త్వరలో మానేరు రివర్ ఫ్రంట్ పనులు
ABN , First Publish Date - 2022-03-05T06:13:44+05:30 IST
కరీంనగర్ దిగువ మానేరు జలాశయం వద్ద ఏర్పాటు చేయనున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులను త్వరలోను ప్రారంభిస్తామని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ ఆర్వీ కర్ణన్
కరీంనగర్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్ దిగువ మానేరు జలాశయం వద్ద ఏర్పాటు చేయనున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులను త్వరలోను ప్రారంభిస్తామని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం మానేరు రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభానికి సంబంధించి స్థల సేకరణ, టూరిజం అభివృద్ధి కోసం అధికారులతో కలిసి కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. మానేరు రివర్ ఫ్రంట్‌కు రెండు వైపులా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకుగాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్థలాన్ని, ఐఎంఎల్ డిపో స్థలాన్ని, మత్స్యశాఖ కార్యాలయ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం డ్యాం గేట్ల పైనుంచి పరిశీలించారు. మానేరు రివర్ ఫ్రంట్‌కు రెండు వైపులా రిటైనింగ్ వాల్స్, పార్కులు, నడకదారులు తదితర పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలు సేకరించాలన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులకు సంబంధించి నీటిపారుదలశాఖ ఇంజనీర్లు మ్యాప్ ద్వారా చేపట్టాల్సిన పనులు వివరాలను కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్‌కుమార్, భూమి కొలతల శాఖ ఏడీ అశోక్, నీటిపారుదలశాఖ ఎస్‌ఈ శివకుమార్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, జిల్లా టూరిజం శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.
- 8న దళిత బంధు లబ్దిదారులకు వాహనాల గ్రౌండింగ్
ఈ నెల 8న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో హుజూరాబాద్ నియోజకవర్గ దళితబంధు లబ్దిదారులకు వాహనాలను గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళితబంధుపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూపుగా ఏర్పడి వాహనాలు ఎంపిక చేసుకున్న వారికి ఈ నెల 8వ తేదీన కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 123 వాహనాలు గ్రౌండింగ్ చేయాలని అన్నారు. డెయిరీ యూనిట్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు త్వరగా గ్రౌండింగ్ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.