో రోజు కూష్మాండ అవతారం, ఐదో రోజు స్కందమాత రూపం, ఆరో రోజు కాత్యాయనిగా, ఏడో రోజు కాళరాత్రి రూపం, ఎనిమిదో రోజు మహాగౌరి అలంకారం, తొమ్మిదో రోజు సిద్దిదా అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. దసరా రోజున మహాలక్ష్మిగా పూజలందుకుంటారు. అమ్మవారి రూపాలైన మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతి, బాలాత్రిపురసుందరీదేవి, రాజరాజేశ్వరీ అమ్మవార్లలో ఒకరైన రాజరాజేశ్వరీ అమ్మవారు కొలువై ఉన్న క్షేత్రం కావడంతో  శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేకతగా భావిస్తారు. మరోవైపు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ సప్తమాతృకలలోని వారాహి రూపం కూడా అమ్మవారిలో నిక్షిప్తమై ఉన్నది. ఆలయ ఆవరణలోనే బాలాత్రిపురసుందరీదేవి, ఆలయం వెనుకవైపు మహిషాసురమర్ధినీ అమ్మవారు కొలువై ఉన్నారు. దీంతో దుర్గాష్టమి రోజున మహిషాసురమర్దినీ అమ్మవారికి మహాపూజ నిర్వహిస్తారు.


Read more