విద్య, వైద్య రంగాల్లో అగ్రగామిగా నిలుపుదాం

ABN , First Publish Date - 2022-06-11T06:36:06+05:30 IST

పేదవాళ్లుకు విద్య, వైద్యం అందించడంలో రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుదామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శుక్రవారం కోనరావుపేట మండలం మల్కపేటలో మాజీ మంత్రి చల్మెడ అనందరావు ‘మన ఊరు.. మనబడి’ కార్యక్రమంలో భాగంగా తన తల్లి జానకీదేవి జ్ఞాపకార్థం రూ.2 కోట్లతో నిర్మించిన తొలి పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.

విద్య, వైద్య రంగాల్లో అగ్రగామిగా నిలుపుదాం
పాఠశాలను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్‌

- ముంపు గ్రామాల వద్ద విత్తన పరిశ్రమ 

- హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం

- కొదురుపాకలో సొంత నిధులతో  పాఠశాల భవనం  

- జూలై, ఆగస్టులో మల్కపేట రిజర్వాయర్‌ ప్రారంభం 

- పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు 

 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పేదవాళ్లుకు విద్య, వైద్యం అందించడంలో రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుదామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శుక్రవారం కోనరావుపేట మండలం మల్కపేటలో మాజీ మంత్రి చల్మెడ అనందరావు ‘మన ఊరు.. మనబడి’ కార్యక్రమంలో భాగంగా తన తల్లి జానకీదేవి జ్ఞాపకార్థం  రూ.2 కోట్లతో నిర్మించిన తొలి పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ‘మన ఊరు మనబడి’లో భాగంగా రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా మల్కపేట పాఠశాల నిర్మాణం పూర్తి చేసుకొని ఈ విద్యా సంవత్సరానికి ముందే ప్రారంభించుకున్నామన్నారు. చల్మెడ కుటుంబసభ్యులను స్ఫూర్తిగా తీసుకొని మరికొంత మంది ముందుకు రావాలన్నారు. ‘మన ఊరు మనబడి’లో రూ 7300కోట్లతో 26 వేల పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులను కల్పించనున్నట్లు చెప్పారు. క్రీడా మైదానాలు, డిజిటల్‌ తరగతులు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మూడేళ్లలో మౌలిక వసతులు కల్పించడానికి ప్రణాళికలు రూపొందించారని, ఇందులో సగం రోజుల్లోనే జిల్లాలోని పాఠశాలలను కార్పొరేట్‌ సంస్థలు, సీఎస్‌ఆర్‌ నిధులతోపాటు దాతలను భాగస్వాములను చేసి రాష్ట్రంలోనే సిరిసిల్లను అగ్రగామిగా నిలపాలని అన్నారు. ఇదే స్ఫూర్తితో తన నాన్నమ్మ ఊరైన కామారెడ్డి జిల్లా కోనాపూర్‌లో  రూ.2 కోట్లతో బడిని నిర్మిస్తున్నామని, అదే విధంగా సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో పాఠశాలను నిర్మిస్తామని అన్నారు. తాను అమెరికా వెళ్లినపుడు తరగతి గదుల నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఐలు  ముందుకొచ్చారన్నారు. మల్కపేటలో నిర్మించిన పాఠశాలను జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ తెలంగాణను అదర్శవంతంగా నిలుపుతున్నామన్నారు. 6 గంటలు కూడా సరఫరాకాని విద్యుత్‌ ఇప్పుడు 24 గంటలు సరఫరా చేస్తున్నామన్నారు.  అన్నదాతకు పెట్టుబడి సాయంగా రైతుబంధు అందిస్తున్నామని, దీనికి తోడుగా రైతుబీమా వంటి పథకాలు కూడా ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో తాగు, సాగు నీటితో పాటు విద్యుత్‌, సంక్షేమ పథకాలకు తోడుగా విద్య, వైద్యాన్ని యజ్ఞంలా పేదలకు అందించే దిశగా కార్యక్రమాల రూపకల్పన చేశామన్నారు. వైద్య రంగంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు, సిరిసిల్ల జిల్లాలో హెల్త్‌ ప్రొపైల్‌లో భాగంగా 4 లక్షలకు పైగా మందికి త్వరలో హెల్త్‌ కార్డులు అందించనున్నట్లు చెప్పారు.  వేములవాడ నియోజకవర్గంలో ముంపు గ్రామాల వద్ద 25 ఎకరాల్లో విత్తన పరిశ్రమ స్థాపన కూడా జరుగుతుందని, పరిశ్రమ ద్వారా 250 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అన్నారు. ముంపుగ్రామాల వద్ద ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మల్కపేట వద్ద నిర్మించిన రిజర్వాయర్‌ను జూలై, ఆగస్టులో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోనున్నామని, అప్పుడే పెండింగ్‌ సమస్యలను కూడా పరిష్కరించుకుందామని అన్నారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ఏడాది రాష్ట్రంలో 35 శాతం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధిస్తూ ముందుకెళ్తోందన్నారు.    సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్యేలు రమేష్‌బాబు, సుంకె రవిశంకర్‌, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, పరిశ్రమల శాఖ కమిషనర్‌ కృష్ణభాస్కర్‌,  కలెక్టర్‌ అనురాగ్‌జయంతి, మాజీ మంత్రి చల్మెడ అనందరావు, చల్మెడ లక్ష్మీనర్సింహరావు, ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సర్పంచ్‌ ఆరె లత, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.


విత్తన పరిశ్రమకు ఒప్పందాలు 

వేములవాడ నియోజకవర్గంలోని ముంపు గ్రామాల వద్ద 25 ఎకరాల్లో డెక్కన్‌ అగ్రి ప్రైవేట్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌ నిర్మించే విత్తన పరిశ్రమ స్థాపన ఒప్పందాన్ని పురపాలక,ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో ఆ సంస్థ ఎండీ సుబ్బరాజు, పరిశ్రమల శాఖ కమిషనర్‌ కృష్ణభాస్కర్‌ ఒప్పందాలు చేసుకున్నారు. విత్తన పరిశ్రమ స్థాపనకు ఎమ్మెల్యే రమేష్‌బాబు కృషిని అభినందించారు. పరిశ్రమ స్థాపనతో 250 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని, వరి విత్తనాల ఉత్పత్తికి బీజం పడుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ముంపు గ్రామాల యువత ఉపాధి కోసం మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. 

వినతుల కోసం తోపులాట 

మల్కపేటలో ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌కు వినతి పత్రాలు అందించే క్రమంలో  తోపులాట చోటు చేసుకుంది. అనంతరం పోలీసుల జోక్యంతో ప్రశాంత వాతా వరణంలో వినతిపత్రాలు తీసుకున్నారు.  


Read more