కేటీఆర్‌కు దేవుళ్ల గురించి మాట్లాడే హక్కు లేదు

ABN , First Publish Date - 2022-09-19T05:52:25+05:30 IST

పూజల గురించి, దేవుళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని దుబ్బాక ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

కేటీఆర్‌కు దేవుళ్ల గురించి మాట్లాడే హక్కు లేదు
వేములవాడలో విలేకరులతో మాట్లాడుతున్న రఘునందన్‌రావు

-దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

వేములవాడ, సెప్టెంబరు 18 : పూజల గురించి, దేవుళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని దుబ్బాక ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని  ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం స్థానిక బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేవుళ్లు, పూజల గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అంటున్నారని,  వేములవాడ రాజన్నను ఏనాడూ దర్శించుకోని మంత్రి కేటీఆర్‌కు హిందువుల గురించి ఏం తెలుసని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా వేములవాడకు వచ్చి రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఏడాదికి వంద కోట్లు ఇస్తానని మాట ఇచ్చి తప్పారని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా హిందువుల గురించి మాట్లాడితే మత పిచ్చి ఎట్లవుతదో, ముస్లింలు ఇతర మతాల గురించి మాట్లాడితే సెక్యులరిజం ఎలా అవుతుందో మంత్రి కేటీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. హిందువుల గురించి మాట్లాడితే మత పిచ్చి, ముస్లిం మైనార్టీల గురించి మాట్లాడితే సెక్యులరిజం అని కేటీఆర్‌లో ఉన్న భావనను తొలగించాలని వేములవాడ రాజన్నను వేడుకున్నానని, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్లుగా, నాస్తికుడిగా ఉన్న మంత్రి కేటీఆర్‌ ఆస్తికుడిగా మార్చాలని శివయ్యను వేడుకున్నానని అన్నారు. హిందూ మతం మీద జరుగుతన్న దాడిని ప్రజలంతా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించాలని తలపెట్టిన తరువాతనే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేరు మార్చి సంబరాలు జరిపిందన్నారు. ఎంఐఎం పార్టీ రజాకార్ల వారసత్వం నుంచి  పుట్టుకొచ్చిందని, తెలంగాణ సిద్ధించిన ఎనిమిది సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంఐఎం పార్టీ అనుమతి తీసుకొని పేరు మార్చి సంబరాలు నిర్వహించారని అన్నారు.  బైంసాలో అల్లర్లు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదని, ఓట్ల కోసమే నాడు కేసీఆర్‌ ప్రభుత్వం మౌనం వహించిందని ఆరోపించారు. వేములవాడకు వచ్చిన కేటీఆర్‌ సెప్టెంబరు 17వ తేదీ గురించి ప్రజలకు చెప్పకుండా కేవలం భారతీయ జనతా పార్టీని విమర్శించడానికే సభ పెట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ఈ ప్రాంత సమస్యలు కూడా సరిగా తెలియవనీ, ఆయన ఏ దేశ పౌరుడో తెలియదనీ, 8 ఏళ్లుగా కోర్టులను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారనీ విమర్శించారు. మరో మూడు నెలల్లో వేములవాడలో ఉప ఎన్నిక రాబోతోందని జోస్యం చెప్పారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో దళిత బంధు వచ్చిందనీ, మునుగోడు ఉప ఎన్నికతో గిరిజనబంధు రాబోతోందనీ,  త్వరలో వేములవాడ ఉప ఎన్నికతో బీసీ బంధు కూడా వస్తుందనీ అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-19T05:52:25+05:30 IST