పోషకాహార లోపాన్ని నివారించేందుకు మిల్లెట్స్‌ ఫుడ్‌

ABN , First Publish Date - 2022-09-11T05:19:36+05:30 IST

చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు మిల్లెట్స్‌ ఫుడ్‌ అందజేస్తున్నట్లు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని రాజీవ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం మిల్లెట్స్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, కౌన్సిలర్‌ బుర్ర లక్ష్మీతో కలిసి ప్రారంభించారు.

పోషకాహార లోపాన్ని నివారించేందుకు మిల్లెట్స్‌ ఫుడ్‌
రాజీవ్‌నగర్‌లో మిల్లెట్స్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌

-  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

-  రాజీవ్‌నగర్‌లో మిల్లెట్స్‌ ఫుడ్‌  ఫెస్టివల్‌ ప్రారంభం 

సిరిసిల్ల రూరల్‌, సెప్టెంబరు 10: చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు మిల్లెట్స్‌ ఫుడ్‌ అందజేస్తున్నట్లు  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని రాజీవ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం మిల్లెట్స్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి,  కౌన్సిలర్‌ బుర్ర లక్ష్మీతో కలిసి  ప్రారంభించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీనియర్‌ మోడరేట్‌ పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల వివరాలను విడుదల చేసిందని,  జిల్లాలో 700 మంది పిల్లలు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తెలిసిందని అన్నారు. దీనిని బెంచ్‌ మార్కుగా తీసుకొని జిల్లాలో ఒక్క పిల్లవాడు కూడా పోషణ లోపంతో ఉండొద్దనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్‌ మార్గదర్శనంతో జిల్లాలో ముందుస్తుగా మిల్లెట్స్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను చేపట్టినట్లు చెప్పారు. ప్రతీ శనివారం అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు మిల్లెట్స్‌ ఫుడ్‌ అందించేందుకు కార్యాచరణ  సిద్ధం చేశామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇప్పటికే ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోషకాహారం అందిస్తున్నామని, దానిని మరింత మెరుగు పర్చి చిరుధాన్యాలతో కూడిన రాగి లడ్డూలు, ఇతర ఆహార పదార్థాలను అందించనున్నామని తెలిపారు.  జిల్లాలోని 587 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో నమోదైన 36 వేల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. బాలింతలు, గర్భిణులకు కూడా పోషకాహారం అందిస్తామన్నారు. ఎనిమియా సమస్యతో గర్భిణులు,  బాలింతలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీంతో ప్రసవ సమయంలో హైరిస్క్‌ సమస్య తలెత్తుతుందని అన్నారు. ఎనిమియా శిశువుల మానసిక, భౌతిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. పిల్లల అరోగ్యం దెబ్బతింటే దేశ భవిష్యత్‌ కూడా దెబ్బతింటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పోషణపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముందస్తుగా  కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.   సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ జిల్లాలోని పిల్లలు, గర్భిణులు, బాలింతలలో పోషణలోపం అధిగమించేందుకు మిల్లెట్స్‌ ఫుడ్‌  ఫెస్టివల్‌ దోహదపడుతుందన్నారు.  జిల్లా సంక్షేమ అఽధికారి లక్ష్మీరాజం, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, మున్సిపల్‌ కో ఆప్షన్‌సభ్యుడు గొల్లపల్లి బాలయ్యగౌడ్‌ పాల్గొన్నారు. 

Read more