కదం తొక్కిన కాంగ్రెస్ నేతలు
ABN , First Publish Date - 2022-08-10T06:22:37+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంటూ... ప్రభుత్వ తీరును నిరసిస్తూ కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్రలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి కదం తొక్కారు.

- పొన్నం పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
- బీజేపీకి మనుగడ లేదు : పొన్నం
సిరిసిల్ల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంటూ... ప్రభుత్వ తీరును నిరసిస్తూ కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్రలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి కదం తొక్కారు. మంగళవారం గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజీ వద్ద ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పొన్నం చేపట్టిన పాదయాత్రను ప్రారంభించారు. తొలి రోజు 14 కిలోమీటర్లు నిరాటంకంగా సాగింది. గోరంటాల, గజసింగవరం, నాగంపేట, సముద్రలింగాపూర్, తిమ్మాపూర్, సత్తెపీరీల దర్గా గొల్లపల్లి మీదుగా పాదయాత్ర ఎల్లారెడ్డిపేటకు చేరుకుంది. పొన్నం ప్రభాకర్ దారి పొడువునా రైతులు, కార్మికులు, మహిళలను పలకరిస్తూ వారు ఎదుర్కొం టున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై దీర్ఘకాళి కంగా పోరాటం జరిపే తీరును వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి ముఖ్య కాంగ్రెస్ నాయకులు తరలివచ్చారు. ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో భాగస్వాములు అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ యాత్ర ముందుకు సాగింది.
కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర ...
గంభీరావుపేట: దేశ స్వాతంత్రం మొదలు కొని నేటి వరకు కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. పాద యాత్రను ప్రారంభం సందర్భంగా మాట్లాడారు. పాదయాత్ర రాష్ట్రంలోనే ప్రాదన్యం సంతరించుకుందన్నారు. సిరిసిల్ల. వేములవాడ. చొప్పదండి, కరీంనగర్, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ 7 నియోజక వర్గాల్లో పాదయాత్ర చేపడుతున్న పొన్నం ప్రబాకర్గౌడ్ను అభినందించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆనాడు మహత్మాగాంధీ పిలుపు మేరకు యావత్ భారతావని ఉద్యమంలో పాల్గొని ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగాలు చేస్తే, సాధించుకున్న స్వతంత్య్ర భారతవనిలో సమగ్రత కొరకు, ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించిన త్యాగ మూర్తుల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందన్నారు. జాతీయ స్థాయిలో రాహుల్‌గాందీ నాయకత్వంలో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ అడుగు జాడల్లో దేశ సమగ్రత కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.
టీఆర్ఎస్ వైఖరి ఎండగడుదాం..
ప్రజా స్వామ్యంలో ఎవరైనా ప్రజాప్రతినిధి చనిపోతే ఉపఎన్నికలు వస్తాయని, అలా కాకుండా రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తేవడం ప్రజాస్వామ్యాన్ని చంపడం కాదా? అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. పాదయాత్రలో అయన మాట్లాడుతూ మరి కొన్ని చోట్ల కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయని బీజేపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోసాలు, అబద్ధాలు, అవినీతితో రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ వైఖరిని ఈ పాదయాత్రలో ఎండగడుతామన్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన అంశాలను వివరించనున్నట్లు చెప్పారు. ఈ రోజు ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతున్నా భారతదేశం మాత్రం ఆర్థికంగా పరిపుష్టిగా ఉండడానికి ఆ రోజు కాంగ్రెస్ చేసిన సేవలే అన్నారు. అలాంటి నేతల చరిత్ర లేకుండా 75 ఏళ్ల భారాతవని లేదని, ఈ తరానికి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భారతదేశ తొలి ప్రధానమంత్రి నెహ్రూ పేరును ప్రస్తావన చేయక పోవడం బాఽధాకరమన్నారు. వానదేవుడి ఆశీర్వాదంతో పాదయాత్రను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, వేములవాడ పార్టీ ఇన్చార్జి ఆది శ్రీనివాస్, చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవీందర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్, పట్టణ కాంగ్రెస్ అధ్య క్షుడు పాపగారి రాజుగౌడ్, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఽఅధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎల్లారెడ్డిపేట మం డల అధ్యక్షుడు నర్సయ్య, ఎంపీటీసీ పర్శరాములు ఉన్నారు.