ఆసరా పింఛన్లపై ఆశలు

ABN , First Publish Date - 2022-08-09T05:59:27+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మందికి ఆసరా పథకం కింద పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించారు.

ఆసరా పింఛన్లపై ఆశలు

- త్వరలోనే మంజూరు చేస్తామని సీఎం ప్రకటన

- పెండింగులో 10,194 దరఖాస్తులు

- యాభై ఏడు ఏళ్లు నిండిన వారి దరఖాస్తులు 22,640..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మందికి ఆసరా పథకం కింద పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించారు. దీంతో వివిధ కేటగిరీల్లో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు 57 ఏళ్లు నిండిన వాళ్లు సైతం తమకు పింఛన్‌ వస్తుందని ఆశలు పెంచుకున్నారు. దీనికి తోడు గత నాలుగు రోజుల నుంచి 2019 నుంచి వివిధ కేటగిరీల కింద ఆసరా పింఛన్‌ కోసం వచ్చిన దరఖాస్తుల విషయమై, 57 ఏళ్లు నిండిన వారి నుంచి వచ్చిన దరఖాస్తుల విషయమై ప్రభుత్వం ఆరాతీస్తున్నది. గ్రామీణాభివృద్ధి శాఖాధికారుల నుంచి కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఓటు బ్యాంకులో ప్రధానమైన వాళ్లు ఆసరా పింఛన్‌దారులు. ఈ పథకానికి తొలి ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో కంటే అత్యధిక డబ్బులు ఇస్తున్నది. మొదట దివ్యాంగులకు 1500, ఇతరులకు 1000 రూపాయల చొప్పున ఇస్తూ వచ్చింది. పింఛన్ల మంజూరును నిరంతర ప్రక్రియగా చేపట్టింది. 2018 డిసెంబర్‌లో నిర్వహించిన ముందస్తు ఎన్నికల సందర్భంగా తాము మళ్లీ అధికారంలోకి వస్తే మాత్ర దివ్యాంగులకు 3016, ఇతరులకు 2016 రూపాయల చొప్పున పింఛన్‌ ఇస్తామని, వృద్ధాప్య పింఛన్లకు అర్హత వయస్సును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చింది. కానీ పింఛన్లను ఇప్పటివరకు మంజూరు చేయలేదు. ఇప్పుడు, అప్పుడు అంటూ ప్రభుత్వం సాగదీస్తూ వచ్చింది. 

రెండుసార్లు దరఖాస్తుల స్వీకరణ..

ఎక్కడైతే అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయో అక్కడ పింఛన్లను మంజూరుచేశారు. మిగతా చోట్ల మంజూరుచేయలేదు. 57 ఏళ్లు నిండిన వారినుంచి రెండుసార్లు దరఖాస్తులు స్వీకరించారు. 2020లో ఒకసారి, మరొకసారి 2021లో మీ సేవా ద్వారా తీసుకున్నారు. కానీ ఇప్పుడు, అప్పుడు అంటూ ప్రభుత్వం ఊరిస్తూ వస్తున్నది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలం ఉండడం, పార్టీ పరంగా సీఎం కేసీఆర్‌ చేయిస్తున్న సర్వేల్లో మూడున్నరేళ్లుగా పింఛన్లు మంజూరు చేయక పోవడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో సత్వరమే పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. మొదట మంజూరుకు అర్హత సాధించి పెండింగులో ఉన్న వారికి పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఆ తర్వాత 57 ఏళ్లు నిండిన వాళ్ల దరఖాస్తులను పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తున్నది. 2019 నుంచి ఇప్పటి వరకు వివిధ కేటగిరీలకు చెందిన వారి నుంచి 10,194 మంది అర్హులని అధికారులు గుర్తించారు. ఇందులో వృద్ధాప్య 2,538, వితంతు 5,143, దివ్యాంగులు 1,427, గీత కార్మికులు 305, చేనేత 138, బీడీ కార్మికులు 6, బోధకాలు బాధితులు 18 మంది, ఇతరులు 268 మంది ఆసరా పింఛన్లకు అర్హులని అధికారులు గుర్తించారు. ఈ దరఖాస్తులను మంజూరు కోసం సిద్ధం చేశారు. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలు ఇస్తే అప్పుడు వారికి పింఛన్లు మంజూరు కానున్నాయి. 

విడుదల కాని మార్గదర్శకాలు..

యాభై ఏడు ఏళ్లు నిండిన వారి నుంచి 22,640 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అంతర్గాం మండలంలో 659 దరఖాస్తులు, ధర్మారం మండలంలో 1429, ఎలిగేడు మండలంలో 741, జూలపల్లి మండలంలో 1195, కమాన్‌పూర్‌ మండలంలో 932, మంథని మండలంలో 1764, ముత్తారం మండలంలో 872, ఓదెల మండలంలో 1332, పాలకుర్తి మండలంలో 1186, పెద్దపల్లి మండలంలో 3240, రామగిరి మండలంలో 1099, రామగుండంలో 4606, కాల్వశ్రీరాంపూర్‌ 1627, సుల్తానాబాద్‌ మండలంలో 1958 మంది మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు మార్గదర్శకాలను విడుదల చేయలేదు. అలాగే దరఖాస్తుల పరిశీలనకు గ్రామీణాభివృద్ధి శాఖాధికారుల వద్ద హార్డ్‌ కాపీలు లేవు. వెబ్‌సైట్‌కు సంబంధించిన లింక్‌ రాలేదు. ముందుగా పెండింగులో ఉన్న అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయనున్నారని తెలుస్తున్నది. ఆ తర్వాత 57 ఏళ్ల దరఖాస్తులను పరిశీలించనున్నారని సమాచారం. ఆసరా పింఛన్ల మంజూరు విషయమై డీఆర్‌డీఓ శ్రీధర్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఆసరా పింఛన్ల మంజూరు విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని చెప్పారు.

Updated Date - 2022-08-09T05:59:27+05:30 IST