అందరికీ న్యాయం జరగాలి
ABN , First Publish Date - 2022-06-25T06:55:17+05:30 IST
రాష్ట్ర ప్రజందరికీ న్యాయం జరగాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రతీ కులంలో పేదలు ఉన్నారని, పేదరికానికి కులం, మతం లేదని, నాకు కులం అంటే అభివృద్ధి, మతం అంటే సంక్షేమమని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

- పేదరికానికి కులం, మతం లేదు
- పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు
సిరిసిల్ల, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజందరికీ న్యాయం జరగాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రతీ కులంలో పేదలు ఉన్నారని, పేదరికానికి కులం, మతం లేదని, నాకు కులం అంటే అభివృద్ధి, మతం అంటే సంక్షేమమని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం సాయిమణికంఠ ఫంక్షన్హాల్లో రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కూర అంజిరెడ్డితో పాటు 26 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం కేటీఆర్ నియామక పత్రాన్ని అందించి అభినందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రెడ్డి సామాజికవర్గంలోనూ చాలామంది పేదరికంలో ఉన్నారన్నారు. గతంలో ఒకసారి ముస్తాబాద్ మండలం బందనకల్‌లో పేదరికంలో ఉన్న ఒక రెడ్డి రైతు చనిపోతే అ కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. పేదరికంలో రైతు కుటుంబసభ్యుల వద్దకు స్వయంగా వెళ్లానని వారు పింఛన్ కావాలని కోరారన్నారు. రైతు కుటుంబం పరిస్థితిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళితే అన్ని కుటుంబాలకు ఆదుకునే విధంగా రైతు బీమాను తీసుకవచ్చారని తెలిపారు. కులం, మతం ఏదైనా పేదవారందరికీ న్యాయం జరగాలని ఒక రైతు చనిపోతే ఆ కుటుంబం వీదిన పడకుండా దేశంలో ఎవ్వరూ చేయని విధంగా రైతు బీమా అలోచన చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు పెట్టుబడిసాయంగా రైతుబంధు అందిస్తున్నామని అన్నారు. ఈ నెల 28 నుంచి రైతు బంధు రైతుల ఖాతాల్లో జమ అవుతుందని అన్నారు. ఇప్పటి వరకు 58 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. అంతేకాకుండా 24 గంటల కరెంట్ అందిస్తున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రం సమయంలో సిరిసిల్లలో ఎవరైనా చనిపోతే స్నానాలు చేయాలని కరెంట్ వేయమని సెస్ అధికారులను కోరే పరిస్థితి ఉండేదన్నారు. అప్పుడు కరెంట్ ఉంటే వార్త, ఇప్పుడు పోతే వార్తయిందని అన్నారు. సిరిసిల్ల ఒకప్పుడు తాలుకాగా ఉంటే కేసీఆర్ ఆశీస్సులతో జిల్లాగా మారిందన్నారు. జూనియర్ కళాశాల కోసమే ఒకప్పుడు యుద్ధం చేసే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు జిల్లా కేంద్రానికి వస్తుండగానే జిల్లెల్ల వద్ద అన్ని సౌకర్యాలతో వ్యవసాయ కళాశాల నిర్మించుకన్నామన్నారు. మరోవైపు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, నర్సింగ్ కళాశాలలు, గంభీరావుపేటలో కేజీ టూ పీజీ కాలేజి సముదాయం నిర్మించుకున్నామని అన్నారు. అగ్రహారం డిగ్రీ కాలేజీలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ ప్రారంభించుకున్నామని త్వరలోనే అన్ని సౌకర్యాలతో క్యాంపస్ నిర్మాణానికి, మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కాలేజీలు మంజూరు చేయిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో కళాశాలలు ఏర్పడుతున్న క్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో బాలురు, బాలికలకు వేర్వేరుగా హాస్టళ్లను నిర్మిస్తామని చెప్పడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం తీసుకువచ్చినా కులం, మతం, ప్రమేయం లేకుండా పేదవారందరికీ న్యాయం జరిగే విధంగా సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ముందుకు వెళ్తున్నారన్నారు. కేసీఆర్ రైతుబిడ్డ కాబట్టే రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా శ్రీరాజరాజేశ్వర మిడ్ మానేరు, అన్నపూర్ణ, మల్లన్నసాగర్, ప్రాజెక్ట్‌ల ద్వారా ఎగువ మానేరు వరకు నీటిని తీసుకువచ్చామని, మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసుకోవడంతో జిల్లాలో ఆరు మీటర్లకు భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ముస్సోరిలో ఐఏఎస్‌లకు భూగర్భ జలాల పెరుగుదలపై పాఠాలుగా మారాయన్నారు. సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేను అయ్యానని, ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో మంత్రిని అయ్యానని, అమెరికా వెళ్లినా, దావోస్ వెళ్లినా నాకు దక్కే గౌరవం సిరిసిల్ల ప్రజలు ఇచ్చిందేనని అన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ మేనిఫేస్టోలో రెడ్డి, వైశ్య కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామన్నారు. కరోనా వల్ల కొంత జాప్యం జరిగిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత తొందరలో రెడ్డి కార్పొరేషన్ హామీ నేరవేరే విధంగా కృషి చేస్తానన్నారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కూర అంజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళచక్రపాణి, ఇల్లంతకుట ఎంపీపీ వెంకటరమణారెడ్డి, రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూపరాణి, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్‌రెడ్డి, మట్ట వెంకటేశ్వరరెడ్డి, ఏనుగు మనోహార్‌రెడ్డి, పూర్మాణి రాంలింగారెడ్డి, కనమేని చక్రధర్‌రెడ్డి, నేవూరి మమత, మహేందర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
రెడ్డి సంఘం ప్రమాణస్వీకారోత్సవం...
రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయిమణికంఠ ఫంక్షన్హాల్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో అధ్యక్షుడిగా కూర అంజిరెడ్డి, ఉపాధ్యక్షులుగా పాశం రాజిరెడ్డి, బానాపురం రంగారెడ్డి, జువ్వింతుల లక్ష్మారెడ్డి, మిట్టపల్లి సతీష్‌రెడ్డి, లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డి, మడుపు ప్రమోదరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మడూరి రాంరెడ్డి, కార్యదర్శులుగా ఎగుమామిడి కృష్ణారెడ్డి, ఏరెడ్డి రాజిరెడ్డి, అబ్బాడి తిరుపతిరెడ్డి, బిచాల రాజిరెడ్డి, దుండ్ర జలజరెడ్డి, కోశాధికారిగా అవురం సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఉప్పుల లక్ష్మారెడ్డి, కారెడ్డ మల్లారెడ్డి, దండిగల రామిరెడ్డి, నల్ల నాగిరెడ్డి, అరుట్ల మహేష్‌రెడ్డి, అల్లూరి రవీందర్‌రెడ్డి, కంది సుజాతరెడ్డి, ప్రచార కార్యదర్శులు ఎడమల హన్మంతరెడ్డి, బొందుగుల దేవిరెడ్డి, కామినేని శ్రీనివాసరెడ్డి, నేవూరి శ్రీనివాసరెడ్డి, తోకల శివారెడ్డి, న్యాయ సలహాదారుడు గడ్డం సత్యనారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యవర్గాన్ని జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన రెడ్డి సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రెడ్డి సంఘం ప్రతినిధులు హాజరయ్యారు.
అన్ని కుల సంఘాలకు అత్మగౌరవ భవనాలు..
జిల్లా కేంద్రంలో అన్ని కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు స్థలాలను కేటాయించి ఆర్థిక సహాయం అందజేస్తానని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టరేట్లో బీసీ కులసంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో పెరిగానని, కాన్వెంట్లో చదవడంతో కుల, మతాపై అవగాహన లేదని, రాజకీయాలకు వచ్చిన తరువాతే కుల, మతాల గురించి తెలిసిందని అన్నారు. తనకు కులం అంటే అభివృద్ధి, మతం అంటే సంక్షేమమని అన్నారు. కుల మతాలు, పొత్తుల సద్దిలెక్క ఉండాలని అన్నారు. తనకు కుల గజ్జి లేదన్నారు. సిరిసిల్లలో పద్మశాలి, రెడ్డి సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు స్థలాలు ఆర్థిక సహాయం అందించామన్నారు. అలాగే గొల్ల, కుర్మ, గంగపుత్ర, గౌడ్, మున్నూరుకాపుతో సహా అన్ని కులాల ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు కేటాయిస్తామన్నారు. ఇప్పటికే స్థలాలను గుర్తించామన్నారు. స్థలాలను కేటాయించే విధంగా కలెక్టర్, అధికారులకు సూచించామన్నారు. ఆత్మగౌరవ భవనాల భూమి పూజ కార్యక్రమానికి తాను స్వయంగా వస్తానని సంఘాల ప్రతినిధులతో స్వయంగా మాట్లాడుతానని అన్నారు. కేటాయించిన స్థలాల్లో ఫంక్షన్‌హాల్‌తో పాటు పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా బాల, బాలికలకు విడివిడిగా హాస్టళ్లను నిర్మించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉండి చదువుకోవడానికి నాణ్యమైన వసతిని కల్పించాలని అన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతుందని అన్నారు. విదేశాలకు వెళ్లడానికి నిధి కూడా ఏర్పాటు చేసిందని అన్నారు. తెలంగాణ రాకముందు 16 బీసీ గురుకులాలు ఉంటే ఇప్పుడు 119 గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. సిరిసిల్లలో బీసీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవన నిర్మాణాన్ని చేపడుతామని అన్నారు. పేదరికానికి కులం, మతం లేదని తాను అందరివాడుగా ఉండడమే ఇష్టమని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గొల్ల కుర్మలకు లబ్ధి చేకూరిందని అన్నారు. బీసీలు, బలహీన వర్గాలకు తాతల నాటి కులవృత్తి చేసుకునే విధంగా గొర్రెలు పంపిణీ చేస్తే కొందరు వెటకారం చేస్తున్నారని అన్నారు. కుల వృత్తి చేసుకోవడం నామోషీగా భావించవద్దని, గౌరవంగా బతకాలని అన్నారు. త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. సిరిసిల్ల ప్రజల అశీర్వాదంతో ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి అశీస్సులతో మంత్రినయ్యానని అన్నారు. తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ప్రతి కుల సామాజిక వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. వివిధ సంఘాల ప్రతినిధులు సంఘ భవనాలకు స్థలాలు, ఆర్థిక సహాయం అందించాలని వినతిపత్రాలను అందించారు. వారు కోరినట్లుగానే జిల్లా కుల సంఘాల భవనాలకు స్థలంతో పాటు ఆర్థిక సహాయం అందించడానికి మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా అదనపు కలెక్టర్లు బి సత్యప్రసాద్, ఖీమ్యానాయక్, ఎస్పీ రాహూల్‌హెగ్డే, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళచక్రపాణి, రామతీర్థపు మాధవి రాజు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, టీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.