హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో ముసలం

ABN , First Publish Date - 2022-05-21T05:42:07+05:30 IST

హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో నిధులు దుర్వినియోగమయ్యాయని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో ముసలం
హుజూరాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయం

ఒక్కటైన అధికార పార్టీ, ప్రతిపక్ష కౌన్సిలర్లు

అవినీతి జరిగిందని కలెక్టర్‌కు ఫిర్యాదు

హుజూరాబాద్‌, మే 20: హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో నిధులు దుర్వినియోగమయ్యాయని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లతో పాటు ప్రతిపక్ష కౌన్సిలర్లు కూడా ఒక్కటై నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం హుజూరాబాద్‌ మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయగా 26మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకుండా అసంతృప్తిని వెళ్లగక్కారు. హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో 30మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్‌ 1, బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 24 ఉన్నారు. అప్పటి మంత్రి ఈటల రాజేందర్‌ గందె రాధికను చైర్‌పర్సన్‌గా నియమించారు. ఇటీవల హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు రాగా సీఎం కేసీఆర్‌ పట్టణాభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేశారు. టెండర్లు పూర్తయి పనులు కూడా జరుగుతున్నాయి. చైర్‌పర్సన్‌ భర్త తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా కమిషనర్‌ సహాయంతో బిల్లులు తీసుకుంటున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. గత ఏడాదిన్నర కిత్రం కూడా చైర్‌పర్సన్‌పై ఇదే తరహాలో సమావేశాన్ని బహిష్కరించారు. అప్పటి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లపై మండిపడ్డారు. దీంతో గొడవ సర్దుమనిగింది. మళ్లీ ఇప్పుడు చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల మధ్య పంపకాల విషయంలో తేడాలు వస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మున్సిపాలిటీలో జరిగిన వ్యవహారంపై పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

సంఘటనపై మంత్రులు హరీష్‌రావు, గంగుల ఆరా?

హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లతో పాటు ప్రతిపక్ష కౌన్సిలర్లు ఒక్కటయ్యారు. హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని ఏడు అంశాలతో కూడిన ఫిర్యాదును కౌన్సిలర్లందరూ కలిసి జిల్లా కలెక్టర్‌కు మెయిల్‌ ద్వారా పంపించారు. ఈ సంఘటనపై మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌లు ఆరా తీసినట్లు తెలిసింది. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే చైర్‌పర్సన్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం ఏమిటని టీఆర్‌ఎస్‌ నాయకులను మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌ అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. మరో వైపు ఇంటలిజెన్స్‌ అధికారులు మున్సిపాలిటీలో జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-05-21T05:42:07+05:30 IST