బీజేపీ శ్రేణుల్లో జోష్
ABN , First Publish Date - 2022-12-16T01:20:14+05:30 IST
ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సక్సెస్ భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, పలువురు నేతలు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ప్రసంగించిన తీరు సభికులను ఆకట్టుకున్నది.
- ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభ విజయవంతం
- వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
- ఉత్సాహ పరిచిన జేపీ నడ్డా, బండి సంజయ్, అరవింద్
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సక్సెస్ భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, పలువురు నేతలు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ప్రసంగించిన తీరు సభికులను ఆకట్టుకున్నది. 21 రోజుల పాటు భైంసా నుంచి కరీంనగర్ వరకు జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కాగా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు వచ్చారు.
ఫ గంటన్నర ఆలస్యంగా వచ్చిన నడ్డా
మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ఉంటుందని మొదట ప్రకటించినప్పటికీ, జేపీ నడ్డా 3:40గంటలకు కరీంనగర్‌కు వస్తారని షెడ్యూల్లో పేర్కొన్నారు. గంటన్నర ఆలస్యంగా ఆయన వచ్చినప్పటికీ సభలో జనం ఓపికతో ఉన్నారు. సభలో నడ్డా ప్రసంగిస్తూ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముందుగా రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు అంజన్నకు నమస్కరిస్తున్నానని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు బండి సంజయ్‌ను ఎంపీగా ఎన్నుకోవడం వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి జరిగింది అని పేర్కొన్నారు. ఐదు విడతలు, 114 రోజులు, 56 అసెంబ్లీ సెగ్మెంట్లలో 1458 కిలో మీటర్లు పూర్తయిన సంగ్రామ యాత్ర ఈ రోజు కరీంనగర్లో ముగిసిందని అన్నారు. ఈ యాత్ర ఆగేది కాదని, ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. ‘ప్రజా గోస, బీజేపీ భరోసో’ నినాదంతో గ్రామగ్రామాన ఈ పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. ‘సాలు దొర.. సెలవు దొర’, ‘గుడ్ బై కేసీఆర్’ అనే నినాదాలతో పార్టీ శ్రేణులు ముందుకు వెళుతాయని చెప్పారు.ఇక్కడికి వస్తున్న తనను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇలాంటి వారిని ప్రజలే దహనం చేసి కాలగర్భంలో కలిపేస్తారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ బీజేపీతో కలిసి రావాలని పిలపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమని, వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని జేపీ నడ్డా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫ కరీంనగర్ ప్రజల ఆశీస్సులతోనే ఎదిగాను
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్
కరీంనగర్ ప్రజల ఆశీస్సులతోనే తాను ఎదిగానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ గడ్డ మీద పౌరుషం, ఆవేఽశం ఉందని, తాను ఇక్కడనే జన్మించానని అన్నారు. దుర్గమ్మ, లక్ష్మమ్మ, పార్వతమ్మ ఆశీర్వాదంతో తనకు పునర్జన్మ లభించిందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే తనను ఆ తల్లులు బతికించారని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొదట అర్బన్ బ్యాంకు డైరెక్టర్‌గా పని చేశానని, ఈ గ్రౌండ్ పక్కనే గల 48వ డివిజన్ ప్రజలు తనను రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలిపించారని తెలిపారు, వారి ఎప్పుడు రుణ పడి ఉంటానని ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 2014లో 53 వేల ఓట్లు, 2018లో 68 వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. తనకు గెలుపు ముఖ్యం కాదని, ధర్మం కోసం పని చేయడమే తన లక్ష్యమని అన్నారు. తాను ఓడిపోతే దేశమంతటా చర్చ జరిగిందని, చాలా మంది ఏడ్చారని, ఈ విషయం తెలుసుకున్న అధిష్టానం 2019లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఎన్నికల్లో సంజయ్ ఎలా గెలుస్తాడు, డబ్బులు లేవని, మందు పోయడని, గ్రామాల్లో కేడర్ లేదని, డిపాజిట్ కూడా రాదని హేళన చేశారని తెలిపారు. గులాబీ జెండాను బొంద పెట్టి లక్ష మెజారిటీతో కాషాయ జెండాను ఎగుర వేసిన తర్వాత మొత్తం దేశం ఆశ్చర్య పోయారని అన్నారు. ఇక్కడి ప్రజలు కష్టపడి గెలిపించడం వల్లనే జాతీయ నాయకత్వం గుర్తించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందని, అందుకు కారణం కరీంనగర్ ప్రజలేనని అన్నారు. నీళ్లు, నియమకాలు, నిధులు సాధించడం లేదన్నారు. అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తుంటే, రాష్ట్రం వాటా చెల్లించకుండా అడ్డు పడుతున్నారని, ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 24 గంటలు ప్రధాని నరేంద్ర మోదీని తిడుతున్నాడని అన్నారు.
జేపీ నడ్డాను అడ్డుకునే యత్నం
కరీంనగర్ క్రైం, డిసెంబరు 15: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరీంనగర్ ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే యత్నం చేశారు. జేపీ నడ్డా గురువారం సాయంత్రం హెలికాప్టర్లో కరీంనగర్ శివారులోని రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచిఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బయలు దేరారు. మార్గమధ్యలో తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూలం సంపత్‌గౌడ్, పెండ్యాల మహేష్‌కుమార్, రవి నాయక్, రుద్ర రాధ, గంటల రేణుక ‘గో బ్యాక్ నడ్డా’ అంటూ ప్లకార్డులు చేతిలో పట్టుకుని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ సమయంలో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు వారిని కాన్వాయ్‌కు సమీపంలోకి రాకుండా రోడ్డుపైనే అడ్డుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు.
బీజేపీ సభలో చెయిన్‌స్నాచింగ్...
కరీంనగర్ క్రైం, డిసెంబరు 15 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌కుమార్ చేపట్టిన ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభలో చెయిన్స్నాచర్, పిక్పాకెటర్లు వారి హస్తలాఘవాన్ని ప్రదర్శించారు. సభకు వచ్చిన ఇద్దరి మెడలోని బంగారు గొలుసులు, ఒక వ్యక్తి పర్సును దొంగలు చోరీ చేశారు. బాధితులు వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురాగా పోలీసులు ఇద్దరు చెయిన్స్నాచర్లను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
ఫ ట్రాఫిక్ జాంతో ప్రజల ఇక్కట్లు...
బీజేపీ సభ సందర్భంగా సాయంత్రం సమయంలో కరీంనగర్-జగిత్యాల రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సభకు దూరప్రాంతాల నుంచి వాహనాల్లో కార్యకర్తలు, ప్రజలు తరలిరాగా, వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రజలు ఇబ్బందిపడ్డారు. ప్రధానంగా పాఠశాలలు, కళాశాల, ప్రభుత్వ కార్యాలయాలు ముగిసే సమయంలో వాహనాల రద్దీ అధికమైంది. ఇంకోవైపున అంతర్గత రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేయడంతో నగరవాసులు ఇబ్బంది పడ్డారు.
ఫ హెలిక్యాప్టర్‌లో కరీంనగర్‌కు... కారులో హైదరాబాద్‌కు..
జేపీ నడ్డా సాయంత్రం హెలిక్యాప్టర్‌లో కరీంనగర్‌కు చేరుకుని సభలో మాట్లాడిన అనంతరం కారులో రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్ళారు. చీకటి సమయంలో హెలిక్యాప్టర్‌లో వెళ్లలేక పోవటంతో నడ్డా కారుద్వారా హైదరాబాద్ వెళ్లిపోయారు. నడ్డా వచ్చిన హెలిక్యాప్టర్ వెంటనే హైదరాబాద్‌కు వెళ్లిపోగా అందులో బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ వెళ్లారు.
ఫ కొత్తపల్లిలో ప్రారంభం.. కరీంనగర్లో ముగింపు
కరీంనగర్‌రూరల్5: బీజేపీరాష్ట్ర అద్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర కొత్తపల్లిలో గురువారం ఉదయం కొత్తపల్లిలో ప్రారంభమైంది. నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వెంట రాగా బీజేపీ అధ్యక్షుడి పాద యాత్ర ముందుకు సాగింది. పార్టీ కార్యకర్తలు ఎక్స్కావేటర్లతో పూలు చల్లుతూ స్వాగతం పలికారు. నగరంలోని రేకుర్తి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి యాత్రను కొనసాగించారు. రేకుర్తిలో ఎన్నం ప్రకాశ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమం ఏర్పాటుచేశారు. పాదయాత్ర కరీంనగర్ ఎస్సారార్ మైదానానికి చేరుకోవడంతో ముగిసింది. సభ అనంతరం ఇంటికి చేరుకున్న బండి సంజయ్‌కు ఆయన సతీమణి మంగళహారతితో స్వాగతం పలికారు.