వెక్కిరిస్తున్న ఖాళీలు

ABN , First Publish Date - 2022-09-08T06:12:56+05:30 IST

అటవీ శాఖలో ఖాళీ పోస్టులు వెక్కిరిస్తున్నాయి. దీంతో జిల్లాలో లక్ష్యం మేరకు పనులు జరగడం లేదు.

వెక్కిరిస్తున్న ఖాళీలు

- జిల్లాలో అటవీ శాఖలో సిబ్బంది కొరత

- అధికారులు, ఉద్యోగులకు తప్పని అదనపు పని బారం

- రేంజ్‌ కార్యాలయాలకు సొంత భవనాలు కరువు

జగిత్యాల, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):  అటవీ శాఖలో ఖాళీ పోస్టులు వెక్కిరిస్తున్నాయి. దీంతో జిల్లాలో లక్ష్యం మేరకు పనులు జరగడం లేదు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై అదనపు బారం పడుతోంది. దీనికి తోడు పలు అటవీ శాఖ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం, అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో కార్యాలయాలు నిర్వహించాల్సి రావడంతో అధికారులు ఇక్కట్టు పడుతున్నారు. క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లాలన్నా వాహనాలు నడిపేందుకు అవసరమైన డ్రైవర్లు లేక ప్రైవేట్‌ వ్యక్తులతో నెట్టుకొస్తున్నారు..

జగిత్యాల జిల్లా అటవీ శాఖ పరిదిలో ధర్మపురి, కొడిమ్యాల, రాయికల్‌, మెట్‌పల్లి, జగిత్యాల రేంజ్‌ కార్యాలయాలున్నాయి. వీటితో జిల్లా సై్ట్రయికింగ్‌ ఫోర్స్‌ రేంజ్‌ బృందం పనిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2,419 స్క్వైర్‌ కిలో మీటర్లు అటవీ విస్తీర్ణం ఉంది. ఇందులో ధర్మపురి 595 స్క్వైర్‌ కిలో మీటర్లు, కొడిమ్యాల 399, జగిత్యాల 505, మెట్‌పల్లి 623, రాయికల్‌ 2.97 స్క్వైర్‌ కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ప్రతీ సంవత్సరం అటవీ శాఖ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 1.50 కోట్లు ఆదాయం వస్తోంది. జిల్లాలో 50 సామిల్‌ టింబర్‌ డిపోలు, 55 సామిల్స్‌, ఐదు బొగ్గు బట్టీలు అనుమతి పొంది పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆరు సంవత్సరాల్లో సుమారు ఏడు కోట్లకు పైగా మొక్కలు నాటడం, పెంపకం వంటి పనులు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 

- మూడు జిల్లాలకు ఒక్కరే డీఎఫ్‌వో...

జగిత్యాల జిల్లా అటవీ శాఖాధికారి (డిస్ట్రిక్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌)గా పనిచేస్తున్న వెంకటేశ్వర్‌రావు మూడు జిల్లాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరీంనగర్‌ డీఎఫ్‌వో శిక్షణలో ఉండడంతో కొంతకాలంగా జగిత్యాల డీఎఫ్‌వోకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా సిరిసిల్ల డీఎఫ్‌వో బాధ్యతలను సైతం కరీంనగర్‌ డీఎఫ్‌వో గతంలో నిర్వర్తిస్తుండడంతో ప్రస్తుతం కరీంనగర్‌ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న జగిత్యాల డీఎఫ్‌వోనే సిరిసిల్ల బాధ్యతలను సైతం నిర్వర్తిస్తున్నారు. ఇటు సొంత పోస్టు అయిన జగిత్యాల బాధ్యతలు నిర్వర్తిస్తూనే అదనంగా కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాల అటవీ శాఖ కార్యకలాపాలను చూసుకుంటున్నారు. ఒక్కో జిల్లాలో వారంలో రెండు రోజులు బాధ్యతలను జగిత్యాల డీఎఫ్‌వో నిర్వర్తించాల్సి వస్తోంది.

 ఎనిమిది సెక్షన్‌లకే పూర్తిస్థాయి అధికారులు..

జిల్లాలో గల జగిత్యాల, రాయికల్‌, మెట్‌పల్లి, ధర్మపురి, కొడిమ్యాల రేంజ్‌ల పరిధిలో 17 అటవీ సెక్షన్లున్నాయి. ఇందులో కేవలం ఎనిమిది సెక్షన్లకు మాత్రమే పూర్తి స్థాయి అధికారులున్నారు. మిగిలిన తొమ్మిది సెక్షన్‌ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమీపంలో గల ఇతర సెక్షన్ల అధికారులకు ఖాళీ ఉన్న పోస్టుల బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో కోరుట్ల, కథలాపూర్‌, ఇబ్రహీంపట్నం, కొండగట్టు, కల్లెడ, సారంగపూర్‌, మంగేళా, పోతారంతో పాటు ఒక రేంజ్‌ స్ట్రయిక్‌ సెక్షన్‌ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో మూడు డిప్యూటీ ఫారెస్టు అధికారుల పోస్టులుండగా అన్నీ ఖాళీగానే ఉన్నాయి. జిల్లాలో తొమ్మిది డిప్యూటీ రేంజ్‌ అధికారి పోస్టులుండగా ఖాళీలు లేవు. క్షేత్రస్థాయిలో అటవీ సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించే కీలకమైన బీట్‌ అధికారుల పోస్టులు సైతం ఖాళీగా ఉంటున్నాయి. జిల్లాలో 75 బీట్‌ అధికారుల పోస్టులున్నాయి. ఇందులో 39 బీట్‌ అధికారులు పనిచేస్తుండగా 36 బీట్‌ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమీపంలోని బీట్‌ అధికారులకు ఖాళీ పోస్టుల స్థానంలో అదనపు బాధ్యతలు అప్పగించారు.

-  కార్యాలయాల్లో ఖాళీలు ఇలా..

జిల్లాలో గల అటవీ శాఖ కార్యాలయాల్లో సైతం సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. జిల్లా కేంద్రంలో గల జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయంలో ఖాళీ పోస్టులతో ఉద్యోగులు సతమతమవుతున్నారు. జిల్లా కార్యాలయంలో 11 పోస్టులకు గానూ కేవలం ఐదుగురు పనిచేస్తుండగా ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉద్యోగులకు అదనపు భారం తప్పడం లేదు. ఒక్కోరోజు రాత్రి 10 గంటల వరకు సైతం విధులు నిర్వర్తించాల్సి వస్తుండడంతో ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. కార్యాలయంలో నలుగురు సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు గానూ రెండు ఖాళీలున్నాయి. రెండు సూపరింటెండెంట్‌ పోస్టులకు గాను ఒక్కటి ఖాళీగా ఉంది. ముగ్గురు జూనియర్‌ అసిస్టెంట్లకు గానూ ఒక్కరు పనిచేస్తుండగా రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు డీఎం పోస్టులకు గానూ ఒకటి ఖాళీగా ఉంది. జిల్లాలో ఐదు రేంజ్‌ కార్యాలయాలున్నాయి. ఒక్కో రేంజ్‌ కార్యాలయానికి ఒక జూనియర్‌ అసిస్టెంట్‌, ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఒక అటెండర్‌ పోస్టులున్నాయి. కాగా జిల్లాలో ఏడుగురు అటెండర్లకు గానూ ముగ్గురు అటెండర్లు మాత్రమే పనిచేస్తున్నారు. జిల్లాలో ఆరు డ్రైవర్‌ పోస్టులకు గానూ మూడు ఖాళీలున్నాయి. ప్రైవేట్‌ డ్రైవర్లతో పనిచేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా అటవీశాఖలో కార్యాలయాలకు సొంత భవనాలు కరువయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో భవనాలున్నప్పటికీ శిథిలావస్థకు గురికావడం, ఇతర ఇబ్బందులు నెలకొన్నాయి. జిల్లా అటవీశాఖ కార్యాలయాన్ని డీఎఫ్‌వో క్వార్టర్స్‌లో నిర్వర్తిస్తున్నారు. జగిత్యాల, కొడిమ్యాల రేంజ్‌ కార్యాలయాలకు సొంత భవనాలున్నాయి. ధర్మపురి రేంజ్‌ కార్యాలయానికి సొంత భవనం ఉన్నప్పటికీ శిథిలావస్థకు చేరుకుంది. మెట్‌పల్లి, రాయికల్‌ రేంజ్‌ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 

- ఆదాయంపై ప్రభావం..

జిల్లాలో అటవీ శాఖ ద్వారా ప్రతీ యేటా ప్రభుత్వానికి సుమారు రూ. 1.20 కోట్ల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఆదాయం లక్ష్యంగా పనిచేస్తున్నారు. జిల్లాలో గల సామిల్స్‌, సామిల్‌ టింబర్‌ డిపోలు, బొగ్గు బట్టీల ద్వారా పన్నుల రూపంలో ఆదాయం వస్తోంది. వీటికి తోడు అక్రమ కలప రవాణాను అరికట్టడం, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పనుల ద్వారా జరిమానాల రూపంలో ఆదాయం రాబడుతున్నారు. 2021-22 సంవత్సరంలో 1.55 కోట్ల ఆదాయం లక్ష్యానికి గానూ రూ. 55 లక్షలు వసూలు అయ్యాయి. రూ. 95 లక్షల ఆదాయం రావాల్సి ఉంది. 2022-23 సంవత్సరానికి గానూ రూ. 1.25 కోట్ల ఆదాయం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో ఇప్పటివరకు రూ. 15 లక్షల ఆదాయం లభించింది. ఇంకా రూ. 1.10 కోట్ల ఆదాయం రాబట్టాల్సి ఉంది. అటవీ శాఖలో నెలకొన్న పోస్టుల ఖాళీ సమస్యలు లక్ష్యం మేరకు ఆదాయం సమకూర్చడంపై ప్రభావాన్ని చూపుతోంది.


Updated Date - 2022-09-08T06:12:56+05:30 IST